ఇంటర్నేషనల్ స్కూల్ .. స్టార్టెడ్ బై ఫారిన్ రిటర్న్డ్

‘నాన్నా .. అమెరికా లో నా ఉద్యోగం పోయేలా ఉంది ‘
‘ఏం ఫర్లేదు .. వెంటనే ఇక్కడికొచ్చేయి ‘
‘వచ్చి ఏం చెయ్యాలి ?’
‘ఓ స్కూలు పెట్టు ?’
‘ఏ స్కూలు ? డ్రైవింగ్ స్కూలా ?’
‘నీ మొహం .. ఇంటర్నేషనల్ స్కూలు .. స్టార్టెడ్ బై ఫారిన్ రిటర్న్డ్ ఎన్నారై అని టాగ్ లైన్ పెడదాం ‘
‘ఎన్నారై అంటేనే ఫారెన్ కి వెళ్లినవాడు కదా .. మళ్ళీ ఫారిన్ రిటర్న్డ్ ఎందుకు ?’
‘నువ్వు తిరిగొస్తున్నావుగా ..అందుకు .. అయినా మన వాళ్ళు ఫారిన్ రిటర్న్డ్ అంటే బొద్దింకనైనా నెత్తినెట్టుకుంటార్రా .. ‘
‘సరే .. స్కూలెక్కడ పెడదాం ? బోల్డు స్థలం, పర్మిషన్లు గట్రా కావాలి కదా ‘
‘ఏవఖ్ఖర్లేదు .. మన అపార్ట్మెంట్ కాంప్లెక్సులో నువ్వు పంపిన డబ్బుల్తో మూడు ఫ్లాట్లు కొన్నాం కదా .. రెండు ఫ్లాట్లు కలిపి స్కూలెట్టేద్దాం ‘
‘అపార్టుమెంట్లో స్కూలా ?.. జనం వస్తారా ?’
‘జనందేముంది ?.. ఏవెట్టినా వస్తారు .. కొంచెం హడావిడి చెయ్యాలంతే .. ‘

‘హడావిడి ఏమిటి ?’
‘అంటే .. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అఫ్ కిడ్స్ , మల్టీ-లాంగ్వేజ్ స్కిల్స్ , టాబ్లెట్ బేస్డ్ టీచింగ్, హార్స్ రైడింగ్ , స్విమ్మింగ్ లాంటివి బ్రోచర్ లో పెట్టామంటే ..
‘ఏమిటీ ..అవన్నీ నేర్పిస్తామా ?’

‘మరదే ..రోజూ చిప్సూ , అడ్డమైన చెత్తా మన స్కూల్లో కొనిపిస్తాం కదా ..గుండ్రం గా పెరుగుతారు.. అదే ఆల్రౌండ్ డెవలప్మెంట్ , ఇంక ఆళ్ళు ఎలాగా ఇంట్లో ఇంగ్లిష్ మాట్లాడతారు , మన స్కూల్లో తెలుగు , హిందీ చెప్పేమనుకో అదే మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్ .. టాబ్లెట్ లో గేమ్స్ నేర్పిద్దాం .. టాబ్లెట్ బేస్డ్ టీచింగ్ .. ఆళ్లిచ్చే డొనేషన్ తో వచ్చే ఏడాది కల్లా .. శంషాబాద్ తర్వాత చీపుగా ల్యాండ్ కొనేసి ఇంటర్నేషనల్ క్యాంపస్ అని ఓ బిల్డింగ్ కట్టేసి , పక్కనే ఒక స్విమ్మింగ్ పూలూ , ఓ రెండు గుర్రాలూ కొన్నామంటే సరిపోద్ది ‘

‘బావుంది ..కానీ ఇన్నేసి స్కూళ్ళు ఉండగా మన స్కూలుకే ఎందుకెక్కువగా రావాలి ?’
‘ఎందుకంటే .. మన స్కూల్లో ఫీజెక్కువ కాబట్టి .. మన ఎదవ జనానికి రేటెక్కువ అంటే క్వాలిటీ ఎక్కువ కామోసనుకునే వెర్రి ఉందిగా మరి !’

‘మరి పర్మిషన్లు ?’ ‘పర్మిషన్లదేముంది ? గులాబీ రంగు బోర్డెట్టి , గులాబీ రంగు యూనిఫారం పెట్టి , లోకల్ ఎమ్మెల్యే ని ఓపెనింగ్ కి పిలిచేమంటే , మనం స్కూలు రోడ్డు మీదెట్టినా ఎగురుకుంటూ వచ్చి, పర్మిషన్లిచ్చి, ఓపినింగు చేసేస్తాడు ‘

‘బావుంది ..స్కూలుకి పేరేం పెడదాం?.. తాతయ్య పేరెడదామా ?’
‘నువ్వింకా ఎదగలేదురా ఎదవా .. జోగారావు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అని పెడితే ఎవ్వడూ రాడు .. అందుకే ..’ఆఁ ..అందుకే ?’

‘సెయింట్ జోగా ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, బై ఎన్నారైస్ , ఫర్ ఎన్నారైస్ , ఆఫ్ ఎన్నారైస్ అని పెట్టేమంటే గచ్చిబౌలి నుంచి అమీర్ పేట దాకా ఉన్న వెర్రాళ్లందరూ ఎగబడి మరీ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసేస్తారు.

– మంతా రవీంద్రనాధ్‌

Leave a Reply