– త్వరలోనే సంబంధిత రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ
– మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: నిడదవోలు ఎర్రకాలువ ముంపు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదలకు లైన్ క్లియర్ అయిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం వెలగపూడి సెక్రటేరియట్ 5వ బ్లాక్ లో రెండవ రోజు జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో భాగంగా సంబంధిత సమస్యను మంత్రి కందుల దుర్గేష్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులను పిలిచి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి దుర్గేష్ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు మంత్రి దుర్గేష్ కేబినెట్ దృష్టికి ఇన్ ఫుట్ సబ్సిడీ అంశం తీసుకెళ్లగా సీఎం సుముఖత వ్యక్తం చేశారని, వివిధ కారణాల వల్ల ఆర్థిక శాఖలో సంబంధిత ఫైల్ క్లియరెన్స్ కు జాప్యం జరిగిందన్నారు.
అయినప్పటికీ నేడు కలెక్టర్ల సదస్సులో సంబంధిత అంశాన్ని మంత్రి కందుల దుర్గేష్ మరోసారి ఈ అంశం ప్రస్తావించగా సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే సమస్యకు చెక్ పెట్టారని తెలిపారు. 2024 జులై నెలలో సంభవించిన భారీ వర్షాలు, విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇప్పటికే ఇన్ ఫుట్ సబ్సిడీ ప్రకటన చేశామని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు.