– ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సహం
– 612 హెక్టార్లలో కొత్తగా ఉద్యాన పంటల సాగు
– పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
అమరావతి: సాగు నీటి కాలవల్లో విస్తారంగా పెరిగే గుర్రపుడెక్క ఆకును ఎరువుగా మార్చి సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ దిశగా ముందుకొచ్చే సంస్థలకు ప్రోత్సహించే చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కలెక్టర్ల సదస్సులో ఆమె తమ జిల్లా ప్రగతి గురించి వివరించారు. పశ్చి మ గోదావరి జిల్లాలో సాగునీటి కాలువల్లో గుర్రపుడెక్క ఆకు విపరీతంగా పెరుగుతుందని, ఇది సాగునీటి ప్రవాహానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుందని, అయితే ఈ గుర్రపు డెక్క ఆకును ఎరువుగా మార్చే దాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అటు గుర్రపు డెక్క ఆకు సమస్యను పరిష్కరించుకునే అవకాశాలపైన కూడా తాము పనిచేస్తున్నామని వివరించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో తలసరి ఆదాయం రూ.3.50లక్షలు సాధించాలన్నది తమ లక్ష్యమన్నారు.
జిల్లాలో ఆక్వారంగంలో గణనీయమైన ప్రగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలో చేపలు, రొయ్యల సాగు 1.33 లక్షల ఎకరాల నుంచి 1.50లక్షల ఎకరాలకు పెంచే దిశగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో పశువైద్యశాలల భవనాలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయని వాటిని వెంటనే మరమ్మతులు చేయడం, కొత్తవి నిర్మించడానికి సహకారం కావాలని కోరారు.