Suryaa.co.in

Political News

ఇది ప్రజల తీర్పు

రాజకీయాల్లో ఆత్మహత్యలే గానీ హత్య లుండవు. అలాగే శాశ్వత శత్రువులు , మిత్రులు ఉండరు . నేటి రాజకీయాల్లో జంపర్ జంపింగ్ లు నిత్య కృత్య మయ్యాయి. వీటిని పార్టీ పెద్దలు , నాయకులు , ప్రజలు గమనిస్తూ ఉండాలి . ఓటు అనేది రహస్యం . అదొక ఆయుధం . ఒక కులం , మతం , వర్గం , ప్రాంతం వారు వేస్తేనే పార్టీలు గెలుస్తాయనేది అపోహ మాత్రమే.

కుల – మత – వర్గ – ప్రాంత అభిప్రాయాలు క్రమంగా తొలగి స్వేచ్ఛ వైపు ప్రపంచం ప్రయాణం చెయ్యడం మొదలైనది. ప్రపంచమే ఒక కుగ్రామమై పోతున్నది. ఆధిపత్య జాతుల పాలన అంతమవుతోంది . గతంలో రాచరిక , నియంతృత్వ పోకడల కోటలను బద్దలు కొట్టారు , కానీ ఆయా వర్గాలు కొత్త అవతారాలు ఎత్తి పాలనలోకి చొచ్చుకు వస్తున్నారు. విజ్ఞానం పెరిగాక , సర్వ మీడియా ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్నాం, కానీ ఆ మీడియా మాయాజాలంలో చిక్కుకుని , అవే సత్యాలని నమ్మి ఓట్లు వేస్తున్నారు కొందరు . క్రమంగా వాటిని కూడా బొంద పెడతారు . అదే తెలంగాణలో నేడు జరిగింది.

తెలంగాణాలోని గ్రామీణ ప్రాంత ఓటర్లు కాంగ్రెస్ వైపు పూర్తిగా వరిగి పోయినట్లు పోలింగ్ సరళి తెలియజేస్తోంది. అదే హైద్రాబాద్ నగర ఓటర్లు పూర్తిగా బి.ఆర్.ఎస్ కు ఓట్లు వేశారు . హైద్రాబాద్ లో గత రెండు ఎన్నికల నుండి కాంగ్రెస్ ప్రభావం క్రమంగా తగ్గిపోతూ , బలమైన నాయకులు అందరూ ఇతర పార్టీల లోనికి వలస పోవడంతో పార్టీ బలహీన పడింది. అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అవ్వడంతో కాంగ్రెస్ ప్రచారంలో బాగా వెనుకబడింది. కనీసం ఓటును అడిగేవారే కరవయ్యారు.

ఓటు అడగకపోయినా కొన్ని టి.డి.పి శ్రేణులు , ఇతర కొందరు సెటిలర్స్ ఓట్లు వెయ్యడంతో ఆ మాత్రంగా నైనా 2 వ స్థానంలో ఓట్లను సాధించింది. నగరంలో కాంగ్రెస్ ఓట్లు అధమ స్థాయి లోకి పడిపోయి దిక్కులేని చుక్కాని లాగా తయారయ్యింది. సెటిలర్స్ ఓట్ల వల్లే నగరంలో ఆ మాత్రం పరువుతో నిలబడింది. కొన్ని చోట్ల టి. డి. పి శ్రేణులు ముందు ఉండి నడిపించ వలసిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ మంది కొత్త అభ్యర్థులు కావడం వల్ల , వారికి ఓట్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడం లోనే కాలం సరిపోయింది. చాలా ప్రాంతాల ఓటర్లను కల్సుకోలేక పోయారు. టి.డి.పి మద్దతు ఉందని భావించిన కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేసాము అనే భ్రమల్లో విహరించి , డబ్బు ఖర్చు చేయడం తగ్గించడం వల్ల ఇంతలా ఘోరంగా నగరంలో కాంగ్రెస్ దెబ్బతినవల్సి వచ్చింది.

గత రెండు సార్లుగా బి.ఆర్.ఎస్ అధికారంలో ఉండడం వల్ల , అభ్యర్ధులను ముందే ప్రకటించడం వల్ల , అందులో నగరం , శివార్ల బి.ఆర్.ఎస్ అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరు పడినందు వల్ల , ఆర్థిక బలం , అంగ బలం గట్టిగా ఉండడం వల్ల బి.ఆర్.ఎస్ నగరంలో విజయం సాధించింది. అయినా సెటిలర్స్ ఓట్లు అన్నీ ఒకే పార్టీకి వేయాలనే నియమం ఏమీ లేదు కదా ? టి.డి.పి పోటీలో లేకపోయినా , అది ఒక సామాజిక వర్గపు పార్టీ అని భ్రమించి కొన్ని వర్గాలు బి.ఆర్.ఎస్ కి ఓట్లు వేసి ఉండవచ్చు. జన సైనికుల ఓట్లు ఎక్కువుగా బి.ఆర్.ఎస్ కు పడి ఉండవచ్చు నని విశ్లేషకులు చెబుతున్నారు .

దానికి ఎన్నికల ఫలితాలను కారణాలుగా చూపిస్తున్నారు. జనసేనకు లక్ష ఓట్లు ఉన్నవని చెప్పబడే కూకట్పల్లి లో 40 వేలు రాగా , 4 వేలు తాండూరు , 3 వేలు ఖమ్మం , మిగతా చోట్ల 2000 – 2500 మధ్య ఓట్లు లభించాయి. లక్షలాది సెటిరల్స్ లో వేలాది జనసేన ఓటర్లు ఉన్నారని చెప్పే వారి ఓట్లు ఎవరికి వేసినట్లు ? ఓట్ల సరళి చూస్తే వారిలో ఎక్కువ మంది బి.ఆర్.ఎస్ కు వేసారని చెబుతున్నారు. కారణాలు ఏమైనా వై.సి.పి అభిమానులు కూడా బి.ఆర్.ఎస్ కు గంపగుత్తగా ఓట్లు వేశారని చెబుతున్నారు . జనసేన ఓట్లు బి.జె.పి కి బదిలీ అయినమతగా , బి.జె.పి ఓట్లు జనసేనకు బదిలీ కాలేదన్నట్లుగా ఓటింగ్ సరళి కన్పిస్తోంది.

ఓట్ల బదిలీ జరిగి ఉంటే , ఓట్లు చీలి కాంగ్రెస్ కు నగరంలో కొన్ని స్థానాలు దక్కి వుండేవని చెబుతున్నారు . హైద్రాబాద్ 15 స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ కు రాలేదు. 7 బి.ఆర్.ఎస్ కు , 7 ఎం.ఐ.ఎం కు , 1 బి.జె.పి కి లభించాయి . రంగారెడ్డి జిల్లాలో 14 స్థానాలుంటే 4 కాంగ్రెస్ , 10 బి.ఆర్.ఎస్ కు దక్కాయి . మెదక్ 10 స్థానాలుంటే 3 కాంగ్రెస్ కు , 7 బి.ఆర్.ఎస్ కు లభించాయి. ఇక్కడ విచిత్ర పరిస్థితి బి.జె.పి ది . దానికి ఈ 3 జిల్లాలో 1 స్థానం మాత్రమే లభించింది. మొత్తం 39 స్థానాలుంటే కాంగ్రెస్ కు 7 , బి.ఆర్.ఎస్ కు 24 , ఎం ఐ ఎం కు 7 , బి జె పి కి 1 లభించాయి .

ఈ 3 జిల్లాలలోనే కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నది. రెడ్డి సామాజిక వర్గం వారు కాంగ్రెస్ నుండి 26 మంది , బి.ఆర్.ఎస్ నుండి 14 మంది , బి.జె.పి నుండి 3 , మొత్తంగా 43 మంది గెలుపొందారు. గత 2 ఎన్నికల నుండి సెటిలర్స్ ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం. నగరంలో అభివృద్ధి కార్యక్రమాల వల్ల బి.ఆర్.ఎస్ పట్ల సానుకూలత ఏర్పడింది. కర్ణాటక మాదిరి ఇక్కడ కూడా ముస్లిం లు కాంగ్రెస్ కు ఓట్లు వేస్తారని భావించారు. ముస్లిం లను తమ వేపు తిప్పుకోవడం లో సరైన వ్యూహం అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది. వారి మద్దతు సింహ భాగం బి.ఆర్.ఎస్ కు లభించింది.

బి.ఆర్.ఎస్ – బి. జె.పి – ఎం. ఐ. ఎం లోపాయికారీ మైత్రి చాలా బలీయ మైనది. ఎం.ఐ.ఎం ఇతర రాష్ట్రాలలో తమ అభ్యర్థులను నిలిపి ఓట్లను చీల్చి బి.జె.పి కి లబ్ది చేకూర్చి పెడుతోంది. ఆ మైత్రి ఇప్పటికీ కొనసాగడం వల్లే కాంగ్రెస్ కు అనుకున్నంతగా ఓట్లను ముస్లింల నుండి పొందలేక పోయింది. యాతా , వాత నగరం, శివారు ప్రాంతాలయిన 3 జిల్లాల్లో 24 స్థానాలతో బి.ఆర్.ఎస్ లబ్ధి పొందగా , మిగతా అన్ని జిల్లాల్లో కేవలం 15 స్థానాలను మాత్రమే పొందింది . అదే కాంగ్రెస్ నగర ప్రాంతంలో కేవలం 7 స్థానాలు మాత్రమే పొంది , మిగతా జిల్లాలలో 57 స్థానాలు కైవశం చేసుకుంది. గ్రామీణ ప్రాంత ఓటర్లు బి.ఆర్.ఎస్ పై తమ ఆక్రోశాన్ని ఓట్ల రూపంలో కాంగ్రెస్ కు వేయడం వల్ల తిరుగులేని ఆధిక్యత కాంగ్రెస్ సాధించింది.

ఇక సాఫ్ట్ వేర్ రంగ ఉద్యోగుల అత్యుత్సాహం ప్రదర్శించారని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వారందరికీ హైద్రాబాద్ లో ఓట్లు ఉండక పోవచ్చును. వారికి చంద్రబాబు మీద ఇష్టతతో రాలీలలో పాల్గొని ఉండవచ్చు. ఇతర రాష్ట్రాల వారు చంద్రబాబు మీద ప్రేమతో రాలీలో పాల్గొని ఉండవచ్చు. హైద్రాబాద్ లో ఓటు వేస్తే ఎ. పి లో ఓట్లు తొలగిస్తామని ఎ.పి సర్కార్ తెలిపిందనే పుకారు పుట్టడంతో కొందరు ఓటింగ్ కు వెళ్లలేదని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకోవడంతో భూముల ధరలు , తద్వారా భవనాల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. కాంగ్రెస్ వస్తే ధరలు తగ్గుతాయనే ప్రచారం చెయ్యడం వల్ల , అభద్రతా భావం కొందరిలో ఏర్పడిందని చెబుతున్నారు.

మత కలహాలు , కులాల కొట్లాటలు లేక నగరం ప్రశాంతంగా ఉందనీ , వై. సి.పి వల్ల అమరావతి ఎలా నాశనం అయినదో ప్రత్యక్షంగా చూసిన పిదప , ప్రశాంత వాతావరణం హైద్రాబాద్ లో కనిపిస్తున్నందు వల్ల , ఆ ప్రభావం ఓటింగ్ పై పడిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల వారూ బి.జె.పి కి వేశారని అందుకే ఓట్లు చీలి బి.ఆర్.ఎస్ లబ్ధి పొందిందని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అందరూ ప్రజాతీర్పును గౌరవించి ప్రజా సంక్షేమానికి కృషి చెయ్యాలి . అధికార కాంగ్రెస్ ప్రభుత్వం బాద్యతా యుతంగా పనిచేస్తూ అన్ని వర్గాల మన్నలను పొందగలదని తెలంగాణా ప్రజానీకం కోరుకుంటోంది.

– వి . యల్ . ప్రసాద్
సేకరణ: సాయి సుధ

LEAVE A RESPONSE