జనమే ఆశ.. జనమే శ్వాస!

ఎనిమిదో తరగతి నుంచే క్లాస్‌లీడర్‌గా ఎన్నికై.. ‘బోర్న్ లీడర్’గా, కోస్తాంధ్రలో మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న బీజేపీ జాతీయ నేత కన్నా లక్ష్మీనారాయణ తనకు జనమే శ్వాస.. జనమే ఆశ అంటున్నారు. పోలీసు ఆఫీసర్ కావాలనుకున్న తనకు, అన్ని పదవులూ భగవంతుడి సంకల్పంతో.. కోరుకోకుండా, అనుకోకుండానే వచ్చాయంటున్న ‘కన్నా’తో ఇంటర్వ్యూ
( మార్తి సుబ్రహ్మణ్యం)

* మీ నేపథ్యం?
– గుంటూరు కన్నావారి తోట. చదువు హిందూకాలేజీ. ఎనిమిదో తరగతిలోనే నేను క్లాస్ లీడర్‌ను. ఎన్‌సీసీలో చేరా. హెవీ వెయిట్ లిఫ్టర్‌ను. మూడుసార్లు యూనివర్శిటీ చాంపియన్‌ను. మిడిల్ క్లాసయినా నాన్న కన్నా రంగయ్య అప్పట్లో కాంగ్రెస్‌లో చురుకుగా ఉండేవారు. ఆ ప్రభావంతో ఎన్‌ఎస్‌యుఐలో చేరా. ఆ తర్వాత ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి వరకూ వెళ్లా.

* మీ గాడ్‌ఫాదర్?
– కేంద్రమాజీ మంత్రి పి.శివశంకర్‌గారు. ఆయన ప్రోత్సాహంతోనే తొలిరోజుల్లో కాంగ్రెస్‌లో ఎదిగా. ఆయన తనయుడయిన అప్పటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధీర్‌కుమార్ ప్రోత్సాహం కూడా చాలా ఉంది. నా కష్టం, పనితనం, నాయకత్వ లక్షణాలు, రాజకీయ వ్యూహాలు, తెగింపు వారికి నచ్చింది.

* కాలేజీ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
– లేదు. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో డెవలెప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేశా. దానికి రాజీనామా చేసిన తర్వాతనే ఫుల్‌టైం రాజకీయాల్లో చేరా. అంతకుముందే విద్యార్ధి నేతగా పనిచేసిన అనుభవం ఉంది. అప్పట్లో ఎన్‌ఎస్‌యుఐ-ఏఐఎస్‌ఎఫ్ మధ్య సైద్ధాంతిక-భౌతికపరమైన ఘర్షణ జరిగేది. ఆ క్రమంలో జరిగిన ఘర్షణలో నాపై హత్యాయత్నం జరిగింది. 11 కత్తిపోట్లయ్యాయి. అప్పటి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.సుధీర్‌కుమార్ నాకు సపోర్టు ఇచ్చారు.

* కాంగ్రెస్‌లో అంతమంది హేమాహేమీల మధ్య మీకు టికెట్ ఎలా వచ్చింది? అందునా యూత్ కాంగ్రెస్ లీడర్‌గా ఉంటూ?….
– జిల్లా నుంచి ఒకరికి యూత్‌కాంగ్రెస్ నుంచి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అప్పుడు కేంద్రమంత్రి
kanna-youth పి.శివశంకర్‌గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి.సుధీర్‌కుమార్‌గారు పట్టుపట్టి నాపేరు సిఫార్సు చేశారు. అప్పటికే తీవ్రమైన పోటీ ఉండేది. అలా తొలిసారి కాంగ్రెస్ అభ్యర్ధి అయ్యే అవకాశం వచ్చింది.

* మరి మీరు పుట్టిన గుంటూరు నుంచి కాకుండా పెదకూరపాడు నుంచి ఎందుకు పోటీ చేయవలసివచ్చింది?
– అదో పెద్ద కథ. నిజానికి నాకూ గుంటూరు నుంచే పోటీ చేయాలని ఉండేది. అసలు నేను ఆశించింది కూడా అదే. కానీ పార్టీ పెద్దలు అక్కడ నెలకొన్న పోటీ, అంతర్గత రాజకీయాల కారణంగా పెదకూరపాడుకు వెళ్లమన్నారు. అప్పటికి నాకు పెదకూరపాడు దారి కూడా తెలియదు. వెతుక్కుంటూ వెళ్లా. అలా 1989 నుంచి వరసగా అక్కడి నుంచే గెలిచా. అక్కడి ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నియోజకవర్గం మారతానంటే వాళ్లు ఒప్పుకోకుండా, నాపై ఒత్తిడి చేశారు. మేం మీకు ఏం అన్యాయం చేశాం? ఏం తక్కువ చేశాం? అని కొట్లాడేవారు. దానితో నియోజకవర్గం మారాలన్న ఆలోచన విరమించుకున్నా. ఇక చివరకు 2009లో గుంటూరుకు మారాల్సి వచ్చింది.

* అప్పటి సీఎంలు, ప్రతిపక్షనేతలు, పీసీసీ అధ్యక్షులతో మీ సంబంధాలు ఎలా ఉండేవి?
– దాదాపు అందరితో బాగానే ఉండేవి. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు వచ్చిన సందర్భంలో ఏపీసీ చైర్మన్‌గా కూడా చేశా. ఫ్యాక్షన్ నియంత్రణ కమిటీలో పనిచేశా. రెండుసార్లు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. నాకు అప్పగించిన పనులలో ఫెయిల్ అయింది లేదు.

* మరి మంత్రి పదవులు ఏయే సందర్భాల్లో వచ్చాయి?
– చెప్పా కదా. నాకు ఇప్పటివరకూ దైవానుగ్రహం వల్ల అన్నీ అనుకోకుండా, కోరుకోకుండానే వచ్చాయి. నేను దేవుడిని బాగా నమ్ముతా. నన్ను ఆయనే ఎప్పుడూ రక్షిస్తుంటాడు. నాకు ఇప్పటివరకూ ఢిల్లీలో లాబీయింగ్ చేసుకోవడమనేది తెలియదు. నా పనితీరు మెచ్చుకుని ఇచ్చిన పదవులే తప్ప, నేతల చుట్టూ తిరిగే అలవాటు లేదు. దేవుడిని ఎక్కువగా నమ్ముతా కాబట్టి పెద్దగా ఆందోళన చెందను. నేదురుమల్లి మంత్రివర్గంలో స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్; కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్‌లో కో ఆపరేటివ్, లేబర్; వైఎస్ తొలి క్యాబినెట్‌లో కో ఆపరేటివ్, ట్రాన్సుపోర్ట్; రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో హౌసింగ్, వ్యవసాయ శాఖలు నిర్వహించా.

* మీరు ఇప్పటివరకూ చూసిన ఉత్తమ ముఖ్యమంత్రులెవరు?
– నేను కాంగ్రెస్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే చెప్పా. అప్పట్లో మోదీ గారు గుజరాత్ సీఎంగా
ys-kanna-modi ఉండేవారు. ఆయన, వైఎస్ ఇద్దరే నా దృష్టిలో ఉత్తమ ముఖ్యమంత్రులని అప్పుడే మీడియాలో ఎవరో అడిగితే చెప్పా.

వైఎస్‌తో ఆ విషయంలో విబేధించా!
నన్ను దాదాపు అందరు సీఎంలు బాగా ప్రోత్సహించారు. టీడీపీ అధికారంలో ఉంటే విపక్ష ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ అధికారంలో ఉంటే మంత్రిగా టీడీపీపై ఎదురుదాడికి నన్ను తురుఫుముక్కగా వాడేవారు. నేను
Kanna-Lakshminarayana-assembly కూడా సబ్జెక్టుపరంగా ఆ మేరకు బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. నాకు కావలసిన పేపర్లు తెప్పించుకునేవాడిని. అందుకు నాకు టీమ్ ఉండేది. నా శ్రేయోభిలాషులు కూడా పేపర్లు ఇచ్చేవారు. నేనెప్పుడూ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిన సందర్భాలు లేవు. అన్నీ ఎవిడెన్సుతోనే మాట్లాడేవాడిని. అందుకే మా సీఎంలంతా టీడీపీపై ఎదురుదాడికి నన్నే ఎక్కువ ప్రయోగించేవారనుకుంటా.

ఒక సందర్భంలో కో ఆపరేటివ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సీఎం వైఎస్‌తో విబేధించాల్సి వచ్చింది. కానీ ఆయన దానిని చాలా పాటిజివ్‌గా తీసుకుని, నాకు స్వేచ్ఛ ఇచ్చారు. టీడీపీ హయాంలో అస్తవ్యస్థంగా మారిన సహకార వ్యవస్థను ప్రక్షాళన చేసి, ఎన్నికలు జరిపించి ఆప్కాబ్‌కు అప్పగించిన ఘనత అప్పట్లో దేశంలో ఏపీకి, మంత్రిగా నాకు దక్కింది. వైద్యనాధన్ కమిటీ సిఫార్సులు పకడ్బందీగా అమలుచేశా. సహకారశాఖలో 6500 మంది పెయిడ్ సెక్రటరీల తొలగింపు అంశంలో, సీఎం వైఎస్‌తో వాగ్వాదం లాంటి సంవాదం జరిగింది. వారిని తొలగించే అంశంలో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే వారిని తొలగించే అంశం మా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. కానీ తొలగించక తప్పదు. అధికారులు కూడా వైఎస్‌కు అదే చెప్పారు. కానీ నేను అడ్డుకున్నా. మనం ప్రతిపక్షంలో ఉన్నపుడు స్వయంగా మీరే వారికి ఉద్యోగాలపై హామీ ఇచ్చారని వైఎస్‌కు గుర్తు చేశా. అయినా సరే.. ‘కన్నా ప్రభుత్వం నయాపైసా ఇచ్చే పరిస్థితి లేదు. నన్ను అర్ధం చేసుకో. పట్టుదలకు పోవద్దు. ఆర్ధిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా’ అని నాకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే నేను ప్రభుత్వానికి నయాపైసా భారం లేకుండా, వారిని తొలగించకుండా సమస్య పరిష్కరిస్తానని చెప్పా. నా సంగతి తెలిసిన వైఎస్ ‘సరే కన్నా.. ప్రయత్నించి చూడు. మళ్లీ చెబుతున్నా. ప్రభుత్వం నయా పైసా ఇవ్వదు’ అని వెళ్లేముందు మళ్లీ గుర్తు చేశారు. చివరకు ఇదే అంశం క్యాబినెట్‌లో కూడా ప్రస్తావనకు వచ్చింది. నా సహచర మంత్రి డి.శ్రీవినాస్ కూడా నన్నే సమర్ధించారు. ‘కన్నా చేస్తానంటున్నాడు కదా. అవకాశం ఇస్తే ఏం పోతుంది’ అని వైఎస్‌కు సూచించారు. సరే.. తర్వాత ఆ సమస్యను పరిష్కరించా. అప్పుడు వైఎస్ పిలిచి ‘కన్నా నువ్వు కో ఆపరేటివ్ శాఖలో అసంతృప్తిగా ఉన్నావని తెలుసు. కానీ అది టీడీపీ పాలనలో కుళ్లిపోయింది. నీ సంగతి తెలిసే ఆ శాఖ నీకు అప్పగించా. ఇక నుంచి ట్రాన్స్‌పోర్టు కూడా నీకే ఇస్తున్నా’నని చెప్పి, అభినందించారు.

* మరి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మీకు సీఎం పదవి ఇస్తారని ఒకసారి, పీసీసీ చీఫ్ ఇస్తారని మరొకసారి ప్రచారం జరిగింది కదా? నిజమేనా? అప్పుడు సీఎం కిరణ్ వైఖరి ఎలా ఉంది?
– అప్పుడు గులాంనబీ ఆజాద్ ఏపీ ఇన్చార్జి. ఆయన నన్ను ఢిల్లీకి పిలిపించి.. రాష్ట్రాలు విడిపోవడం ఖాయమయినందున నన్ను, జానారెడ్డి గారిని సిద్ధంగా ఉండమని , ఈ విషయం బయట ఎక్కడా లీక్ కాకుండా చూసుకోండి అని చెప్పి పంపించారు. మరో సందర్భంలో నన్ను, షబ్బీర్ అలీని పిలిపించారు. ఆ వార్త మీడియాలో కొద్దిరోజుల తర్వాత లీకయింది. ఈ పరిణామాల తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి నాపై కక్ష కట్టారు. వేధించారు. నా అంతట నేను పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. కానీ అవకాశం వచ్చిన సందర్భంలో నేను బాగా నమ్మిన వాళ్లే నన్ను మోసం చేసి, మరొకరిని ప్రోత్సహించడం బాధనిపించింది.

వంగవీటి రంగా కోసమే కాపునాడు నడిపా!
రంగాకు మీరు అనుచరులా? సహచరులా అని అడిగారు. నేను రంగాకు సహచరుడిని. అప్పట్లో రంగా కోసమే నేను కాపునాడు ఉద్యమం నడిపా. మా ఇద్దరి అడ్డు తప్పిస్తే ఎదురుండదని అప్పట్లో టీడీపీ నేతలు
kanna-ranga భావించారు. కానీ మేం దేవుడి దయతో అనేక సార్లు ప్రాణాలతో బయటపడ్డాం. నన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని తెలుసుకుని, ఆ విషయాన్ని సీఎం ఎన్టీఆర్ దృష్టికి సీఎల్పీ సభ్యులతో వెళ్లి తీసుకువెళ్లాం. ఆయన చాలా బాధ పడి, వాళ్ల పార్టీ లీడర్లపై ఆగ్రహించారు కూడా.

‘నేను రాజకీయాల్లో ఉంటూ కాపులకోసం పనిచేశాను తప్ప కుల నాయకుడిగా కాదు. నాకు అన్ని కులాలు సహకరించాయి. పెదకూరపాడులో నాకు తొలుత కమ్మవర్గం పెద్దగా సహకరించలేదు. కానీ ఆ తర్వాత వారే నా పనితీరు చూసి వరసగా గెలిపించారు. గుంటూరులో కాపులతోపాటు బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి వర్గాలు నాకు మద్దతునిచ్చాయి. కాపులకు రిజర్వేషన్ అన్నది పాత డిమాండ్. అందులో న్యాయం ఉంది. కాబట్టి పోరాడుతున్నాం. పోరాడేవారికి మద్దతునిస్తున్నా. అంతేగానీ కొందరిమాదిరిగా ఇతర కులాలను వేధించి, ఒక కులనేతగా నేనెప్పుడూ పేరు తెచ్చుకోలేదు. నా వల్ల ఫలానా వర్గం నష్టపోయిందని ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. అదీ నా చరిత్ర.

* మీ లక్ష్యం ఏమిటి? అది నెరవేరిందా?
– అసలు నేను పోలీస్ ఆఫీసర్ కావాలన్నది నా లక్ష్యం. అప్పట్లో గుంటూరులో రౌడీయిజం బాగా ఉండేది. అందుకే ఎస్‌ఐ అయితే వారిని అణచివేయవచ్చనుకునేవాడిని. ఆ కోరికతోనే నేను ఎన్‌సీసీలో కూడా చేరా. తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. నిరంతరం జనం మధ్యలోనే ఉండి, వారి సమస్యలు పరిష్కరించాలన్నదే నా లక్ష్యం. అందులోనే చెప్పలేని తృప్తి కూడా. నాకు తెలిసి నేను ఎవరికీ హాని చేయలేదు. సాధ్యమైనంత వరకూ మేలు చేయడానికే ప్రయత్నించా. నేను స్నేహానికి ప్రాణం ఇస్తా. పబ్లిసిటీ నాకు ఇష్టం ఉండదు. మొదటి నుంచీ నా తరహానే అంత. కానీ చాలామంది మీరు అందరిలా మీడియాకు దగ్గరగా ఉండాలని సలహా ఇచ్చేవాళ్లు. ఇప్పుడిప్పుడే మీడియాతో మాట్లాడుతున్నా.

* మీరు ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఎవరు చెప్పినా వినరని ఓ ప్రచారం. నిజమేనా?
– రాజకీయాల్లో మాట ముఖ్యం. నమ్మకం ప్రధానం. నన్ను నమ్మి ఎవరైనా సాయం కోరినప్పుడు వారికి మాట ఇస్తా. ఆ త ర్వాత అదే పనికోసం నాకు ఎంత ముఖ్యులొచ్చి అడిగినా.. ‘కుదరదు. ఫలానా వారికి మాటిచ్చా. ఈసారి చూద్దాం. మీరు ముందు రావలసింది’ అని సున్నితంగా చెబుతా. అంతేగానీ చూద్దాం. రేపు రండి, ఎల్లుండి రండని చెప్పను. తిప్పను. ఒక పోస్టింగ్ విషయంలో చివరకు సీఎం వైఎస్‌తో కూడా వాదించి, నేను మాటిచ్చిన వ్యక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఆశ్చర్యమేమిటంటే అతను నాకు గతంలో ఎప్పుడూ పరిచయం లేదు. ఓ స్నేహితుడు చెబితే చేశా. ఫలానా వారితో మాట్లాడా. వెళ్లి కలవండని నేనే వారికి ఫోన్ చేసి చెబుతా. ఇప్పటికీ నా నైజం అదే.

* అది సరే గానీ.. కాపు నేత కన్నా లక్ష్మీనారాయణ.. ఒక ఆరునెలలపాటు ‘కన్నా లక్ష్మీనారాయణ శర్మ’గా ఎప్పుడు మారారు? ఎందుకు మారాల్సి వచ్చింది?
– ఈ విషయం మీకెలా తెలిసింది? ఇది నా పాతమిత్రులు కొందరికే తెలుసు. ఇంతకుముందే చెప్పినట్లు నా జీవితంలో అన్నీ అనుకోకుండానే జరిగిపోయాయి. నేను 1985లో పార్ధసారధి సిమెంట్ సోదర కంపెనీలో పనిచేస్తున్నా. అప్పుడు కారంపూడిలో 11 రోజులు యజ్ఞం నిర్వహిస్తున్నారు. అడ్వకేట్ ఎస్.రామచందర్‌రావు బావ మరుదుల మధ్య మనస్ఫర్ధలు వచ్చి, యజ్ఞం ఆగిపోవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు యాగం చేస్తున్న బ్రాహ్మణులు నాకు జంథ్యం వేసి, నాతో హోమం పూర్తి చేయించారు. అలా 6 నెలలు ఆ జంధ్యంతోనే ఉండిపోయా. ఆవిధంగా కన్నా లక్ష్మీనారాయణ శర్మనయ్యానన్న మాట!

* ఇప్పుడు బీజేపీలో హ్యాపీగానే ఉన్నారా మరి?
– బాగానే ఉన్నా. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాష్ట్రం నుంచి నాకొక్కరికే అవకాశం ఇచ్చారు కదా? ఒకసారి
kanna-bjp రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా అవకాశం వచ్చింది.
* కాంగ్రెస్-బీజేపీకి ఏం తేడా గమనించారు?
– కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య. బీజేపీకి సమర్ధులైన నాయకులు చాలామంది ఉన్నందున, మాకు ఆ సమస్య లేదు. పైగా బీజేపీది జాతీయవాదం. దేశం ముఖ్యం, పార్టీలు తర్వాత అన్నదే సిద్ధాంతం. కాంగ్రెస్‌కు క్రమశిక్షణ లేదు. కానీ బీజేపీకి క్రమశిక్షణే బలం.
* మీ వారసులకు రాజకీయాల్లో దారి చూపిస్తున్నారా?
– నేను చూపించేది ఏముంటుంది? అది వారిష్టం.
* ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు?
– అప్పట్లో సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా సినిమాలకు వెళ్లేవాడిని. ఇప్పుడు ఖాళీ దొరికితే మనుమడు, మనమరాలితో కాలక్షేపం చేస్తుంటా. ఫ్యామిలీకి టైం ఇస్తున్నా. ఈమధ్య కాలంలో కన్నా రంగయ్య ట్రస్ట్ కార్యక్రమాలను విస్తరించాం. పార్టీ కార్యక్రమాలు, పర్యటనలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. మధ్యలో నా మిత్రులు, క్లాస్‌మేట్లు, అభిమానులతో గడుపుతా. నాతో కలసి మొదటి నుంచీ నడిచిన వాళ్లలో, చాలామంది ఇంకా నాతోనే నడుస్తున్నారు. సహజంగా నాతో ఉన్నవారిని నేనెప్పుడూ వదులుకోను. వారంతట వారు వెళితే తప్ప!

రంగా హత్య తర్వాత కూడా మీరు కొందరిలా కాపునేతగా ఎందుకు ఎదగలేకపోయారు?
– నేను మళ్లీ చెబుతున్నా. రంగా కోసమే కాపునాడు నడిపా. రాజకీయాల్లో ఉంటూ కులం కోసం పనిచేశానే తప్ప, కులం కోసం రాజకీయాలు చేయలేదు. దయచేసి ఈ విషయంలో నన్ను ఎవరితోనూ పోల్చవద్దు. అసలు రంగాతో కలసి మేం కాపునాడు ప్రారంభించినప్పుడు మీరు చెప్పినవాళ్లెవరూ లేరు. ‘‘నన్ను రంగా.. రంగాను నేను నమ్మి ఇద్దరం కలసి నడిపిన కాపునాడు వల్ల ఏం సాధించామో అందరికీ తెలుసు.

* మీరు అప్పట్లో శ్రీ కృష్ణదేవరాయలు వేషం వసినట్లున్నారే? అదేంటి?
– ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కల్చరల్ ప్రోగ్రాములో పాల్గొనేవాడిని. ఓసారి కుర్తాళం పీఠాథిపతి.. ఎవరైనా
kanna-drama‘భువనవిజయం’ నిర్వహిస్తే అందులో కన్నాను శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో చూడాలని ఉందని చెప్పారు. అలా కృష్ణదేవరాయలనయ్యా.

* అన్నేళ్ల కాంగ్రెస్ బంధాన్ని ఎందుకు వీడాల్సివచ్చింది?
– నేను అడక్కుండానే వారంతట వారు సీఎం పదవి ఇస్తామని పిలిచి మాట తప్పడం సహించలేకపోయా. రాజకీయాల్లో మాట ఇస్తే నిలబడాలి. నేను నేర్చుకుని పాటించేది కూడా అదే. నేను ఒకసారి ఎవరికయినా మాట ఇస్తే కచ్చితంగా పాటిస్తా. మాట ఇచ్చిన తర్వాత ఎంతపెద్దవాళ్లొచ్చి అడిగినా, ఆల్రెడీ ఒకరికి మాటిచ్చిన విషయం చెబుతా. మరి ఒక వ్యక్తినయిన నేనే మాటకు కట్టుబడితే.. ఒక పార్టీ ఏవిధంగా వ్యవహరించాలి? అందుకే మాట తప్పిన కాంగ్రెస్‌కు దూరం కావలసి వచ్చింది.

అదీగాకుండా మోదీ గారి విధానాలు నచ్చాయి. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నపుడు నేను కిరణ్ క్యాబినెట్‌లో వ్యవసాయ మంత్రిగా ఉన్నా. మీడియా వాళ్లు మీకు ఇష్టమైన సీఎం ఎవరని అడిగితే వైఎస్, నరేంద్రమోదీ అని చెప్పా. ఇది అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అప్పట్లో నా క్యాబినెట్ సహచరులు, కాంగ్రెస్ సీనియర్లు ఫోన్లు చేసి.. మోదీ ఇష్టం అని చెప్పడం ఎందుకు? ఇబ్బంది పడతావు క కదా కన్నా అని ప్రశ్నించారు. కానీ నాకు నచ్చిందే చెప్పానని వాళ్లకు సమాధానం ఇచ్చా. అదీ నా క్యారెక్టర్.

చంద్రబాబుతో వ్యక్తిగత విబేధాలు లేవు
టీడీపీ చీఫ్ చంద్రబాబుతో రాజకీయపరమైన విబేధాలే తప్ప వ్యక్తిగత వైరం లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలతోపాటు, మా దృష్టికి వచ్చిన అంశాలను బట్టి సభలోపల-బయట పోరాడతాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విజయాలు ప్రస్తావించే సందర్భంలో, ప్రతిపక్షాల దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొంటాం. టీడీపీపై కూడా అదే చేశా. రాజకీయాల్లో ప్రొఫెషనల్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియలో రాజకీయ- సైద్ధాంతిక విరోధమే తప్ప వ్యక్తిగత విరోధం
babu-kanna ఎందుకు ఉంటుంది? విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు సీపీఐ నారాయణ-నాకూ పోటీ ఉండేది. చాలా గొడవలు కూడా జరిగాయి. ఇటీవల తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభకు బీజేపీ నుంచి నేను, టీడీపీ నుంచి చంద్రబాబు ఒకే వేదిక పంచుకోవలసి వచ్చింది. నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అమరావతికి మద్దతుగా తీర్మానం చేశాం. ఆ తర్వాత అమిత్‌షా గారు కూడా అమరావతిపై స్పష్టంగా
Kanna-Lakshminarayana-Amit-Shahదిశానిర్దేశం చేశారు. అందుకే రైతుల సభకు పిలిస్తే వెళ్లా. అక్కడ చంద్రబాబు కూడా ఉండటం, ఆయనే నన్ను పలకరించి ఆలింగనం చేసుకోవడం యాధృచ్చికంగా జరిగింది. దానిని కూడా కొందరు సోషల్ మీడియాలో ఏదేదో ప్రచారం చేశారు. అది వాళ్ల ఖర్మ.

Leave a Reply