Suryaa.co.in

International National

దుబాయ్ బంగారం ఇక అంత వీజీ కాదు

– బంగారం, వెండిపై భారత్ కఠిన ఆంక్షలు

ఢిల్లీ: ఇకపై మునుపటి మాదిరిగా దుబాయ్ నుంచి ఏదో ఒక రూపంలో బంగారం, వెండిని తెచ్చుకోవడం కుదరదు. ముడి, పొడి రూపంలో ఉన్న బంగారం దిగుమతిలో జరుగుతున్న మతలబు గ్రహించిన కేంద్రం.. ఇక దుబాయ్ బంగారం-వెండిపై కఠిన ఆంక్షలకు తెరలేపింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దిగుమతి చేసుకునే కొన్ని రకాల బంగారం, వెండిపై భారత ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను విధించింది. ముడి, పాక్షికంగా తయారైన, పొడి రూపంలో ఉన్న బంగారం, వెండి దిగుమతుల విషయంలో ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

కొందరు దిగుమతిదారులు సెపా ఒప్పందంలోని వెసులుబాటును ఆసరాగా చేసుకుని, తక్కువ సుంకాలు చెల్లించేందుకు బంగారాన్ని ప్లాటినం మిశ్రమంగా తప్పుగా చూపిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే తాజా ఆంక్షలను ప్రవేశపెట్టింది.

2025 బడ్జెట్ ప్రకటనలో భాగంగా బంగారం డోర్, వెండి డోర్, అధిక స్వచ్ఛత గల ప్లాటినం వంటి కీలక వస్తువులకు కొత్త హార్మోనైజ్డ్ సిస్టమ్ కోడ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై నామినేటెడ్ ఏజెన్సీలు, క్వాలిఫైడ్ జ్యువెలర్స్, సెపా ఒప్పందం కింద చెల్లుబాటు అయ్యే టారిఫ్ రేట్ కోటా హోల్డర్లు మాత్రమే యూఏఈ నుంచి ఈ నిర్దిష్ట రూపాల్లో ఉన్న బంగారం, వెండిని దిగుమతి చేసుకోగలుగుతారు.

భారత్-యూఏఈ సెపా ఒప్పందం కింద, టీఆర్‌క్యూ విధానంలో యూఏఈ నుంచి ఏటా 200 మెట్రిక్ టన్నుల వరకు బంగారాన్ని 1% సుంకం రాయితీతో దిగుమతి చేసుకునేందుకు భారత్ అంగీకరించింది. అయితే, కొందరు దిగుమతిదారులు దాదాపు 99% స్వచ్ఛమైన బంగారాన్ని ప్లాటినం మిశ్రమంగా పేర్కొంటూ, సెపా కింద తక్కువ దిగుమతి సుంకాలను పొందుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇలాంటి దుర్వినియోగాన్ని నిరోధించేందుకు, ప్రభుత్వం 99% లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛమైన ప్లాటినం ఉన్న దిగుమతులకు ప్రత్యేకంగా ఒక కొత్త హెచ్‌ఎస్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. కేవలం ఈ కేటగిరీ కింద జరిగే దిగుమతులకు మాత్రమే సుంకం రాయితీలు వర్తిస్తాయి.

ఇతర ప్లాటినం మిశ్రమాల దిగుమతులపై ఆంక్షలు విధించారు. దీనివల్ల ప్లాటినం ముసుగులో బంగారం దిగుమతి చేసేందుకు ఉన్న మార్గాలు మూసుకుపోయినట్లయింది. భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

LEAVE A RESPONSE