– వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర రావు ఆత్మహత్యకు కారకుడు జగన్ రెడ్డే
– నిన్న పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించి రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు
– రపరపా నరుకుతామంటూ ప్రజలకు ఏం సందేశమిస్తున్నారు
– నాగమల్లేశ్వరరావు చనిపోయిన జూన్ 9న సీఎం ఎవరు..జగన్ రెడ్డి కాదా?
– శాంతిభద్రతలు అదుపులో ఉండటం జగన్ రెడ్డికి ఇష్టం లేదు
– కేబినెట్ లో కమ్మ కులస్తులకు అవకాశం ఇవ్వని జగన్ కు ఆ సామాజిక వర్గం పేరెత్తే అర్హతే లేదు
– దుత్తలూరు లో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
దుత్తలూరు: నేను, నా రౌడీ కట్ట రోడ్లపైకి వస్తే పోలీసులు ఏం చేయలేరని జగన్ రెడ్డి అనుకుంటున్నాడేమో..తాటతీసి వదిలిపెడతారని గుర్తుంచుకోవాలి. చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదని తెలుసుకోవాలని హితవు పలుకుతున్నాం. జగన్ రెడ్డిని, ఆయన రౌడీ బ్యాచ్ స్లోగన్లు, ఫ్లకార్డులను చూసి ఎవరూ భయపడరు. చనిపోయిన కుటుంబానికి పరామర్శకు వెళుతూ ఆ ర్యాలీలేంటి..నినాదాలేంటి? ఫ్లకార్డులేంటి?జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కే ఒక బ్లాక్ మార్క్. ఇష్టప్రకారం రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటామంటే కుదరదు,అదుపులో ఉంటే మంచిది
పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. నిన్న రెంటపాళ్లలో నాగమల్లేశ్వర రావు పరామర్శ పేరుతో రౌడీమూకలతో ప్రదర్శన నిర్వహించాడు. పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించి రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. రఫరఫ నరుకుతాం అని ఫ్లకార్డులు ప్రదర్శించి ఏం సందేశమిస్తున్నారు? జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అప్పట్లో ఎలా ఎన్నికయ్యాడో అర్థం కావడం లేదు.
రెంటపాళ్ల నాగ మల్లేశ్వరరావు చనిపోయిన 2024 జూన్ 9 నాటికి ఆపద్ధర్మ సీఎం జగన్ రెడ్డి కాదా? చంద్రబాబు నాయుడు జూన్ 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చే నాటికి వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు బెట్టింగులు కట్టి నిండా మునిగిపోయాడు. వై నాట్ 175 అని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి మాటలు నమ్మి నాగమల్లేశ్వరరావు పందేలు కట్టి ప్రాణాలు తీసుకున్నాడు.
బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లడానికి సిగ్గుందా? నాగమల్లేశ్వరరావు విగ్రహం చూసి అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలా? శాంతిభద్రతలు అదుపులో ఉండాలని జగన్ రెడ్డి కోరుకోవడం లేదు.
శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజీపడదు. వైసీపీ పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్డుకుపోయి సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. సొంత జిల్లా ప్రజలు ఘోర విపత్తులో చిక్కుకుంటే ముఖ్యమంత్రిగా హెలికాఫ్టర్ లో విహరించిపోయాడు. అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడుతో కలిసి మేమంతా కష్టాల్లో ఉన్న ప్రజల మధ్య తిరిగాం. నారా భువనేశ్వరమ్మ ప్రతి బాధిత కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేశారు.
వైసీపీలోని కమ్మ కులస్తులు చంద్రబాబు నాయుడికి నచ్చడం లేదని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో 2022లో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన తర్వాత జగన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్కరికైనా అవకాశం కల్పించారా? మొదట ఒకరికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఆయనకు కూడా లేకుండా పదవి తీసేశాడు. రాష్ట్రం పుట్టినప్పటి నుంచి కమ్మ, కాపు, బీసీలు లేకుండా మంత్రివర్గాలు ఉన్నాయా?
ఆస్తుల విధ్వంసం, అక్రమ కేసులు, బెదిరింపులతో ఐదేళ్లు ఆ సామాజిక వర్గాన్ని వేధించిన జగన్ రెడ్డికి కమ్మ అనే పేరు ఎత్తే అర్హత ఎక్కడిది? అమర్ రాజాను రాష్ట్రం నుంచి తరిమేశాడు..దూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలోని సంగం డెయిరీని మూత వేయాలని కుట్రలు చేశాడు.