– విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ బదిలీ అన్యాయం
– నిజాయితీ అధికారులకు ఇచ్చే బహుమతి ఇదేనా?
– కాపు వ్యాపారులు, ఉద్యోగులనూ వేధిస్తున్నారు
– కమ్మ-కాపుల పరిశ్రమలపై ఎందుకు పగ?
– వేధింపులపై విచారణ జరపాలి
– ఉత్తరాంధ్ర కమ్మ యువజన సంఘం అధ్యక్షుడు గుమ్మడి శివసుబ్రమణ్యం
విశాఖ: రాష్ట్రంలో కమ్మ అధికారులు-పారిశ్రామికవేత్తలు- వ్యాపారులకు రక్షణ లేకుండా పోయిందని ఉత్తరాంధ్ర కమ్మ యువజన సంఘం అధ్యక్షుడు గుమ్మడి శివ సుబ్రమణ్యం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
కమ్మ సామాజికవర్గానికి చెందిన విశాఖ ఆర్డీఓ శ్రీలేఖపై బదిలీ వేటు వేయడం అన్యాయమని, నిజాయితీ అధికారులకు ఇచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు. విశాఖ జిల్లా ఉన్నతాధికారి, ఆయన బంధువుల అరాచకాలను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినందుకు, నిజాయితీపరురాలయిన ఆర్డీఓ శ్రీలేఖను బలి చేయటం దారుణమన్నారు.
ఆమెను వేధించిన అధికారిని శిక్షించాల్సిందిపోయి, మహిళా అధికారిపై చర్యలు తీసుకోవడం భావ్యం కాదన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కూడా లెక్కచేయకుండా, ధైర్యంగా పనిచేసిన శ్రీలేఖ చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. ఇది రాష్ట్రంలోని కమ్మ సామాజికవర్గం మనసుగాయపరిచే అంశమని స్పష్టం చేశారు.
కూటమి వచ్చిన తర్వాత పరిశ్రమలను సంబంధించి కమ్మ-కాపు సామాజికవర్గాలను, కొన్ని వర్గాలకు చెందిన అధికారులు పనిగట్టుకుని వేధిస్తున్నారని వెల్లడించారు. ఇది ప్రధానంగా ఫ్యాక్టరీస్, పీసీబీ శాఖల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, ఏయే స్థాయిలో ఈ వేధింపులు జరుగుతున్నాయో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కూటమి కోసం పనిచేసిన కమ్మ-కాపు వర్గాలకు చెందిన ఉద్యోగులు-పరిశ్రమల యజమానులు- వ్యాపారులను రక్షించి, న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని గుమ్మడి స్పష్టం చేశారు.