– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ : విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధిత కుటుంబాన్ని శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ పరామర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా వ్యవహరించటం వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటం రాష్ట్రానికే అవమానకరమన్నారు.
ఈ ఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ నేను సిగ్గుపడుతున్నానని అన్నారు. అత్యాచారం చేసిన శ్రీకాంత్, బాబురావు, పవన్ కల్యాణ్‌కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు పట్టించుకోకపోగా కుమార్తెను వెతుక్కోవాలని తండ్రికి చెప్పడం ఏంటని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అని సీఎంను ప్రశ్నించారు. సీఎం ఒంగోలుకు కాదు వెళ్లాల్సింది.. ఇక్కడకు రావాలన్నారు. ఏపీలో దిశ చట్టం లేదు..దిశ యాప్ లేదు. కేవలం లేనిదాన్ని ఉందని చెప్పుకొని సీఎం తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రవర్తన వల్ల సంఘ విద్రోహులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డల విలువ ఈ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవా చేశారు. మరో రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయిని పల్నాడులో అత్యాచారం చేశారు.. సీఎం కాన్వాయ్ కోసం కారు డ్రైవర్‌ను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నరహారశెట్టి నరసింహారావు, ఏపిసిసి కార్యదర్శి & అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి నూతలపాటి రవికాంత్, అమరావతి రాజధాని కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్, ఏపిసిసి సోషల్ మీడియా కో ఆర్డినటర్స్ తూమాటి బాలు, సనపల రమేష్ నగర కాంగ్రెస్ నాయకులు సింహాద్రి జగన్ తదితరులు పాల్గొన్నారు.