Home » జగమంత ఆలోచన..జగనంత తెలివి!

జగమంత ఆలోచన..జగనంత తెలివి!

( మార్తి సుబ్రహ్మణ్యం)
ఉపాయం లేని వాడిని ఊరు నుంచి వెళ్లగొట్టమన్నారు పెద్దలు. ఇప్పుడు ఏపీ ఏలిక జగనన్న తీసుకుంటున్న అద్భుత నిర్ణయాలు చూస్తే ఆ సామెతనే గుర్తుకొస్తోంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, వేలకోట్లు ఎక్కడి నుంచి వస్తాయన్న సందేహపరులకు, ఆయన చూపిస్తున్న తరుణోపాయాలు నివ్వెరపరిచేవే. వైద్యానికే కాదు, అప్పులకూ చిట్కాలుంటాయని ప్రపంచానికి ఉపదేశించిన మహా కాలజ్ఞాని మన జగనన్న! ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలే కాదు. అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రికీ రాని ఐడియాలన్నీ జగనన్నకే తట్టడం గొప్ప. అందుకే ఉపాయం లేనివాడిని ఊరు నుంచి వెళ్లగొట్టమని, ఇప్పుడు జగనన్నే స్వయంగా మిగిలిన రాష్ట్రాల ప్రజలకు సందేశమిస్తున్నారు.
అవును మరి. ఓవైపు చేసిన పనులకు బిల్లులు దక్కని కాంట్రాక్టర్లు కోర్టు మెట్లెక్కుతున్నారు. మరోవైపు ఎప్పుడో రావలసిన బిల్లుల కోసం సర్కారీ ఆఫీసుల చుట్టూ చకోరపక్షుల్లా తిరుగుతున్నారు. ఇంకో వైపు ఏదో ఒకటి తెగనమ్మి.. బొక్కసం నింపేసుకోవాలన్న జగనన్న ప్రయత్నాలను, కోర్టు ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. ఏపీలో ఉన్న ‘ప్రపంచ ప్రసిద్ధ మందు బ్రాండ్ల’ను ఎవరూ కొనడం లేదు. పైగా పక్క రాష్ట్రాల నుంచి ఇష్టమైన బ్రాండ్లు తెచ్చుకుని, తెగ తాగేస్తుండటం ఖజానాకు అదో బొక్క . ఇసుక అమ్మకాలతో సర్కారు ఖజానా కంటే, వైసీపీ ఎమ్మెల్యేలు, లీడర్ల సొంత ఖజానాలే నిండుతున్నాయి. అటు చూస్తే.. పాపం విత్తమంత్రి బుగ్గన రాజేందర్‌నాధ్ రెడ్డి గారు పర్మినెంటుగా ఢిల్లీలోనే అడ్డా పెట్టేశారు. ఆయనది అక్కడ ఎక్కే గడప, దిగే గడపగా మారింది. అప్పులివ్వమని కనపడిన, కనపడనివారి గడ్డాలు పట్టుకుని బతిమిలాడుకుంటూ ‘అప్పుల అప్పారావు’ సినిమాలా మారిన దయనీయం.
ఇంకోవైపు విఠలాచార్య కూడా చూపించనన్ని మాయలు చేస్తు, కంతలు పడ్డ ఖజానాను నింపేందుకు సాహస కృత్యాలు చేస్తున్న ‘ఫైనాన్సు సత్యనారాయణ’ ఫీట్లు, పెద్దగా వర్కవుటు కాని పరిస్థితి. పాపం సత్యనారాయణ సారు కాళ్లకు బలపాలు కట్టుకుని దేశాలు పట్టి తిరుగుతున్నా, ఏపీ ఘనత తెలిసిన వారెవరూ అప్పులు విదిలించని దుస్థితి. అప్పటికీ, సత్యనారాయణ సారు గోకర్ణ-గజకర్ణ-టక్కు టమార విద్యలతోనే ఏపీ ఖజానా బండి ఇందాకా వచ్చింది మరి. కానీ ఏ మెడిసినకయినా ఎక్సపయరీ డేటు ఉన్నట్లే.. సత్యనారాయణ తెలివికీ ఎక్సపయరీ డేటయిపోయినట్లుంది. అందుకే విమానాలు, హోటళ్ల బిల్లుల ఖర్చు తప్ప, ఎక్కడా చిల్లిగవ్వ రాలడం లేదు.
నూతన్‌ప్రసాద్ అదేదో సినిమాలో చెప్పినట్లు.. రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, సహజంగా ఏ ఏలికయినా దేవుడిపైనే భారం వేసి చేతులెత్తేస్తారు. అప్పులిచ్చే వారి కోసం దుర్భిణీ వేసి వెతికినా కనిపించని… దుర్భర, దారిద్య్ర, దిక్కుమాలిన, దౌర్భాగ్య, దివాలా దుస్థితిలో… ఆంధ్రాను ఆదుకునేందుకు, అనన్యం-అద్భుతం-అనితర సామాన్యమైన ఐడియాలు, జగనన్న బుర్రలో తళుక్కున మెరవడం అబ్బురమే. భవిష్యత్తులో తాగుబోతుగా మారే వారిని కూడా, బ్యాంకులకు గ్యారంటీగా చూపి అప్పులు తెచ్చుకోవడం.. సినిమా ప్రేక్షకులను కూడా తాకట్టు పెట్టి, ఆ టికెట్లను గ్యారంటీగా చూపి అప్పులు తెచ్చుకోవాలన్న జగనన్న ఆలోచన ముందు… అర్ధశాస్త్ర పితామహుడు కౌటిల్యుడు, బుద్ధిలో బృహస్పతి, తె లివిలో చాణక్యుడు కూడా దిగదుడుపే. బహుశా పైలోకంలో ఉన్న ఆ బాపతు మేధావులంతా.. బతికున్నప్పుడు తమకు ఈపాటి తెలివిరానందుకు తమను తాము తిట్టుకుని, జగనన్న తెలివితేటలు చూసి ఈర్ష్యపడినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. దేశంలోని ముఖ్యమంత్రులంతా, ఆంధ్రాలో జరుగుతున్న ఈ అద్భుతాలు చూసి నోరెళ్లబెడుతున్నారు. అప్పులు వచ్చే ఆ కిటుకేమిటో వెళ్లి కనుక్కోమని తమ అధికారులను బెజవాడకు పురమాయిస్తున్నారట. చేతికి ఎముక లేకుండా ఎన్నికల హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన కొత్త ముఖ్యమంత్రులందరికీ, మన జగనన్న ఆదర్శమూర్తి అవతారమెత్తారు.
నిజం! సహజంగా ఇన్ని తెలివితేటలు అర్ధశాస్త్రంలో ఢక్కామొక్కీలు తిన్న వారిలోనే కనిపిస్తుంటాయి. పోనీ జగనన్న ఏమైనా.. అర్ధశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారా అంటే అదీ లేదు. ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనేమిటో ఎవరికీ తెలియకపోయినా.. జగనన్న చదివిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా, ఇలాంటి టెక్నిక్కులు నేర్పించరు. అయినా చదువుకు-తెలివికీ ఏమాత్రం సంబంధం లేదు. పెద్ద పెద్ద చదువులు చదివిన చాలామంది.. బ్యాంకింగ్ వ్యవస్థ లొసుగులతో అప్పులు తీసుకుని, బ్యాంకులకు సున్నం వేస్తున్నారు. కానీ ‘రైట్‌రాయల్’గా కొత్త కొత్త రూట్లలో.. అసలు ఎవరూ కలలో కూడా ఊహించలేని సరికొత్త ఉపాయాలతో, దర్జాగా బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకునే ‘మట్టిలో మాణిక్యాలు’, దేశంలో కొందరు మాత్రమే కనిపిస్తుంటారు. అలా ఆంధ్రాలో ప్రజలకు దొరికిన మట్టిలో మాణిక్యమే మన జగనన్న.
ఖాళీ అయిపోతున్న ఖజానా నింపేందుకు జగనన్న చేయని ప్రయత్నమంటూ లేదు. అసలు అప్పు చేయడమనేది ఒక ఆర్టు. అది అందరికీ అబ్బదు. దానికీ క్రియేటివిటీ కావాలి. నిజానికి అప్పు చేయడం కూడా ఒక సంపాదనే. కాబట్టి అప్పు చేసే వారిని అంత తేలిగ్గా చూడకండి. తాజాగా సినిమా టికెట్ల అమ్మకాల వ్యవహారాలు, సర్కారే తీసుకుంటుందన్న జీఓ కూడా జగనన్న తెలివికి ఓ నిదర్శనం. అది చాలదన్నట్లు.. మటన్ మార్కెట్లకో కార్పొరేషన్ పెట్టడం, ఆ సినిమా టికెట్లు.. ఈ మటన్ కొట్లు నుంచి వచ్చే ఆదాయాన్ని చూపించి, అప్పులు తీసుకోవాలన్న జగనన్న ఆలోచన అదుర్స్. ఇకపై జనం మటన్ కొట్టు మస్తాను దగ్గరకు వెళ్లే పనిలేకుండా.. ఎంచక్కా సర్కారు వారే, రేషను సరుకులు మాదిరిగా ఇంటి దగ్గరకే వచ్చి వాలంటరీల ద్వారా మటను అమ్ముతుందన్నమాట.
సర్కారే మందుకొట్లు, మటన్‌కొట్లు, సినిమా టికెట్లు అమ్ముతున్నట్లుగానే.. పనిలోపనిగా సర్కారువారే ఇడ్లి-సాంబారు-బిర్యానీ హోటళ్లు, చేపలు-రొయ్యలు, బీడీ-సిగరెట్లు, చాయ్- సమోసా కార్పొరేషన్లు పెట్టి.. ఎంచక్కా దానితో భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపించి, అప్పులు చేస్తే ఖజానాకు ఇక తిరుగేముంటుంది? వాటికి జగనన్న ప్రసాదం అనో, వైఎస్‌ఆర్ ఆశీర్వాదం అనో, జగనన్న ఫుడ్‌వరల్డు అనో పెడితే పబ్లిసిటీకి పబ్లిసిటీ కూడా వస్తుంది. ఓసారి అది కూడా ఆలోచించకూడదూ?!

Leave a Reply