*ఇందులో 20 శాతం వృద్దిరేటు సాధించాలి
*రాజమండ్రిలో 5 వేల గదులు లభ్యత ఉండేలా హోటళ్ల నిర్మాణం చేపట్టాలి
*పామాయిల్ రంగంలో దేశంలో ఏపీనే నెంబర్ వన్
*ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
*గోదావరి పుష్కరాలకు సన్నాహక చర్యలు చేపట్టండి
*ప్రత్యేకాధికారులుగా వీరపాండ్యన్, విజయరామరాజు
*అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం
అమరావతి: రాష్ట్రాభివృద్ధికి పర్యాటక రంగం గేమ్ ఛేంజర్ కాబోతోందని, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన గోదావరి జిల్లాలపై కలెక్టర్లు ఇచ్చిన ప్రజంటేషన్‌లపైన స్పందిస్తూ మాట్లాడారు.
పర్యాటక రంగం వృద్ధి రేటు పెంపొందించుకోవడానికి గ్రోత్ ఇంజిన్‌లా పనిచేస్తుందని, అధికారులు ఈ రంగంలో ఏపీ అవకాశాలను అందిపుచ్చుకునేలా పనిచేయాలన్నారు. కనీసం ఈ రంగంలో 20 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని, అక్కడ సుందర ప్రదేశాలు, ఆలయాలు సందర్శించేలా దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా జిల్లాలో ప్రణాళికలు రూపొందించి పనిచేయాలన్నారు.
పర్యాటకులు రావడమే కాదు, వారికి తగిన సదుపాయాలు కూడా అక్కడ కల్పించాలన్నారు. రాజమండ్రిలో 5వేల గదులు లభ్యత కలిగేలా హోటళ్ల నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కేవలం రాజమండ్రి మాత్రమే కాకుండా విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతి, అనంతపురంలో ఒక్కో ప్రాంతంలో 5వేల గదులు లభ్యత ఉండేలా హోటళ్ల నిర్మాణానికి కలెక్టర్లు ప్రోత్సాహం అందించాలన్నారు.
గోదావరి పుష్కరాలకు సన్నాహాలు
గోదావరి పుష్కరాలకు సన్నాహక చర్యలు మొదలు పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశించారు. దీనికోసం వెంటనే ఇద్దరు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నామన్నారు. ఐఏస్ అధికారులు వీరపాండ్యన్‌ను ప్రత్యేకాధికారిగా, విజయరామరాజును అధనపు అధికారిగా నియమిస్తున్న సీఎం తెలిపారు.
పామాయిల్ సాగులో ప్రగతి సాధించాలి
దేశంలో పామాయిల్ సాగులో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ ఒన్‌గా ఉందన్నారు. దేశంలో 60 శాతం పామాయిల్ సాగు మన రాష్ట్రంలోనే జరుగుతోందన్నారు. మరింత ఎక్కువగా రైతులు పామాయిల్ సాగువైపు ప్రోత్సహించాలన్నారు. జాతీయ రహదారుల వెంబడి కూడా ఖాళీ స్థాలల్లో పామాయిల్ చెట్లు పెంచే అవకాశాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశీలించాలన్నారు. తద్వారా రహదారులవెంబడి పచ్చదనం పెంచడమే కాకుండా రహదారులు శోభాయమానంగా కనిపిస్తాయన్నారు.
కడియం నర్సరీలో నరేగా పనులు
కడియం నర్సరీలో నరేగా పథకం కింద పనులు చేయాలని దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఆక్వారంగం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆక్వా వ్యర్థాలు వృథాగా పోకుండా వాటి ద్వారా ప్రొటీన్ ఉత్పత్తులు తయారచేసే పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు.
డెల్టాలో మూడు పంటలు
కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో రైతులు మూడు పంటలు సాగు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దానికున్న సాధ్యసాధ్యాలను అంచనా వేసి రైతులు మూడు పంటలు పండించేలా ప్రోత్సహించాలన్నారు. వరి తర్వాత రెండు డ్రై క్రాప్స్ పండిచడానికి వీలు కల్పించాలన్నారు.
గోదావరి జిల్లాలు పురోగమించాలి
గోదావరి జిల్లాలు పురోగమిస్తూ ప్రగతిపథంలో ముందుకెళ్లాలని, ఆ దిశగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కోనసీమ జిల్లా తలసరి ఆదాయం తక్కువగా ఉందని కారణాలు ఏంటీ అనేది అధికారులు విశ్లేషించుకోవాలన్నారు. కోనసీమ జిల్లాలు పురోగతిలో ముందుండేవి ఇప్పుడు కాస్తంత వెనుకబడుతున్నాయని, ఇది మంచిది కాదని ఈ జిల్లాల అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించాలన్నారు. మెట్ట ప్రాంతమైన ఏలూరు తలసరి ఆదాయంలో ముందుంటే సారవంతమైన భూములున్న కోనసీమ జిల్లా వెనుకబడిపోవడం సరికాదని దీనిపైన అధికారులు కృషి చేయాలన్నారు. తమ తమ జిల్లాల్లో వృద్ది రేటు పెంపొందించుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.