Suryaa.co.in

Editorial

మాధవుడికి ఇది ముళ్లకిరీటమేనా?

– అప్పుడే మొదలైన కోటా పంచాయతీ
– ఐదుశాతం వాటాపై సీనియర్ల సీరియస్
– బీజేపీ ఉన్నందునే కూటమి గెలించిందంటున్న సీనియర్లు
– బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విష్ణుకుమార్‌రాజు, ఆదినారాయణరెడ్డి
– వారిద్దరి ప్రసంగాలకు భారీ స్పందన
– పదవుల్లో వాటాపై పెరుగుతున్న స్వరం
– నియోజకవర్గాల్లో కనిపించని గౌరవంపై అసంతృప్తి
– పురందీశ్వరి హయాంలో వినిపించని గళం
– మాధవ్ వచ్చాక మొదలైన ప్రశ్నల వర్షం
– కేంద్ర నామినేటెడ్ పదవుల్లోనూ మొండిచేయి
– కమలనాధులకు మాధవ్ న్యాయం చేస్తారా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇల్లలకగానే పండగ కాదన్నది ఓ సామెత. అది ఇప్పుడు ఏపీ బీజేపీ పగ్గాలందుకున్న పివి మాధవ్ విషయంలో ఎదురవుతోంది. హేమాహేమీలను కాదని, మాధవ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించినప్పటికీ.. తాజా పరిణామాల నేపథ్యంలో, ఆయనకు సీనియర్ల సహకారంపై తొలిరోజునే అనుమానపు మేఘాలు కమ్ముకోవడం, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రధానంగా పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితోపాటు.. మాధవ్ అభ్యర్థిత్వాన్ని తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలు పరిశీలిస్తే.. మాధవ్‌కు అధ్యక్ష పదవి ముళ్లకిరీటంగానే కనిపిస్తోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

బీజేపీకి 5 శాతం పదవులే ఇస్తామన్న టీడీపీ విధానాన్ని విష్ణుకుమార్‌రాజు, ఆదినారాయణరెడ్డి బాహాటంగానే వ్యతిరేకించి.. ఆ కోటాను పెంచాలన్న గళం పెంచడం పరిశీలిస్తే, మాధవ్‌కు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవన్న వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇది ప్రత్యక్షంగా మాధవ్‌పై ఒత్తిడి వ్యూహమే అయినప్పటికీ, పరోక్షంగా టీడీపీపై అసంతృప్తిగానే భావించక తప్పదని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

మాధవ్ అధ్యక్షుడిగా ఎంపిక అయిన తర్వాత జరిగిన తొలి సమావేశమే, ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టివేయడం విశేషం. కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న పదవుల పంపకాల్లో.. బీజేపీకి 5 శాతం, జనసేనకు 15 శాతం చొప్పున పదవులు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. దీనితో పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకు, అన్యాయం జరుగుతోందన్న అసంతృప్తి గత ఏడాది నుంచి బీజేపీలో కొనసాగుతోంది.

అయితే.. దానిని ఏ సందర్భంలోనూ బహిరంగంగా వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. ప్రధానంగా పురందేశ్వరి అధ్యక్షురాలిగా ఉన్నంతకాలం ఎవరూ గళం విప్పకపోవడం.. మాధవ్ అధ్యక్ష బాధ్యత స్వీకరించిన తొలిరోజునే, అసంతృప్తి స్వరం వినిపించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రధానంగా దీనిపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలకు, పార్టీ శ్రేణుల్లో మద్దతు పెరుగుతుండటం విశేషం. ‘‘బీజేపీ కూటమిలో చేరకపోతే పరిస్థితి ఏమిటన్నది ప్రభుత్వానికి తెలియచేయాలి. మాట్లాడితే ప్రభుత్వంలో మీది ఐదుశాతం వాటా అంటారు. వాటీజ్‌దిస్ 5 పర్సంట్? దిసీజ్ రెడిక్యులస్. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ వాటా పెరగాలి. మీకు 5 శాతమే ఉంది. మీకు ఇంతే అంటే కుదరదు. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇవ్వకుండా ఎగనామం పెట్టడం సరికాదు. కూటమి కచ్చితంగా కలసి ఉండాలి. మన వాటా మనకు దక్కాల్సిందే. దీనిపై అధ్యక్షుడు మాధవ్ గట్టిగా అడగాలి. ఆయనకు మేమంతా మద్దతునిస్తాం’’ అన్న విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు, సగటు కమలనాధుల గుండెల్లో గుచ్చుకున్నాయి. నిజానికి విష్ణుకుమార్‌రాజు ఇప్పటిదాకా ఈ స్థాయిలో గళం విప్పిన సందర్భమే లేదు.

విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలు ఒకరకంగా, మాధవ్ సత్తాను సవాల్ చేసేవే. ఆయన వ్యాఖ్యలు.. టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి చేసి, బీజేపీ కార్యకర్తలకు ఎక్కువ సంఖ్యలో పదవులిప్పించే బాధ్యత మీదేనని, పరోక్షంగా మాధవ్‌కు చెప్పేవే. 5 శాతం కోటా వాటాను తొలగించి, కూటమి అధికారంలోకి వచ్చేందుకు కారణమయిన బీజేపీకి, పెద్ద పీట వేయించే బాధ్యత కూడా మాధవ్‌దేనని రాజు చెప్పకనే చెప్పినట్లయింది.

ఇక మరో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా, అటు ఇటుగా కార్యకర్తల పక్షమే వహించడం విశేషం. ‘‘కూటమిని కాపాడుకునేందుకు కేంద్రనాయకత్వం మాధవ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. కూటమిలో మాధవ్, కృష్ణుడి పాత్ర పోషించాలి. ప్రతి ఒక్కరూ ఆశమీద ఉన్నారు. పార్టీకి సరైన స్థానం కల్పించలేదన్నది కార్యకర్తల భావన. మనం ఎన్ని లెటర్లు ఇచ్చినా కూడా, ఆ పోస్టులు మనకు ఇవ్వడం లేదు. మాధవుడంటే కృష్ణుడు. మాధవ్ కృష్ణనీతి పాటించాలి. కఠినంగా వ్యవహరించకపోతే పనికాదు. మన పార్టీలో కూడా అంతర్గత విషయాలున్నాయి. వాటిని కూడా పరిష్కరించాలి. మన కోటా పెంచుకోవాలి. మనకు 10 ఎమ్మెల్యేలు,6 ఎంపీలే ఇచ్చారు. దాన్ని 12 మంది ఎంపీలు, 20 మంది ఎమ్మెల్యేలు ఇచ్చే పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత మాధవ్‌పై ఉంది’’ అన్న ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలకు, సమావేశంలో అనూహ్య స్పందన లభించడం విశేషం. ప్రధానంగా కార్యకర్తలకు న్యాయం జరగడం లేదన్నప్పుడు కార్య ర్తల నుంచి భారీగా చప్పట్లు వినిపించాయి.

తాజా సమావేశంలో కార్యకర్తల గుండెచప్పుడు వినిపించిన విష్ణుకుమార్‌రాజు, ఆదినారాయణరెడ్డి ప్రసంగాలకు కార్యకర్తలు ఈలలు, చప్పట్లు వినిపించడం బట్టి.. కూటమిలో బీజేపీకి ఏ స్థాయిలో అన్యాయం జరుగుతుందన్న అసంతృప్తి స్పష్టమయింది.

నిజానికి కూటమిలో బీజేపీ చేరకపోతే తమకు పోటీ చేసే అవకాశం దక్కేదని, పోనీ కూటమి కట్టిన తర్వాతయినా తమకు న్యాయం జరిగిందా అంటే అదీ లేదని నేతలు కుండబద్దలు కొడుతున్నారు. కొత్తగా తెరపైకి తెచ్చిన 5 శాతం కోటా వల్ల తాము నష్టపోతున్నామంటున్నారు.

మొదటినుంచీ పార్టీలో ఉన్న వారిని కాదని, ప్రభుత్వ-పార్టీ పదవుల్లో పార్టీ మారి వచ్చిన వారికే పెద్దపీట వేశారన్న విమర్శలు ఇంకా వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ పదవుల్లో ఒకటి అరా ఇస్తున్నారని, బీజేపీ లేకపోతే అసలు కూటమి ఎక్కడిదన్న ప్రశ్నలు కమలదళాల నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో కూటమి వల్ల టికెట్లు కోల్పోయిన వారితోపాటు.. రాష్ట్ర స్థాయి నేతలు సైతం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పద వులు ఆశిస్తున్నారు.

‘‘మాకు కేంద్రం ఎలాగూ నామినేటెడ్ పదవులివ్వడం లేదు. మాకు పదవులివ్వాలని ఇప్పటివరకూ వచ్చిన ఒక్క అధ్యక్షుడు కూడా చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం రాష్ట్రంలో ప్రభుత్వ స్థాయిలో కూడా పదవులివ్వకపోతే, ఇక మా త్యాగాలకు అర్థం ఏముంటుంది’’ అని ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా టీడీపీ,జనసేన ఎమ్మెల్యేలు తమను ఖాతరు చేయడం లేదని, ఈ విషయాన్ని గతంలో నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు తిరుపతి లెటర్లు కూడా తీసుకునే పరిస్థితి లేదని, టీటీడీ లెటర్లు ఎవరి నుంచి తీసుకోవాలో తెలియని దుస్థితిలో ఉన్నామని సీనియర్లు వాపోతున్నారు.టీటీడీలో భానుప్రకాష్‌రెడ్డిసహా చాలామందిని కేంద్రం సిఫార్సు చేసినప్పటికీ, వారెవరూ తమకు అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. ‘టీటీడీ సభ్యుల లేఖలను పార్టీ ఆఫీసుకు సరెండర్ చేయడమే దీనికి మార్గమ’ని ఓ రాష్ట్ర నేత స్పష్టం చేశారు.

ప్రభుత్వంలో తమ పార్టీ ఉన్నా కించిత్తు పనులు కావడం లేదంటున్నారు. ‘‘బీజేపీ కూటమిలో చేరటం వల్ల టీడీపీ-జనసేనకే లాభం తప్ప మాకేమీ లాభం కనిపించడం లేదు. మా త్యాగాలకు అర్ధం లేకుండా పోయింది. అప్పుడు ఎలాగూ ఇవన్నీ పురందేశ్వరి పట్టించుకోలేదు. ఇప్పుడు మాధవ్ అయినా తన పలుకుబడి ఉపయోగించి కార్యకర్తల గౌరవం పెంచకపోతే, ఆయన కూడా విఫల అధ్యక్షుడవుతారు. అసలు కూటమిలో కార్యకర్తల గౌరవం పెంచడం పైనే మాధవ్ ప్రతిభ ఆధారపడి ఉంది’’ అని అనకాపల్లికి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండగా.. అమరావతిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన టెండర్లనీ టీడీపీ వారికే ఇస్తున్నారని, వాటిలో తమ పార్టీ వారిని ఎంటర్ కానీయడం లేదని బీజేపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు తమను పిలవడం లేదంటున్నారు.

‘గత ఎన్నికల్లో వాళ్లకు ఎలాగయితే కాంట్రాక్టర్లు ఎన్నికల్లో నిధులిచ్చారో మాకూ అలాగే ఇచ్చారు. కానీ అమరావతి పనుల్లో వాళ్లను నిధులిచ్చిన వారికి కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు ఇప్పిస్తున్న ప్రభుత్వం.. మేం సిఫార్సు చేసే కాంట్రాక్టర్లకు ఎలాంటి పనులివ్వకపోవడం అన్యాయం కదా? అసలు అమరావతి పనులే పూర్తిగా మా పార్టీ ప్రభుత్వ నిధులతో నడుస్తున్నప్పుడు, మాకు పనులు ఇవ్వకపోవడం అన్యాయం కదా’ అని, ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చే యడం గమనార్హం. కొత్త అధ్యక్షుడు మాధవ్, దీనిని సీఎం దృష్టికి తీసుకువెళ్లి.. పార్టీకి నిధులిచ్చిన కాంటాక్టర్లకు పనులిచ్చేలా చూడాలని సూచిస్తున్నారు.

ఇక ప్రభుత్వంలో ఉన్న మంత్రి సత్యకుమార్‌యాదవ్‌కు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సహకరించడం లేదన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ‘మేం ఏం చెప్పినా రూల్స్ చెబుతున్నారు. కృష్ణబాబు ప్రతిపనికీ మోకాలడ్డుతున్నారంటున్నారు. కానీ వాళ్లకు కావలసినవి వాళ్లు చేసుకుంటున్నారు. మరి అదే రూల్స్ టీడీపీ వాళ్లకు వర్తించవా? సత్తెన్న దగ్గరికి ఏ పనితీసుకువెళ్లినా ఇది సాధ్యం కాదంటున్నారు. మరి మనం అధికారంలో ఉండి ఏం ఉపయోగం?’ అని గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ప్రశ్నించారు. దీనికి సంబంధించి, ఇటీవల సోషల్‌మీడియాలో కార్యకర్తల ఆవేదన వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఢిల్లీలో సుదీర్ఘకాలం కేంద్రప్రభుత్వ విధానాలను చూసిన సత్యకుమార్, అందరిలా అబద్ధాలు చెప్పకుండా.. నిబంధనల మేరకు ఉన్న వాస్తవం చెబుతున్నారని, బహుశా ఇది కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని మరికొందరు సీనియర్లు విశ్లేషిస్తున్నారు. కార్యకర్తలు కూడా నిబంధనలకు వ్యతిరేకమైన పనులు తీసుకువస్తే, వాటిని ఎలా చేస్తారంటున్నారు.

ఇదిలాఉండగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటివరకూ.. కేంద్రంలోని నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘‘ రాష్ట్ర స్థాయిలో కేంద్ర నామినేటెడ్ పదవులు వేల సంఖ్యలో ఉంటాయి. వాటిని సిఫార్సు చేయడంతోపాటు, కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి కార్తకర్తలకు న్యాయం చేద్దామన్న ఆలోచన, ఇప్పటివరకూ ఏ ఒక్క అధ్యక్షుడూ చేయలేదు. కొంతమంది ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుని, కేంద్రంలో నామినేటెడ్ పదువులు తెచ్చుకున్నారు. కార్యకర్తలందరూ ఆ స్థాయిలో లాబీయింగ్ చేసుకోలే రు కదా’ అని ఓ సీనియర్ మహిళా నేత ప్రశ్నించారు. కొత్తగా పగ్గాలందుకున్న మాధవ్ అయినా దీనిపై దృష్టి సారించాలంటున్నారు.

దీన్నిబట్టి.. బీజేపీ కార్యకర్తల ఆశలు భారీ స్థాయిలో ఉన్నాయని స్పష్టమవుతోంది. తమ పార్టీ స్థాయికి తగ్గట్లు పదవులు, గౌరవం దక్కట్లేదన్న నేతల అసంతృప్తిని చలార్చే బాధ్యత, కొత్త అధ్యక్షుడు మాధవ్‌పైనే ఉంది. అయితే ఈ సమస్యను ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.

ఎందుకంటే.. సీఎంకు బంధువైన పురందేశ్వరితోనే కానిది, మాధవ్‌తో ఎలా అవుతుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇలాంటి అనేక సమస్యలు మాధవ్‌కు అధ్యక్ష కిరీటం ముళ్లకిరీటంలా పరిణమించనున్నట్లు కనిపిస్తోంది. దీనిని మాధవ్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

LEAVE A RESPONSE