Suryaa.co.in

Telangana

బిఆర్ఎస్ కు దిమ్మ తిరిగే విధంగా మరి కొద్ది రోజుల్లో రెండు గ్యారెంటీల అమలు

-ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు
-రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం
-తెలంగాణ ప్రజల కలలు ఆకాంక్షలు నిజం చేస్తాం
-సంపద సృష్టిస్తాం సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతాం
-విద్యా వైద్యం ఉద్యోగ ఉపాధి మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట
-మధిరలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

బిఆర్ఎస్ కు దిమ్మ తిరిగే విధంగా మరి కొద్ది రోజుల్లో రెండు గ్యారెంటీలను అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం, నిధానపురం, చిలుకూరు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆవాక్కులూ చవాక్కులు పేల్చుతున్న బిఆర్ఎస్ నాయకులకు మరో రెండు గ్యారంటీలు అమలు చేసి దిమ్మ తిరిగే సమాధానం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నదని వెల్లడించారు.రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం TSPSC ప్రక్షాళన మొదలైందన్నారు. చైర్మన్ తో పాటు కమిటీ సభ్యుల నియామకం పూర్తి చేశామని, ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విధంగానే ఉద్యోగాల నియామకం చాలా పారదర్శకంగా, ప్రశ్న పత్రాలు లీకు కాకుండా పకడ్బందీగా చేపడతామని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు కల్పించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని చెప్పారు. గత పది సంవత్సరాలుగా మెరుగైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న పేదలకు రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. సంపద సృష్టించడానికి ప్రజా ప్రభుత్వంలో ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళిక బద్ధంగా ప్రణాలికలు తయారు చేసి ప్రజల ముందు పెడతామన్నారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా వ్యవసాయం, ఇరిగేషన్, ఐటి, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పాటు పడతామని వివరించారు.
విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనలో పెద్ద పీట వేశామన్నారు.

ధనిక రాష్ట్రాన్ని గత పాలకుల చేతుల్లో పెడితే అప్పుల పాలు చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక ఆరాచకంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పామన్నారు.గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను లూటీ చేసి లక్షల కోట్ల అప్పుల భారం మోపినప్పటికీ, అప్పుల్లో కూరుకు పోయిన ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజల పన్నులతో వచ్చే ప్రతి పైసా ప్రజలకే పంచుతామని, ఎన్నికల్లో ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలు తప్పని సరిగా అమలు చేస్తామన్నారు.

కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి రాష్ట్రంలో ఉన్న వనరులతో సంపద సృష్టించి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు.

గత ప్రభుత్వంలో మంత్రుల పర్యటన సందర్భంగా విపక్ష నాయకులను పోలీస్ స్టేషన్లో బంధించే వాళ్లని ఇప్పుడు ఆ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదన్నారు. “ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళు ఉండాల. ప్రతిపక్షాలు ఉండాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి ప్రతి పక్షాల కోసం ధర్నా చౌక్ ను తెరిపించామన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే ఇదే అని పేర్కొన్నారు. ప్రభుత్వంలోని ప్రతి సంస్థ, వ్యవస్థ, ప్రతి అధికారి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రతి పౌరుడు ఇవన్నీ నా కోసమే అనే భావన కల్పించే విధంగా ప్రజాపాలన అందిస్తామన్నారు.

పెత్తందారి పోకడలతో కాకుండా ప్రజలకు జవాబుదారీగా పనిచేయడమే ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛను గత ప్రభుత్వం హరించడంతో భయం భయంగా బతికారని, ప్రభుత్వాన్ని అడిగితే కేసులు నిలదీస్తే నిర్బంధం పెడుతూ నియంతృత్వ పాలన సాగించిన గత ప్రభుత్వానికి చరమగీతం పాడి మార్పు కోరుకున్న ప్రజలు ప్రజా ప్రభుత్వం తెచ్చుకున్నారని వివరించారు.

మార్పు కావాలని కోరుకొని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా వెన్నులో భయం పెట్టుకొని ప్రజాపాలన అందిస్తామన్నారు.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట చేసిన పాదయాత్రలో వచ్చిన సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించడంతో మరికొన్ని సమస్యలు పరిష్కరించడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతామని చెప్పారు.

ఎమ్మెల్సీగా మధిర నియోజకవర్గంలో ప్రగతి యాత్ర చేసిన సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేజర్ గా పరిష్కరించామని గుర్తు చేశారు. చిలుకూరు గ్రామంలో మోడరన్ లైబ్రరీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. డొంక రోడ్ల మరమ్మత్తులు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం ప్రజలకు భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE