రెండు రాష్ట్రాలు కలవడం సాధ్యం కాకపోవచ్చు

-సుప్రీం కోర్టులో ఒక విధంగా… ప్రజల ముందు మరొక విధంగా
-మాట మార్చిన సజ్జల
-చంద్రబాబు నాయుడు రోడ్ షో కి ఇసుక వేస్తే రాలనంత జనం
-పవన్ కళ్యాణ్ ను వేధించడం మానుకోవాలి
-విజయసాయిరెడ్డిఉన్న పదవులను కూడా వదులుకొని సేవ చేసుకోవచ్చు
-ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తిరిగి కలవడం ఆచరణలో సాధ్యం కాకపోవచ్చునని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. విభజిత రాష్ట్రాన్ని కలపడం అంత ఈజీ కాదని తెలిపారు. రెండు రాష్ట్రాలు తిరిగి కలవాలని ఒక జాతీయవాదిగా తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ప్రకారం కలిపే అవకాశాలు ఉన్నప్పటికీ… తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ విభజన అనంతరం ఆంధ్ర ప్రజలు దెబ్బ తిన్నారని తెలంగాణ ప్రజలు భావిస్తే, తిరిగి రెండు రాష్ట్రాలు కలిసే అవకాశం ఉంటుందేమోనని అన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ చక్కటి పురోగతిని సాధించిందన్నారు. హైదరాబాదులో అర ఎకరా స్థలం ఉన్నవారు నిజంగానే కోటీశ్వరులని, అదే ఆంధ్రాలో 50 ఎకరాలు ఉన్న వారు కూడా నిజమైన కోటీశ్వరులు కాదన్నారు.

శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రెండు రాష్ట్రాలు తిరిగి ఏకం కావాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటా?, లేకపోతే సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాటా??అని ప్రశ్నించారు. జగన్ మనసులో ఏముంది అన్నది స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. జగన్ సమైక్యవాది కాదన్న రఘురామకృష్ణంరాజు, ఇప్పుడు ఏమైనా మారారా? అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటును మాజీ మంత్రి కన్నబాబు స్వాగతించడం పరిశీలిస్తే, దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానం కలగక మానదున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ తరహా డ్రామాలు ఆడుతున్నారన్న సందేహాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజనపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక విధంగా, ప్రజల ముందు మరొక విధంగా వ్యవహరిస్తుందని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాదంతో గతం లో సుప్రీంకోర్టును తొలుత తానే ఆశ్రయించానని తెలిపారు. రాజ్యాంగ సవరణలు చేయకుండా రాష్ట్ర విభజన కుదరదని సుప్రీం కు నివేదించినట్లు వివరించారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, సీఎం రమేష్ లు పిటీషన్లను దాఖలు చేశారన్నారు.
తన తరఫున ప్రముఖ న్యాయవాది పాలినారీమన్ అద్భుత వాదనలు వినిపించారని తెలిపారు. అయితే, రాజ్యాంగ సవరణలు చేయకుండానే అసభద్ధంగా రాష్ట్ర విభజన చేయడం జరిగిందన్నారు. ఇటీవల మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం స్టే కోసం సుప్రీంకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే నన్నారు. అదే సమయం లో గతంలో పెండింగులో ఉన్న రాష్ట్ర విభజన కేసు కూడా బెంచ్ పైకి వచ్చిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింగ్వి వాదనలను వినిపిస్తూ విభజనకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నట్లు నివేదించారని తెలిపారు. ఈ కేసును కొట్టివేయాలని ఆయన కోరారన్నారు . మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన వాదనలను వినిపిస్తూ జరిగిన రాష్ట్ర విభజనను ఎలాగో ఆపలేమని, అయినా భవిష్యత్తులో ఇష్టారాజ్యంగా విభజన జరగకుండా ఉండడానికి ఈ కేసు దోహదపడుతుందని పేర్కొనడం జరిగిందన్నారు. ఇంకా విభజన హామీలు నెరవేరలేదని, అయినా జగన్మోహన్ రెడ్డి పచ్చి విభజన వాదిగా ముద్ర పడడం ఆశ్చర్యంగా ఉందని ఉండవల్లి అన్నారన్నారు. ఈ దెబ్బతో ఆయన రాజకీయంగా భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

అది ఒక కారణమే…
2013 విజయదశమి రోజున తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఏడాది తిరగకముందే ఆ పార్టీని వీడడం జరిగిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను పార్టీలో చేరిన వెంటనే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగిందన్నారు. తాను ఈ విషయాన్ని గతంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం లో తెలియజేయడం జరిగిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి సమైక్యవాది కాదని తెలిసి తాను నిర్ఘాంత పోయానన్నారు.

తాను అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడడానికి అది కూడా ఒక కారణమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుపై ఎలాగైతే కోర్టులో చెప్పారో, ఇప్పుడు రాష్ట్ర విభజనపై కూడా అలాగే చెప్పారన్నారు. కోర్టులో ఒక మాట, ప్రజల ముందు మరొక మాట చెప్పడం తమ పార్టీ నాయకులకే చెల్లిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని భూస్థాపితం అయ్యిందని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అటువంటి తప్పిదాన్నే చేస్తోందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా, కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందేమో నన్న ఆందోళన ఆయన మాటల్లో వ్యక్తం అయిందని తెలిపారు.

సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించగా, నష్ట నివారణకు రంగంలోకి దిగిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు రాష్ట్రాలు కలిసి పోతే అంతకంటే మాకు ఏముందని పేర్కొనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని రఘురామకృష్ణం రాజు మండి పడ్డారు. న్యాయవాది తెలియకుండానే సుప్రీంకోర్టులో మాట్లాడారని పేర్కొనడం గతంలో సిపిఎస్ కు, ఓపిఎస్ కు మధ్య ముఖ్యమంత్రికి తేడా తెలియదని చెప్పడం లాంటిదేనని ఎద్దేవా చేశారు. మనం ఏదైతే చెబుతామో కోర్టులో న్యాయవాది తన వాదన పటిమతో అదే వినిపిస్తారన్నారు.

అంతేకానీ న్యాయవాది తనకు ఇష్టం వచ్చినట్లు చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆర్టికల్ 3 ప్రకారం విభజించమని గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చిందా లేదా అన్నది ముఖ్యమని, ఒకవేళ లేక ఇవ్వకపోతే విభజన జరగకపోయి ఉండేదా? అన్నది అప్రస్తుతమన్నారు.

పొన్నూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షో కి ఇసుక వేస్తే రాలనంత జనం హాజరయ్యారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే సభలకు ఏసీ బస్సులు ఏర్పాటు చేసి, భోజనాలు పెట్టి, క్వార్టర్ సీసాలు ఇచ్చిన కందకాలను, గేట్లను దూకి ప్రజలు పారిపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల 20వేల మంది గృహ సారధులను నియమించి, ప్రచారాన్ని నిర్వహిస్తారట అని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

వాలంటీర్లను, పంచాయితీ సిబ్బందిని, గృహ సారధులను సమన్వయం చేసేందుకు ఒక్కొక్క గ్రామానికి ముగ్గురు సమన్వయకర్తల నియమించాలని నిర్ణయించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వీరికి ప్రభుత్వం జీతభత్యాలను చెల్లిస్తుందా?, పార్టీ ఇస్తుందా??అన్నదానిపై స్పష్టత లేదన్నారు. తమ పార్టీ గృహసారధులను నియమించినట్లుగానే, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా మరో 10 లక్షల నలభై వేల మంది సిబ్బందిని నియమిస్తే వారితో కూడా గ్రామ వాలంటీర్లు సమాచారాన్ని పంచుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఈ 15 లక్షల అరవై వేల మందిని భరించాలా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీలతో కూడా సమాచారాన్ని పంచుకుంటారా? లేదా? అన్నదానిపై ముఖ్యమంత్రి కాకపోతే, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయినా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రభుత్వం వేదించడం మానుకోవాలని రఘురామకృష్ణ రాజు డిమాండ్ చేశారు. భీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా టికెట్ల ధరలను తగ్గించి ఆయన్ని లొంగదీసుకోవాలని చూశారన్నారు. కానీ ఆయన ఇతర హీరోల మాదిరిగా ప్రభుత్వ పెద్దలకు లొంగి పోలేదని ఆత్మగౌరవంతో నిలబడ్డారన్నారు . విశాఖపట్నం పర్యటన సందర్భంగా హోటల్ గది నుంచి బయటకు రాకుండా కట్టడి చేసి , బలవంతంగా తిప్పి పంపించి వేశారని గుర్తు చేశారు.

ఇప్పటం గ్రామ పర్యటన సందర్భంగా కనీసం కారు కూడా దిగకుండా అడ్డుకోవాలని చూశారన్నారు. తాజాగా ప్రజా జీవితంలోకి రావడానికి వారాహి అనే వాహనానికి అలిగ్రీవ్ రంగు వేస్తే దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంతమంది ఆలీ గ్రీవ్ రంగులు వేసుకోవడం లేదని ప్రశ్నించారు. వై నాట్ 175 అంటూనే ప్రతిపక్ష నేతలను వేధించడం ఏమిటంటూ నిలదీశారు. లోకేష్ పాదయాత్ర చేస్తే ఆయనపై దొంగ కేసు పెట్టాలని చూస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవారా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి సేవ చేయాలని విజయసాయిరెడ్డి భావిస్తే… ఉన్న పదవులను కూడా వదులుకొని సేవ చేసుకోవచ్చు అంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా రఘురామకృష్ణం రాజు చెప్పారు .

Leave a Reply