Suryaa.co.in

Telangana

తెలంగాణలో కేసీఆర్‌కు నూకలు చెల్లాయి

కేసీఆర్‌ అరాచక పాలనను భరించే ఓపిక ప్రజలకు లేదు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణలో కేసీఆర్‌కు నూకలు చెల్లాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ దోపిడీకి 4 కోట్ల రాష్ట్ర ప్రజలు బలయ్యారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ అరాచక పాలనను ఇక భరించే ఓపిక ప్రజలకు లేదన్నారు.

శుక్రవారం గాంధీభవన్లో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, న్యాయవాది గంగాపురం రాజేందర్, మాజీ జడ్పీటీసీ భీముడు నాయక్, అచ్చంపేట, చారగొండ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలోకి ఆహాన్వించి వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌లో చేరికలు గాలివాటంతో కూడినవి కావన్నారు. ఈ చేరికలు తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే అన్నారు. ఈ చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీకగా అభివర్ణించారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ నుంచి విముక్తి కలిగించేందుకే ఈ చేరికలు అని చెప్పారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ పదేళ్ల పాలనలో నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్‌కు లేదని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పుట్టకపోయుంటే తెలంగాణ వచ్చేది కాదని మంత్రి కేటీఆర్ అన్నారని.. కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని రేవంత్‌ గుర్తు చేశారు. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు.

ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్‌ పార్టీ పెట్టారని రేవంత్‌ ఆరోపించారు. 22ఏళ్లు జెండా మోసిన గంగాపురం రాజేందర్‌కు న్యాయం జరిగిందా? అని ప్రశ్నించారు. దోపిడీదారులను పొలిమేరలు దాటే వరకు తరమాలి. ఆ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. నల్లమల అడవుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి.

హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగిరినప్పుడే..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : రేవంత్
శుక్రవారంలో గాంధీభవన్ లో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగిరినప్పుడే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. హైదరాబాద్ లో బస్తీలలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందన్నారు. బస్తీల్లో పేదల పక్షాన నిలిచిన నాయకుడు పీజేఆర్ మాదిరిగా అనిల్ కుమార్ పేదల పక్షాన కొట్లాడుతారు అని అన్నారు.

వందలాది ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పాటు చేస్తే… పదేళ్లలో తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు. కేసీఆర్ చార్లెస్ శోభారాజ్ లా, హరీష్ రావు , కేటీఆర్ బిల్లా, రంగాలా తయారై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. కేసీఆర్ పుట్టకపోతే తెలంగాణ వచ్చేదా అని కేటీఆర్ అంటుండు..కేటీఆర్ మీ అయ్య లాగు తొడక్కముందే తెలంగాణ ఉద్యమం పుట్టింది అని రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.

మర్రి చెన్నారెడ్డి, మదన్ మోహన్ 1969లోనే తెలంగాణ కోసం కొట్లాడారు. మలిదశ ఉద్యమాన్ని 1990లోనే బెల్లి లలిత, గద్దరన్న మొదలు పెట్టారు. కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియదు..తెలిసి ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు అన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కు డబల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా..బిడ్డా..కేసీఆర్ నీకు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా..నువ్వు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే… నీకు దమ్ముంటే మీ 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వు అని రేవంత్ రెడ్డి సవాలు చేశారు.

ఓటమిని ఎమ్మెల్యేల ఖాతాలో వేసేందుకే కేసీఆర్ డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలారా తెలంగాణ ప్రజల కోసం సమయం కేటాయించండి..కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయండి అని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయన్నారు. 2023 డిసెంబర్ 9 న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. డిసెంబర్ 9 తెలంగాణ అవతరణ దినోత్సవాలను నిర్వహిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

గురునాథ్ రెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో రేవంత్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. గత కొంతకాలంగా అధికార బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న ఆయన్ను.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి కోరారు.

కొత్తకోట దయాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రనియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలం పర్కాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కొద్దిరోజుల క్రితం మరణించిన కొత్తకోట దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.

 

LEAVE A RESPONSE