బడుగులకు రాజ్యాధికారం దక్కిన రోజు

– తెలుగునాట రామరాజ్య స్థాపనకు నాంది పలికి నేటికి 40 ఏళ్లు
– పేదరికాన్ని పెంచుతూ, తెలుగుజాతిని విధ్వంసం చేస్తున్న వైకాపాను గద్దెదించడమే
ఎన్టీఆర్ కు నిజమైన నివాళి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు

తెలుగునాట ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసి నేటికి 40 ఏళ్లు. మహోజ్వల చారిత్రక క్షణాలను స్మరించుకుంటూ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ నివాళి అర్పిస్తోంది. దేశంలో సంక్షేమ పాలన పురుడుపోసుకున్న రోజు 09-01-1983. సమసమాజం అన్న స్వప్నం వాస్తవ రూపం దాల్చిన రోజు. ఆనాడు తెలుగువారిని మదరాసీలుగా పిలిచే స్థితి. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు. పేదరికం తాండవించేది. తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడేది. ఆ పరిస్థితుల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నినదించారు. బీసీలకు తొలిసారిగా రాజకీయ గుర్తింపు తీసుకువచ్చింది ఎన్టీఆర్. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించడంతో పాటు వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచడం, స్థానిక సంస్థల్ల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేశారు. దీంతో పెద్దఎత్తున రాజకీయాల్లోకి బీసీలు వచ్చారు. సంక్షేమానికి ఆద్యులు ఎన్టీఆర్. కిలో రెండు రూపాయలకు బియ్యం, పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం, పేదలకు జనతా వస్త్రాల పంపిణీ ప్రవేశపెట్టి సగం ధరకే దుస్తులు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులకు రూ.30 చొప్పున పింఛను పథకాన్ని మొదటిసారిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, భూమి శిస్తు రద్దు, రైతులకు రూ.50కే హార్స్ పవర్ విద్యుత్, భూమిలేని నిరుపేదలకు భూవసతి కల్పించడంతో పాటు తెలుగు గంగ పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళల కోసం తిరుపతిలో మొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. 40 ఏళ్లు పేదల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధిగా టీడీపీ పాలన సాగించింది.

జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పేదరికం పెరిగిపోయింది. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అట్టడుగు స్థానానికి పడిపోయింది. దీనికి కారణం ఇప్పటికే మద్యం రేట్లు పెంచి లక్ష కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మి పేద, మధ్యతరగతి జేబులు ఖాళీ చేశారు. పన్నులు, ధరలు, ఛార్జీలు పెంచి ప్రజల సంపాదన గుంజుకున్నారు. రైతులకు గిట్టాబాటు ధరలు కల్పించలేదు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఏటా జనవరి 1వ తేదీన జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పి చేయలేదు. ఉద్యోగుల, కార్మికుల జీతాలు పెంచకపోగా వీరు దాచుకున్న సొమ్ము కాజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.47 వేల కోట్లు దారిమళ్లించారు. తెచ్చిన రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో సగం జగన్ రెడ్డి ముఠా దోచుకున్నది. వైకాపా అరాచకాల వల్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో పేదరికం తారాస్థాయికి పెరిగింది. పేదిరకం లేని సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ ఆశయానికి జగన్ రెడ్డి గండికొట్టారు. జగన్ రెడ్డిని గద్దె దింపి పేదరికం లేని సమాజం, ఆర్థిక అంతరాలు తగ్గించే పరిపాలన అందించడమే ఎన్టీఆర్ కు మనమిచ్చే నిజమైన నివాళి. ఎన్టీఆర్ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు ద్వారానే పేదరికం లేని సమాజం, తెలుగుజాతి పునర్ వైభవం సుసాధ్యమవుతుంది.

Leave a Reply