Suryaa.co.in

Andhra Pradesh

నేనేమీ అభిమన్యుడ్ని కాను… అర్జునుడ్ని

– యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఓడిపోవాల్సిందే
– భీమిలి ‘సిద్ధం’ సభలో సీఎం జగన్

సీఎం జగన్ నేడు భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఏర్పాటు చేసిన వైసీపీ ‘సిద్ధం’ బహిరంగ సభకు హాజరయ్యారు. సీఎం జగన్ తన ప్రసంగంలో విపక్షాలను ఏకిపారేశారు. భీమిలిలో ఇవాళ తనకు అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో సేనాధిపతి కనిపిస్తున్నారని అన్నారు.

ఇటు పక్క పాండవ సైన్యం ఉంటే, అటు పక్క కౌరవసైన్యం ఉందని… ఈ యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఓడిపోకతప్పదు అని సమరోత్సాహం ప్రదర్శించారు. పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి తాను అభిమన్యుడ్ని కానని, తాను అర్జునుడ్ని అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ అర్జునుడికి తోడు శ్రీకృష్ణుడి వంటి ప్రజలు తోడున్నారని చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 175కి 175 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

“చంద్రబాబుకు ఎప్పుడూ కూడా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్తపుత్రుడ్ని తోడు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలు వచ్చాయి… ఈసారి అవి కూడా రావు. ఈ ఎన్నికల యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతుంది. మోసానికి, నిజాయతీకి మధ్య జరుగుతుంది.

గత ఎన్నికల్లో మేం ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు చెప్పండి… ఎవరిది విశ్వసనీయత? చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఏమీ లేదు. చేసిందేమీ లేదు కాబట్టి చెప్పుకోలేడు. కానీ, మీ బిడ్డ చేసిన మంచినే నమ్ముకున్నాడు… ప్రజలు ఉన్నారన్న ధైర్యంతోనే మీ బిడ్డ ఎన్నికలకు వెళుతున్నాడు.

రాష్ట్రంలో పారదర్శకంగా పాలన అందిస్తున్నాం. ప్రతి నెలా 1వ తేదీనే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజి క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. రైతు భరోసా ఇస్తున్నాం, ఆర్బీకేలను నిర్మించాం. విద్యా సంస్కరణలు అమలు చేస్తున్నాం. నాడు-నేడు పేరిట పాఠశాలలను ఆధునికీకరిస్తున్నాం. పేదింటి బిడ్డలకు కూడా ఇంగ్లీషు మీడియం చదువును అందుబాటులోకి తీసుకువచ్చాం.

దిశ యాప్ తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. రైతులకు సున్నా వడ్డీ రుణాలు, ఉచిత్ విద్యుత్ అందిస్తున్నాం. రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు చేశాడా… నిండా ముంచాడు! 3,527 చికిత్సలతో ఆరోగ్య శ్రీని మరింత విస్తరించాం. వైద్య ఆరోగ్య రంగంలో 50 వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలు జరుపుతున్నాం.

రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన పార్టీ వైసీపీనే. సామాజిక న్యాయం అంటే ఏమిటో చేసి చూపించాం. గ్రామగ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం తీసుకువచ్చాం. ఇలా ఎక్కడ చూసినా జగన్ మార్కే కనిపిస్తోంది.

చంద్రబాబు 14 ఏళ్లు పాలించానని చెబుతాడు… ఎప్పుడైనా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన వచ్చిందా?” అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.

LEAVE A RESPONSE