-
కీలక శాఖ పేషీలో ఆయనదే ఇష్టారాజ్యం
-
కూటమి నేతలకు తలనొప్పి సృష్టిస్తున్న ఓ అధికారి
-
కూటమి నేతలపై నోటిదూలతో బుసలుకొడుతున్న ‘నాగ’రాజు
-
‘యువమంత్రి పేషీ’ మద్దతు ప్రచారంతో హవా
-
ఎమ్మెల్యే పీఏలపై మర్యాద లేకుండా నోరుపారేసుకుంటున్న వైనం
-
మండిపడుతున్న కూటమి నేతలు
-
ఓఎస్టీకి ఫిర్యాదు చేస్తున్న నేతలు
-
నేతలతో మర్యాదగా మాట్లాడుతున్న ఓఎస్డీ
-
మాజీ ఐఏఎస్ అయినా కనిపించని గర్వం
-
అందుకు భిన్నంగా అంతా తానయి నడిపిస్తున్న ఓ అధికారి
-
సబ్ రిజిస్ట్రార్ల బదిలీలో ఆయనదే హవా
-
మంత్రిగారికి ఏమీ తెలియదు.. అంతా మనమేనంటున్న అధికారి
-
మంత్రి గారి బంధువు మద్దతునే రెచ్చిపోతున్నారన్న విమర్శలు
-
మంత్రి గారి ‘మంచి చెడ్డా’ ఆయనే చూసుకుంటారన్న ప్రచారం
-
ఆ పేషీకి వెళ్లాలంటేనే హడలిపోతున్న కూటమి నేతలు
-
‘అనగన’గా సచివాలయంలో ఓ పేషీ కథ
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపించే కీలక శాఖ. బడ్జెట్‌లో సింహభాగం ఆదాయం ఆ శాఖదే. మరి అంత కీలకశాఖ మంత్రి పేషీలో పనిచేసే అధికారులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? వచ్చిన వారితో ఎంత మర్యాదగా మాట్లాడాలి? ఎంత ఒళ్లు దగ్గర పెట్టుకుని బాధ్యతాయుతంగా ఉండాలి? కానీ అందుకు భిన్నంగా.. ఆ శాఖ తన సొంత మామగారి జాగీరులా అనుకుని నోరుపారేసుకుంటే నష్టపోయేది ఎవరు? అప్రతిష్ఠపాలయ్యేది ఎవరు? ప్రభుత్వమే కదా?!.. అవేమీ ఆలోచించకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఓ అధికారి.. ఇప్పుడు కూటమి ప్రజాప్రతినిధులు, నేతలకు తలనొప్పులు సృష్టిస్తున్నారు.
ఒక్కముక్కలో చెప్పాలంటే సదరు అధికారి, ఆ శాఖకు పెనుభారమయ్యారు. ఏరికోరి తెచ్చుకున్న ఆయన వ్యవహారం, ఇప్పుడు పేనుకు పెత్తనం ఇచ్చిన చందంగా మారింది. చివరాఖరకు అసలు తన శాఖ మంత్రికి ఏమీ తెలియదని, అంతా మనం చెప్పినట్లే నడవాలని చెప్పి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారట. దానితో ఆ నోటిదూల అధికారికి కొనసాగిస్తే మంత్రిగారికి శంక రగిరి మాన్యాలు ఖాయమన్నది సచివాలయ వర్గాల ఉవాచ.
ఏపీ సచివాలయంలో ‘అనగన’గా ఓ పేషీ. అది రాష్ట్ర ఖజానాను పరిపుష్ఠం చేసే కీలకశాఖ. పొలం పంచాయతీ నుంచి.. రిజిస్ట్రేషన్ల వరకూ అంతా ఆ శాఖనే చూసుకుంటుంది. అలాంటి కీలకశాఖ పేషీలో అదే శాఖలో మరో విభాగం నుంచి వచ్చి, కీలక అధికారిగా చేరిన ఆయన.. ఇప్పుడు ‘యువనేత పేషీ ’ అండ ఉందన్న పేరుతో, రెచ్చిపోతుండటం కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులకు శిరోభారంగా మారిందట. వివిధ కేసులకు సంబంధించి తలెత్తే సందేహాల నివృతి కోసం ఆ పేషీకి వచ్చి, ఆయనను సంప్రదించే కూటమి ప్రజాప్రతినిధులు, వారి పీఏలు, నాయకులను.. సదరు అధికారి తన నోటిదురుసుతో హడలెత్తిస్తున్నారట.
ప్రధానంగా రిజిస్ట్రేషన్, భూములకు సంబంధించి స్థానిక అధికారులు వేసే కొర్రీలపై తమ సందేహాలు వ్యక్తం చేసి, వాటికి పరిష్కారమార్గం సూచించమంటూ సహజంగా ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు.. ఆ శాఖ పేషీలోని ఓఎస్డీ, పీఏ, పీఎస్‌లను సంప్రదిస్తుంటారు. తమ వద్దకు వచ్చిన వారి సమస్య అంత క్లిష్టమైనది కాదు. అది జిల్లా, డివిజన్ స్థాయిలోనే పరిష్కారమయ్యేదయితే.. వారే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, ఫలానా సెక్షన్, ఫలానా చట్టం ప్రకారం ఆ పనిచేయమని సూచిస్తుంటారు. ఇది సహజంగా ఏ ప్రభుత్వంలో అయినా జరిగే ప్రక్రియనే.
ఎమ్మెల్యేలు స్వయంగా మంత్రి వద్దకు వచ్చి, ఆ సమస్యలను ప్రస్తావించినప్పటికీ, మంత్రులు స్పందించి.. పేషీలోని అధికారులను పిలిచి, అదేదో చూడమని చెబుతుండం కూడా అంతే సహజం. విధాన నిర్ణయమైతే దానిని మంత్రికూడా ఏమీ చేయలేరు. అది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయమని చెప్పి పంపించేస్తుంటారు. ఇది రెగ్యులర్‌గా సెక్రటేరియేట్‌కు వెళ్లి, మంత్రుల పేషీకి వెళ్లేవారికి నిరంతరం ఎదురయ్యే అనుభవమే.
కానీ రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపించే ఆ శాఖ మంత్రి పేషీలోని ఓ అధికారి మాత్రం.. అడ్డగోలుగా మాట్లాడి కూటమి ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి, అసంతృప్తికి గురవుతున్నారు. తన వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, వారి పీఏలు, పార్టీ నాయకులతో కటువుగా మాట్లాడుతూ, ఇక్కడకెందుకు వస్తున్నారని నోరుపారేసుకోవడంతో ప్రజాప్రతినిధులు మనస్తాపానికి గురవుతున్నారట. ఇటీవల సంస్థ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎదురయిన ఓ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లి.. పరిష్కారమార్గం కోరిన సందర్భంలో, సదరు అధికారి వారిపై ఇంతెత్తున ఎగిరిపడి నోరు పారేసుకున్నారట. ‘వాడెవడో ఏదో చెబితే మీరు వచ్చి నన్ను అడిగితే నాకేం సంబంధం? ఆవిధంగా నేనెందుకు రాసిస్తాను? వాడికి చట్టం తెలియకుండానే మిమ్మల్ని నా దగ్గరకు పంపించాడా’ అంటూ నోరుపారేసుకున్నారట.
సీన్ కట్ చేస్తే.. అదే పేషీలో రిటైరయిన ఓ ఐఏఎస్ అధికారి ఓఎస్డీగా ఉన్నారు. ఆయన మాత్రం నిదానంగా మాట్లాడి, తన వద్దకు వచ్చే ప్రతినిధులు, వారి పీఏలు, నాయకుల సందేహాలు సావధానంగా విని, వాటిని పరిష్కస్తారన్న పేరుంది. వీలైతే తన స్థాయిలోనే ఆ సమస్యలను పరిష్కరించి పంపిస్తున్నారు. అయితే చాలామంది తెలియక.. ముందు సదరు ‘నోటిదూల అధికారి’ వద్దకు వెళ్లి, అవమానాల పాలవుతున్నారన్న ప్రచారం సచివాలయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
నిజానికి ఆయన అదే శాఖకు చెందిన మరో విభాగంలో, గుంటూరు జిల్లాలో పనిచేసిన అధికారి. కూటమి అధికారంలోకి రావడంతో కులాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రానికి రెవిన్యూ కురిపించే శాఖ పేషీలో చేరారు. పైగా తనకు ‘యువమంత్రి పేషీ ’ మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారట. దానితో ఎమ్మెల్యేలు, నాయకులు కూడా.. మనకెందుకొచ్చిన పంచాయితీలే అని ఆయనకు భయపడి, ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారట. అయితే ఆయన నోటిదూల వ్యవహారంపై ఎమ్మెల్యేలు, తమ పార్టీ నాయకుల ముందు బాహాటంగానే చర్చిస్తున్నాని తెలుస్తోంది. అటు సచివాలయ వర్గాలు మాత్రం ఆయన నోటిదూలపై వింతగా చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వంలో ఉన్న కులాన్ని అడ్డుపెట్టుకుని ఆ స్థానంలోకి వచ్చిన ఆయన.. దానిని కాపాడుకునే బదులు, ప్రభుత్వానికే అప్రతిష్ఠ తెచ్చే చర్యలకు పాల్పడుతుండటం అటు సొంత సామాజికవర్గ నాయకులకూ రుచించడం లేదట. కానీ సదరు శాఖ మంత్రి ఇమేమీ పట్టకుండా నాన్ సీరియస్‌గా వ్యవహరిస్తున్నారని, అన్నీ లైట్ తీసుకుని బిందాస్‌గా తన పని తాను చేసుకుపోతున్నారన్న విమర్శలు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకుల నుంచి వినిపిస్తున్నాయి.
పైగా తన శాఖ మంత్రికి ఏమీ తెలియదని, తాను ఏది చెబితే అదే ఫైనల్ అంటూ తన పరువు తీస్తున్నా.. సదరు మంత్రి గారు నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నారట. శాఖకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్లు, బదిలీల ఫైళ్లు మంత్రికి చేరే ముందు.. సదరు అధికారిని కలసి సంతృప్తి పరిస్తేగానీ, ఆ ఫైలు మంత్రిగారి వద్దకు చేరదన్న ప్రచారం సచివాలయ వర్గాల్లో లేకపోపోలేదు. మంత్రి దృష్టికి వచ్చిన సమస్యలకు సంబంధించిన ఫైలు పరిష్కరించకుండా, తనను ‘సంతృప్తి పరిస్తేనే’ ఫైలుపై కొర్రీలు వేయకుండా పంపుతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
మంత్రికి సంబంధించిన కీలక వ్యక్తులు, ఆయన నియోజకవర్గ వ్యవహారంలో చక్రం తిప్పే బంధువుల సహకారంతోనే, సదరు అధికారి రెచ్చిపోతున్న వైనం.. ఓటమి ఎరుగని ఆ మంత్రికి తెలుసో, తెలియదో అర్ధం కావడం లేదంటున్నారు. పైగా మంత్రికి సంబంధించిన ‘మంచి చెడ్డ’లన్నీ తానే చూసుకుంటానన్న ప్రచారం, సచివుడికి సమస్యలు సృష్టించక మానదని హెచ్చరిస్తున్నారు.
గుంటూరులో పనిచేసినప్పుడు ఓ మహిళా అధికారితో అమర్యాదగా వ్యవహరించిన వైనం రచ్చవ డంతో చల్లగా సచివాలయానికి చేరారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన సబ్ రిజిస్ట్రార్ల బదిలీలో సారు గారు సెప‘రేటు’గా వ్యవహరించి, తనను ‘సంతృప్తి’పరిచిన వారికి కావలసిన చోట పోస్టింగు ఇప్పించారన్న ప్రచారం కూడా లేకపోలేదు.