Suryaa.co.in

Andhra Pradesh Political News

గంజాయిమామ రాక కోసం దుంపలగట్టు సిద్ధం?

(బాబు భూమా)

కడప జిల్లాలోని ఖాజీపేట మండలం దుంపలగట్టులోని నిశ్శబ్ద పొలాల్లో ఒక జీవితం విషాదకరంగా ముగిసింది. రెడ్యం నారాయణరెడ్డి అనే స్థానిక వ్యక్తి పొలంలో విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

నారాయణరెడ్డి ఆత్మహత్య, అతను గంజాయి కేసులో బెయిల్‌పై విడుదలైన పది రోజుల తర్వాత జరిగింది. పోలీసులు అతనిపై తప్పుడు కేసు నమోదు చేయడం వల్లే అతను ఈ తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడని “బంధువులు” పేర్కొన్నారు.

ఆ వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు సరైన మార్గంలో నడవమని చెప్పకుండా, తీరా ఇలాంటి విషాదం జరిగినప్పుడు వ్యవస్థపై ఆరోపణలు చేయడం అరుదుగా చూస్తాం. గంజాయి వంటి పాపిష్టి సంపాదన వద్దని, ఆ చీకటి దందాలకు దూరంగా ఉండమని ముందుగానే హితబోధ చేసి ఉంటే, బహుశా నారాయణరెడ్డి జీవితం ఇలా విషాదంగా ముగిసేది కాదేమో.

సమాజంలో నేరాలు తగ్గాలంటే, కేవలం పోలీసులు, ప్రభుత్వం మాత్రమే కాదు, కుటుంబాల పాత్ర కూడా కీలకం. తమ పిల్లలు, బంధువులు అక్రమ మార్గాల్లో వెళ్లకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యత వారికి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా గంజాయి వంటి దందాల్లో ఇరుక్కుంటే, దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసి, నేరాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం వల్ల సమాజం మరింత అసహ్యంగా చూస్తుంది. తెనాలిలో అదే జరిగింది.

తెనాలిలో నిందితులు సైతం సిగ్గులేని గంజాయి మామతో ఫోటోలు దిగడానికి సిగ్గుపడ్డారనే విషయం, నేరాలకు పాల్పడిన వారికీ కొంతైనా నైతిక బాధ్యత, సమాజం పట్ల భయం ఉంటుందని సూచిస్తుంది. మరికొందరు తమ తప్పులను ఒప్పుకోకుండా, వ్యవస్థపై నిందలు వేయడం ఆమోదయోగ్యం కాదు.

ప్రభుత్వ పథకాలు పౌరుల సంక్షేమం కోసం ఉద్దేశించినవి. కానీ, ఒక కుటుంబం అక్రమ కార్యకలాపాలకు మద్దతిస్తూ, సమాజానికి హాని కలిగిస్తూ, అదే సమయంలో ప్రభుత్వ ప్రయోజనాలను పొందడం న్యాయం కాకపోవచ్చు. సమాజంలో నేరాలను తగ్గించడానికి, కుటుంబాల్లో చట్టబద్ధమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి బలమైన చర్యలు అవసరం. పి4తో పేదరికం రూపుమాపడంతో పాటు, పనిష్మెంట్ కూడా కఠినంగా తక్షణం అమలవ్వాలి.

LEAVE A RESPONSE