-
ఏబీకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన బాబు
-
అయినా ఇప్పటిదాకా తీసుకోని ఏబీ వెంకటేశ్వరరావు
-
చైర్మన్ ఏబీకి బాసుగా ఐజి స్థాయి అధికారి
-
చైర్మన్-ఎండీగా ఇవ్వకపోవడమే ఏబీ అసంతృప్తికి కారణమా?
-
రెండు పోస్టులూ ఉంటేనే స్వేచ్ఛ ఉంటుదని ఏబీ భావన
-
తాజా జీవీ రెడ్డి ఎపిసోడ్‌తో ఏబీ వైఖరి స్పష్టం
-
ఎండీతో విబేధించి పార్టీ నుంచి వెళ్లిపోయిన జీవీ రెడ్డి
-
అలాంటి అనుభవాన్ని ఏబీ ముందే ఊహించారా?
-
అందుకే చైర్మన్ పదవి తీసుకోకుండా మౌనంగా ఉన్నారా?
-
సీఎంఓ అధికారులకు ఆపాటి తెలివి లేదా?
-
పార్టీ-ప్రభుత్వంలో అసలు ఏ జరుగుతోంది?
-
నేతలను పిలిచి మాట్లాడే సంస్కృతికి పాతర
-
పార్టీ-ప్రభుత్వంలో అసలు నిర్ణయాధికారం ఎవరిది?
-
టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పటివరకూ ఆ పదవి తీసుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోవడానికి తెరవెనక కారణాలపై, పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జగన్ వేధింపులకు భయపడకుండా ధైర్యంగా ఆయనపై న్యాయపోరాటం చేసి, లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఏబీ స్థాయికి.. ప్రభుత్వం ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ చాలా చిన్నదన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో చాలాకాలం నుంచి ఉన్నదే.
జగన్‌కు ఒక్కసారి కూడా ఎదురుపడి సెల్యూట్ కొట్టని ఏకైక అధికారిగా రికార్డు సృష్టించిన మాజీ డీజీ ఏబీ వెం టేశ్వరరావు.. జీవీ రెడ్డి అనుభవం తనకూ ఎదురవుతుందన్న ముందుచూపుతోనే, తనకు ఇచ్చిన పదవిని తీసుకోకుండా మౌనంగా ఉన్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి పోలీసు కార్పొరేషన్ చైర్మన్ ఏబీ స్థాయికి చిన్నది అయినప్పటికీ, దానితోపాటు ఎండి పదవి కూడా ఇచ్చి ఉంటే హుందాగా ఉండేదంటున్నారు.
రెండు పదవులున్న కార్పొరేషన్ పదవి తీసుకున్నందున దానివల్ల పెద్ద ఉపయోగం లేకపోయినప్పటికీ, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీజీగా రిటైరయిన ఏబీపై, ఐజి స్థాయి అధికారిని ఎండీగా నియమిస్తే ఆయన ఎలా స్వేచ్ఛగా పనిచేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన నియామక ఉత్తర్వులు ఇచ్చిన సీఎంఓ అధికారులకు తట్టకపోవడంపై అప్పుడే విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే.
అందుకు తాజాగా తెరపైకి వచ్చిన జీవీ రెడ్డి ఉదంతాన్ని పార్టీ వర్గాలు పోల్చి చెబుతున్నాయి. ఫైబర్‌నెట్‌లో జరుగుతున్న అక్రమాలు, గత జగన్ హయాంలో అడ్డగోలుగా నియమించిన వారిని సాగనంపకుండా, ఎండి దినేష్‌కుమార్ వ్యవహరిస్తున్న తీరును ఫైబర్‌నెట్ చైర్మన్ ఎండగట్టారు. అంతకుముందు ఆయన తన వాదనను ఎండిగా చెప్పినా వినిపించుకోకపోవడంతో విసిగివేసారిన జీవీ రెడ్డి.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ, దినేష్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దానితో సీఎం చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి తీవ్రంగా మందలించినట్లు ప్రచారం జరిగింది.
వివరణ ఇచ్చుకునేందుకు వెళ్లిన జీవీపై బాబు సీరియస్ అయి, ఇద్దరూ కలసి పనిచేసుకోండని హెచ్చరించి పంపించేశారు. తాను ఎవరిపైనయితే ఆరోపణలు చేశానో.. అదే అధికారితో కలసిపనిచేయటం కుదరని పని అని భావించిన జీవీరెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేయడం టీడీపీలో భూకంపం సృష్టించిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి ఎపిసోడ్ తర్వాత.. ఆ స్థాయిలో రియాక్షన్ వచ్చిన తొలి సంఘటన ఇదేనని, పార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. రెడ్డి వర్గానికి చెందిన జీవీ రెడ్డి రాజీనామాపై, ఎలాంటి స్వప్రయోజనాలు ఆశించకుండా పార్టీని అభిమానించే కమ్మ వర్గాలు సైతం స్పందించి, జీవీకి దన్నుగా నిలిచిన వైనం ఆశ్చర్యపరిచిందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
టీడీపీపై కమ్మ పార్టీ ముద్ర ఉన్నప్పటికీ, ఒక రెడ్డి నేత చేసిన రాజీనామాను కమ్మ వర్గమే జీర్ణించుకోలేకపోయింద ంటే, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని దిద్దుబాటకు దిగాలన్న సూచన టీడీపీ సోషల్‌మీడియా సైనికుల నుంచి వె ల్లువెత్తుతోంది. అంటే కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ, జీవీరెడ్డి టీడీపీ శ్రేణులపై ఎంత బలమైన ముద్ర వేశారో స్పష్టమవుతోందని ఓ మాజీ మంత్రి విశ్లేషించారు. నిజానికి జీవీ రెడ్డి ఎపిసోడ్‌లో.. ప్రభుత్వ తీరును తప్పుపడుతోంది టీడీపీ సోషల్‌మీడియా సైనికులే కావడం ఆశ్చర్యం.
ఇలాంటి పరిణామాలు జరుగుతాయని ముందే ఊహించిన ఏబీ.. ఆ కారణంతోనే, తనకు ఇచ్చిన చైర్మన్ పదవి తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మంచిదన్న భావనతోనే ఆయన ఆ పదవి తీసుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోయారంటున్నారు. అంటే తనకు చైర్మన్ పదవి ఇచ్చినా, ఎండి ఉన్నందున స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని ఏబీ ముందుగానే గ్రహించి, రాజీనామా చేశారంటున్నారు. అయినా ఏబీకి ఆ పదవికి సిఫార్సు చేసిన సీఎంఓ కీలక అధికారికి మెదడు లేకుండా, డీజీగా చేసిన వ్యక్తికి నామమాత్రపు చైర్మన్ పదవి ఒక్కటే ఎలా ఇస్తారన్న చర్చ అప్పుడే జరిగింది.
ప్రస్తుతం సీఎంఓలో ఉన్న ఏ ఒక్క అధికారి జగన్ ప్రభత్వ బాధితుడు కాదని, అందువల్లనే వారి ఎంపికలు ఇలా తగలబడతున్నాయని టీడీపీ సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ఎప్పటిలా పార్టీని పట్టించుకోకుండా, మునుపటి మాదిరిగా సీనియర్ల అభిప్రాయం తెలుసుకోకుండా, ప్రభుత్వంపై దృష్టి సారిస్తున్నందుకే ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయన్న అభిప్రాయం పొలిట్‌బ్యూరో సభ్యుల్లో వ్యక్తమవుతోంది.
అన్నీ చంద్రబాబు ఒక్కరే చూసుకోవడం కష్టమని, దానిని సీఎంఓ అధికారులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అధికారుల పెత్తనానికి తెరదించాలన్న సందేశం జీవీ రెడ్డి ఎపిసోడ్‌లో స్పష్టంగా కనిపించిందని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.
‘‘ బాధితులకే బాధితుల బాధలు, అవమానాలు అర్ధమవుతాయి. ఇప్పుడు సీఎంఓలో ఉన్న ఏ ఒక్క అధికారి జగన్ హయాంలో ఇబ్బందులు పడలేదు. అన్నీ కీలకమైన పోస్టింగుల్లోనే పనిచేశారు. ఓ అధికారి భార్య అయితే ఏకంగా వైసీపీకి సేవ చేశారు. ఇంకో అధికారి కూడా కీలకమైన పోస్టుల్లోనే చేశారు. వైసీపీకి విశేష సేవలందించిన మరో సీనియర్ అధికారికి, రాష్ట్రంలోనే అత్యంత కీలక పదవి ఇచ్చారు. మరి మనది పొలిటికల్ గవర్నరెన్స్ అని మనం ప్రచారం చేసుకుంటే కార్యకర్తలు, నాయకులు ఎలా నమ్ముతారు? నమ్మాల్సింది వాళ్లే కదా? అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
ఏబీ వెంకటేశ్వరరావుకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా జీవో ఇచ్చి ఇన్ని రోజులయినా ఆయన ఆ పదవి తీసుకోలేని కారణాలను ఇప్పటివరకూ ఏ ఒక్క ప్రభుత్వ-పార్టీప్రముఖుడూ పిలిచి తెలుసుకోకపోవడంపై పార్టీ సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీన్నిబట్టి ప్రభుత్వం-పార్టీ ఎటుపోతుంది? అజమాయిషీ చేస్తున్న వారి అనుభవం ఎంతన్నది క్యాడర్‌కు తెలిసిపోతుందని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
అసంతృప్తితో ఉన్న నేతలను పిలిచి మాట్లాడే సంస్కృతి ఎన్టీఆర్ కాలం నుంచి, గత ఎనిమిది నెలల క్రితం వరకూ ఉండేదని, ఇప్పుడు దానికి తెరదించేశారన్న వ్యాఖ్యలు సీనియర్లలో వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు అసంతృప్తితో రాజీనామా చేసి, అజ్ఞాతవాసంలోకి వెళితే, ఆయనను అన్నగారు పిలిచి మాట్లాడిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి గుర్తు చేశారు.
‘‘ పాత్రుడు ఎవరికీ అందుబాటులోకి లేకుండా వెళితే అన్నగారు విశాఖ నేతలను పురమాయించి పాత్రుడిని పిలిపించుకున్నారు. ఒక తండ్రిగా, పార్టీ పెద్దగా నేను నిర్ణయం తీసుకోకూడదా? అని బుజ్జగించడంతో, పాత్రుడు తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే బాబు గారు కూడా ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఎంతోమంది సీనియర్లను పిలిచి మాట్లాడితే వెనక్కి తగ్గారు.
సీనియర్లను పంపించి బుజ్జగింపచేసేవాళ్లు. అసలు ఇప్పుడు అలాంటి వ్యవస్థ ఏదీ? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో పనిచేయించుకుందాం. ఉండేవాళ్లు ఉంటారు. పోయేవాళ్లు పోతారన్న భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీలో మాలాంటి సీనియర్ల నుంచి, జూనియర్ల వరకూ ఇలాంటి భావనే కనిపిస్తోందని’’ టీడీపీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న ఆ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.