Suryaa.co.in

Andhra Pradesh

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే

  • ప్రకాశం జిల్లాని సశ్యశ్యామలం చేస్తాం
  • వెలిగొండను వైసీపీ నిర్లక్ష్యం చేసింది
  • ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తానన్న జగన్ ఖాళీ సొరంగాలు ప్రారంభించాడు
  • వైసీపీ ఎమ్మెల్యేలు అందలం ఎక్కితే మన భవిష్యత్తుని చంపేస్తారు
  • కూటమి ప్రభుత్వంలో తొలి సంతకం మెగా డీఎస్సీపైనే
  • ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా
  • స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పునరుద్దరణ
  • కూటమి అభ్యర్ధుల్ని గెలిపించండి.. మీ కష్టంలో నేనుంటా
  • గిద్దలూరు వారాహి విజయభేరీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

‘కరవుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు వరప్రదాయని. అలాంటి ప్రాజెక్టును  వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాలో 23 మండలాల పరిధిలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు, కడప జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు అందించొచ్చు. ప్రాజెక్టు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని చెప్పిన జగన్… నీళ్లు లేకుండా ఖాళీ సొరంగాలను ప్రారంభించాడు. కూటమి ప్రభుత్వం రాగానే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి… ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఎన్నికల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తారు తప్ప… రైతాంగం కన్నీరు తుడవడానికి చిన్నపాటి సాగు నీటి ప్రాజెక్టు కట్టాలంటే వైసీపీ నాయకులకు మనసు రాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాగునీరు, తాగునీరు, విద్యా, వైద్యం, ఉపాధి, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు.  ప్రతి చేతికి పని – ప్రతి చేనుకు నీరు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం గిద్దలూరులో జరిగిన వారాహి విజయ భేరీ సభలో ప్రసంగించారు. గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి అశోక్ రెడ్డి, ఒంగోలు లోక్ సభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “గిద్దలూరులో మా జనసైనికుడు వెంగయ్య నాయుడుని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేని ఓడించకపోతే మాది జనసేనే కాదు అని చెప్పాను. పారిశుధ్యం బాగాలేదని అడిగితే వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. నిండు నూరేళ్లు ఉండాల్సిన ఆయన భార్య పసుపు కుంకుమలు చెరిపేశారు. ఇక్కడ అభ్యర్ధి ఎవరైనా వైసీపీని ఓడించి తీరుతాం. వైసీపీ బెదిరింపులు, గూండాగిరికి భయపడేదే లేదు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ వెనకబాటుతనం అంటారు. ప్రకాశం జిల్లా వెనకబాటుతనం గురించి ఎవరూ మాట్లాడరు. మా నాన్న ఉద్యోగరీత్యా రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగాం. ఇక్కడ ఒంగోలు, కనిగిరి ప్రాంతాల్లో ఉన్న ఫ్లోరోసిస్ ఇబ్బందులు కళ్లారా చూశాను. వెలిగొండ ప్రాజెక్టు వస్తే మార్కాపుం, గిద్దలూరుతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా ఉపయోగపడుతుంది.

ఓటు వేయాల్సిందేనంటూ జగన్ బెదిరిస్తున్నాడు
వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరు అందలం ఎక్కినా మన భవిష్యత్తుని చంపేస్తారు. ఎవరైనా రెండు చేతులు ఎత్తి ఓట్లు అడుగుతాం. ఈ ముఖ్యమంత్రి వేలు చూపిస్తూ సిద్ధం మీరు ఓటు వేయాలి అంటూ బెదిరిస్తున్నాడు. ఆ బెదిరింపులు నీ ఇంట్లో, నీ నియోజకవర్గంలో చేసుకో. రాష్ట్రంలో ఎవరు భయపడతారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో పార్టీని నడిపిస్తున్నాం. జనసేన, జన సైనికులు అస్సలు భయపడరు. గత ఐదేళ్లుగా గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసింది అరాచకాలు, అందర్నీ భయపెట్టడమే. గిద్దలూరులో నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉండి కూడా ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం తగ్గి ఈ నియోజకవర్గాన్ని త్యాగం చేశాం. చంద్రబాబు నాయుడుని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు అంతా బయటికి రావడానికి భయపడుతున్న సమయంలో నేనొక్కడినే వెళ్లి సంఘీభావం తెలిపాను. ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక కాదు. ఓటు చీలకూడదు అన్న మాటకు కట్టుబడి ముందుకు వెళ్లాం. ఇక్కడ పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారి ప్రజల్ని భయపెడుతున్నారని చెబుతున్నారు. వారిని భయపెడితే ఏం చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రోడ్ల మీదకు వచ్చి నిలబడే ధైర్యం వస్తే ఆ ధైర్యమే జగన్, వైసీపీ నాయకులకు వెన్నులో చలి తెప్పిస్తుంది. వైసీపీ గూండాల నుంచి ఆంధ్రప్రదేశ్ ధైర్యంగా ఉందంటే అది జనసైనికులు ఇచ్చిన గుండె ధైర్యమే.

ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం డబ్బు ఉంటుంది
జగన్ ది కడుపు కాదు.. కంభం చెరువు. ఎంత తిన్నా, ఎంత దోచేసినా సరిపోదు. ఆ కంభం చెరువుని ప్రజల కోసం 6 వేల ఎకరాల్లో శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించారు. ఆ చెరువు చుట్టూ టూరిజం ప్రాజెక్టు చేపడితే ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుంది. జగన్ ఎంతసేపు తను ఇచ్చే వాడు ప్రజలంతా తన మోచేతి నీళ్లు తాగేవారిలానే చూస్తున్నాడు. మనం కట్టిన టాక్సుల డబ్బే పథకాల రూపంలో ఇస్తున్నాడు. జగన్ మాత్రం తానే ఇస్తున్నట్టు కథలు చెబుతాడు. ఇది మనం టాక్సులు కట్టిన సొత్తే. పెద్దలకు పింఛన్ పథకం మొదలు పెట్టింది దామోదరం సంజీవయ్య . అదేదో వీళ్లే కనిపెట్టినట్టు చెబుతారు. గిద్దలూరులో నాయకులకు ఎన్నికల్లో గెలవడానికి రూ. 150 కోట్లు ఖర్చు చేయడానికి డబ్బులు ఉంటాయి. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మాత్రం డబ్బు ఉండదు. గిద్దలూరు పట్టణానికి కనీసం మౌలిక సదుపాయాలు లేవు. ఇక్కడ వందల కోట్ల రూపాయిల మైనింగ్ మాత్రం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఇక్కడ డబ్బు ఇక్కడే ఖర్చు చేసి గిద్దలూరు అభివృద్ధి బాధ్యత తీసుకుంటాం. జగన్ పచ్చటి మొక్కలు కనబడితే కొట్టివేయడం మినహా ఓ మొక్క పాతడం తెలియదు. ఎప్పుడూ భూమిలో ఉన్న ఖనిజాలు దోచేద్దామన్న ధ్యాస తప్ప విత్తనం నాటి పంట పండిద్దామన్న ధ్యాస ఉండదు. నేను రైతు పక్ష పాతిని, యువత పక్ష పాతిని మీకు ఉపాధి అవకాశాలు కావాలని కోరుకుంటాను.

తలసేమియా వ్యాధి గ్రస్తులకు రూ.10 వేలు పెన్షన్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తాం. నిరుద్యోగులకు రూ. 3 వేల భృతి ఇస్తాం. వృద్ధాప్య పెన్షన్ రూ. 4 వేలు చేస్తాం. దివ్యాంగులకు రూ. 6 వేలు,  పూర్తిగా కదల్లేని స్థితిలో ఉంటే రూ. 15 వేలు అందిస్తాం. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రూ. 10 వేలు పెన్షన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తాం. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ ఇన్సురెన్స్ చేస్తాం. ప్రతి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతోపాటు, ఆర్టీసీ ప్రయాణం ఉచితం చేస్తాం.  స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు చొప్పున ఎంతమంది స్కూలుకు వెళితే అంతమందికి అందిస్తాం.  ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు ఆర్థిక సాయం చేస్తాం.   పేదలకు కడుపునింపడానికి అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కసీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను వైసీపీ 24కు తగ్గించింది. దీంతో చాలా మంది బీసీలు రాజకీయ ప్రాధాన్యం కోల్పోయారు. కూటమి అధికారంలోకి రాగానే బీసీల రిజర్వేషన్లను తిరిగి 34 శాతానికి పెంచుతాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మెనార్టీల నిధులను వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే వినియోగిస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ. 450 కోట్లను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించింది. సంక్షేమ నిధిని తిరిగి పునరుద్ధరిస్తాం. అలాగే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.  ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందిస్తాం. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయంబర్స్మెంట్ చేసే బాధ్యత తీసుకుంటాం. సీపీఎస్ రద్దుకు ఏడాదిలోగా బలమైన పరిష్కారం తీసుకొస్తాం. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

వైసీపీలో ఎవ్వరికీ గౌరవం ఉండదు
వైసీపీలో ఎవ్వరికీ గౌరవం ఉండదు. అలా గౌరవం లేకే మాగుంట శ్రీనివాసులు రెడ్డి బయటకు వచ్చారు. ఆయన ప్రజల మనిషి. నేను ఆయన తరఫున ఓటు వేయమని అడిగేందుకు వచ్చాను. శ్రీనివాసులు రెడ్డిని గెలిపించండి. గెలిచాక ఒంగోలు పార్లమెంటుతో పాటు గిద్దలూరు అభివృద్ధి బాధ్యత ఆయన తీసుకుంటారు. గిద్దలూరుకి ఆర్టీసీ డిపో సాధిస్తారు. టూరిజం హబ్ గా మారుస్తారు. ఇక్కడ వలసలు ఆగాలి. అంటే పరిశ్రమలు రావాలి. యువత, ఆడపడుచులు నన్ను నమ్మి  మీకు మద్దతు ఇస్తారు. మీరు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి. మహిళలకు వారి కాళ్ల మీద నిలబడే శక్తిని ఇవ్వండి. అశోక్ రెడ్డిని అసెంబ్లీకి పంపండి. ఆయనతోపాటు నేను కూడా గిద్దలూరుతోపాటు 175 నియోకవర్గాల బాధ్యత తీసుకుంటాం. అసెంబ్లీలో మీ తరఫున గళం విప్పుతాం. మీ భద్రత మా బాధ్యత” అన్నారు.

LEAVE A RESPONSE