Suryaa.co.in

Andhra Pradesh

వంద రోజుల్లో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం

  • ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం
  • జగన్ పచ్చి అబద్ధాల కోరు
  • మద్యపానాన్ని నిషేధించాకే ఓటు అడుగుతానన్నావ్… ఆ మాట ఏమైంది..?
  • ప్రకటనల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు మంచి చేయడంలో లేదు
  • ప్రకృతి సంపద కొల్లగొట్టి వైసీపీ నాయకులు కోట్లు దోచుకున్నారు
  • నాడు-నేడు అంటూ గొప్పలు… ఐదేళ్లలో 7,300 స్కూల్స్ మూత
  • కైకలూరును స్మార్ట్ మున్సిపాలిటీగా మారుస్తాం
  • జర్నలిస్టులను సైతం వైసీపీ ప్రభుత్వం వేధించింది
  • కైకలూరు వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్

‘ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్ధించాలి. జగన్ మాత్రం వార్నింగ్ ఇస్తున్నట్లు చూపుడు వేలు చూపిస్తూ సిద్ధం.. సిద్ధం అంటూ పెద్ద పెద్ద పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా వేయించాడు. ఆ పోస్టర్లలో జగన్ హావభావాలు చూస్తే  వైసీపీకి ఓటు వేయకపోతే చంపేస్తాం, నీ భూములు కబ్జా చేస్తాం. సంక్షేమ పథకాలు తొలగిస్తామని హెచ్చరించినట్లు ఉంద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు. చూపుడు వేలు చూపిస్తూ జగన్ మనకు వార్నింగ్ ఇస్తే… మనం కూడా ఓటు అనే ఆయుధంతో ఆయన అవినీతి కోటలు బద్ధలు కొడదామని అన్నారు. శుక్రవారం కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో  పవన్ కళ్యాణ్  ప్రసంగించారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి  కామినేని శ్రీనివాస్, ఏలూరు లోక్ సభ అభ్యర్థి  పుట్టా మహేష్ యాదవ్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ… “దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు అని చిన్నప్పుడు మనం పాఠాల్లో చదువుకున్నాం. అంతటి విశిష్టమైన కొల్లేరు సరస్సు నేడు కాలుష్య కాసారంగా మారిపోయింది. ఒకప్పుడు విదేశీ పక్షులకు విడిదిగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు నిర్జీవంగా మారిపోయింది. సగటు మనిషి కోరుకునేది సొంత ఇళ్లు, మంచి ఆరోగ్యం, కలుషితం కాని నీరు. ఇవేవి లేనప్పుడు ఉపయోగం ఉండదు. ఈ రోజు మన భూగర్భజలాలు చాలా వరకు కలుషితం అయిపోయాయి. తాగటానికి పనికి రాకుండా పోయాయి. మనం ఎంత సంపాదించి ఏం లాభం.

ఎమ్మెల్యేకీ, ఆయన కొడుక్కి ఎందుకు భయపడాలి..?
స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నియంత పాలన సాగిస్తున్నాడు. సహజ వనరులైన ఇసుక, మట్టి కొల్లగొడుతున్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే కొడుకు రైతులను బెదిరించి దాదాపు 50 ఎకరాలు కబ్జా చేశాడు. ఎమ్మెల్యే, ఆయన కొడుకు అంటే ఎందుకంత భయపడుతున్నారు? వాళ్లు ఏమైనా పై నుంచి దిగొచ్చారా..? కైకలూరు ఏమైనా వాళ్ల సొంతమా..? సమాజం భయం గుప్పెట్లో ఉండిపోయింది.  నేను వస్తే ఎండను సైతం లెక్క చేయకుండా ఇంత మంది యువత రోడ్లు మీదకు వచ్చారు. అలాగే నేను లేనప్పుడు కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి. నేను కైకలూరు నుంచి ఒకటే చెబుతున్నాను… ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలను ఇబ్బంది పెడితే వారి అవినీతి కోటలు బద్ధలు కొడతాం.

జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలు
ఒక్క ఛాన్స్ … ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ … రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన రోడ్లను నిర్లక్ష్యం చేశాడు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ చేయలేదు. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ ఇస్తామని హామీ ఇచ్చి జోన్ల విధానం తీసుకొచ్చాడు. మత్స్యకారులకు జీవనోపాధిని దెబ్బదీశాడు. ఇసుక, మద్యంపై వేలకోట్లు దోచుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడానికి, తిరిగి తొలగించడానికి రూ.2,300 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రకటనలకు మరో రూ. 400 కోట్లు, వాలంటీర్లు ద్వారా సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి రూ. 200 కోట్లు ఖర్చు చేయడం తప్ప… జగన్ ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు. ఆయన పచ్చి అబద్ధాల కోరు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. మాట తప్పాడు. మద్యపానాన్ని నిషేధించాకే ఓట్లు అడుగుతాను అన్నాడు… ఇప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తున్నాడు. మాట మీద నిలబడని ఇలాంటి వ్యక్తికి ఓట్లు అగితే అర్హత కూడా లేదు.

యువతను మాదక ద్రవ్యాల మత్తులో ఉంచుతున్నారు
నాడు- నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెప్పుకునే జగన్ … 7,300 ఎయిడెడ్ పాఠశాలు, కళాశాలను మూసేశాడు. ఈ ఐదేళ్ల కాలంలో 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులు దాదాపు 62 నుంచి 68 వేల మంది చనిపోయారు. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు. 25 వేల కిలోల మత్తు పదార్ధాలు విశాఖ తీరంలో దొరికాయి. రాష్ట్రంలో 23 లక్షల మంది యువత గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కూటమి అధికారంలోకి రాగానే వంద రోజుల్లో గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతాం. వైసీపీ నాయకులు వారి జేబులో డబ్బులు తీసి మనకి సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. మనందరి కష్టార్జితంతో కట్టిన పన్నుల ద్వారా వారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మన డబ్బుకు ముఖ్యమంత్రి అనేవాడు ధర్మకర్త మాత్రమే. మన డబ్బులు ఇష్టానుసారం మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి దోచిపెడతాం అంటే కుదరదు.

కైకలూరు టికెట్ భారతీయ జనతా పార్టీకి కేటాయించడానికి బలమైన కారణం ఉంది. బీజేపీ నుంచి  కామినేని శ్రీనివాస్  ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మృదుస్వభావి, ఇచ్చిన మాటకు కట్టుబడే మనిషి. 2014లో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రానికి సేవలoదిస్తున్నాడు… ఉద్ధానం సమస్యను తీసుకెళ్లాను. చంద్రబాబు నాయుడుకి, నాకు వారధిలా పని చేస్తూ సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేశారు. కొల్లేరు కాంటూరు సమస్యను గుర్తు పెట్టుకొనే ఈ ప్రాంతం నుంచి బీజేపీకి సీటు కేటాయించాం. ఆయనను గెలిపించుకుంటే కాంటూరు సమస్యను తప్పక పరిష్కరిస్తారు. ముఖ్యంగా జనసైనికులు, వీరమహిళలు, జనసేన మద్దతుదారులకు చెబుతున్నాను… కూటమిని ఓడించడానికి జగన్ అనేక కుతంత్రాలు పన్నుతున్నాడు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. కైకలూరులో మన కూటమి అభ్యర్థి  కామినేని శ్రీనివాస్  ఆయన కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అలాగే ఏలూరు ఎంపీ అభ్యర్థిగా  పుట్టా మహేష్ యాదవ్  కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. వారిని అఖండ మెజార్టీతో గెలిపించే బాధ్యత మనం తీసుకుందాం.

కైకలూరును మున్సిపాలిటీగా మారుస్తాం
కైకలూరు దినదినాభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ గ్రామ పంచాయతీగానే మిగిలిపోయింది. వైసీపీ పెద్దలు కైకలూరును మున్సిపాలిటీగా చేస్తామని చెప్పారు. ఇప్పటికీ కైకలూరు పంచాయతీ స్థాయిలోనే ఉండిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కైకలూరుని మున్సిపాలిటీగా మారుస్తాం. కైకలూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాలను చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దుతాం. కలిదిండి మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తాం.

రైతుల కోసం రైతుబజార్లు నిర్మిస్తాం. ముదినేపల్లి మండలంలో ధాన్యం నిల్వ చేసుకునే గోదాములు నిర్మిస్తాం. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. కైకలూరు మండలంలో ఈఎస్ఐ ఆస్పత్రిని తీసుకొస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాం. కైకలూరు- ఏలూరు రూరల్ ప్రాంతాలను కలిపే విధానం బ్రిడ్జ్ నిర్మిస్తాం. కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తాం. పెద్దిరెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఏనాడైనా కొల్లేరు వైపు చూశారా..? ఒడిశాలో మాదిరి పక్షుల సంరక్షణ కేంద్రం నిర్మించాలని మాట్లాడారా..? ఈ ప్రాంతాన్ని పర్యటక రంగంగా అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉన్న వందలాది మంది యువతకు ఉపాధి కల్పించవచ్చనే ఆలోచన చేశారా..? ఆయనకు ఎంతసేపు ఎర్రచందనం నుంచి వచ్చే డబ్బులు గురించే తప్ప మన కొల్లేరు గురించి ఆలోచించే సమయం ఎక్కడిది..?

జర్నలిస్టులకు భద్రత కల్పిస్తాం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులు అందరికీ నా శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలలో మీడియా కూడా ఒకటి. అలాంటి మీడియాను వైసీపీ ప్రభుత్వం భయపెట్టి తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసింది.  ఈ ఐదేళ్లలో 112 మంది జర్నలిస్టులపై దాడులు చేసింది. 430 మందిపై కేసులు పెట్టింది. పత్రికలు, ఛానల్స్ ను భయపెట్టడానికి జీవో నెంబర్ 1 ను తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 21 వేల మంది జర్నలిస్టులు ఉంటే కేవలం 9 వేల మందికి మాత్రమే అక్రిడేషన్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులకు న్యాయం చేస్తాం. మీకు భద్రత కల్పిస్తాం. అర్హత కలిగిన అందరికీ అక్రిడేషన్లు అందిస్తాం.

రైతాంగం వ్యతిరేకిస్తే ప్రధాన మంత్రే వెనక్కి తగ్గారు
మన భూములు దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట జగన్ ప్రమాదకరమైన యాక్ట్ తీసుకొచ్చాడు. దానిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కంటే … జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పిలవాలి. ఇప్పటికే మన పాస్ పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై జగన్ తన బొమ్మను వేసుకున్నాడు. రేపు వైసీపీకి ఓటు వేస్తే మన ఆస్తులు గాల్లో దీపమే. ఆధార్ కార్డు తీసుకురావడానికి దాదాపు దశాబ్ధ కాలంపాటు చర్చించి తీసుకొచ్చారు. భూములు దోచేసే ఈ చట్టం గురించి మన అసెంబ్లీలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా చర్చ జరగలేదు. టీడీపీ నాయకులు ఎక్కడ దీనిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తారని ఇంట్లో వాళ్లను వ్యక్తిగతంగా దూషించి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయేలా చేశారు. రైతు చట్టం తీసుకొచ్చినప్పుడు కొంతమంది రైతాంగం వ్యతిరేకించారు. చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో ప్రధాన మంత్రి కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వైసీపీ నాయకులు మాట్లాడితే ఈ యాక్ట్ కేంద్రం చేసిందని చెబుతున్నారు.

కేంద్రం పరిశీలించమని ముసాయిదాను మాత్రమే పంపిస్తుంది. చట్టం అమలు చేయమని చెప్పదు. రాష్ట్ర ప్రభుత్వాలే దానిపై అసెంబ్లీలో చర్చించి కష్ట నష్టాలు కేంద్రానికి తెలియజేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం మన ఆస్తిలో ఏదైనా సమస్య వస్తే… అది మనది అని నిరూపించుకోవడానికి పోలీస్ స్టేషన్, కోర్టులకు వెళ్లడానికి వీలుండదు. స్థానిక రెవెన్యూ అధికారే పరిష్కరిస్తాడంటా… లేదంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని చెబుతున్నారు. ఎకరా, రెండు ఎకరాలు ఉన్న సామాన్యుడు హైకోర్టులు చుట్టూ తిరగలడా..? అందుకే ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి” అన్నారు.

LEAVE A RESPONSE