Suryaa.co.in

Andhra Pradesh

భవన నిర్మాణ కార్మికుల సొమ్మునూ వదలని జగన్

-సంక్షేమ బోర్డు నిధులు రూ.2500 కోట్ల మింగేశారు
-అధికారంలోకి వచ్చాక చంద్రన్న భీమా పునరుద్దరిస్తాం
-మంగళగిరి అడ్డాకూలీలతో యువనేత నారా లోకేష్ భేటీ

మంగళగిరి: జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్ట్రంలోని 30లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు పనులులేక రోడ్డున పడ్డారని యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి గ్రేట్ ఇండియా సెంటర్ లో అడ్డాకూలీలతో మంగళవారం ఉదయం భేటీ అయిన యువనేత లోకేష్ వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డునిధులు 2,500 కోట్లను దారిమళ్లించిన జగన్… కార్మికులకు తీరని ద్రోహం చేశారన్నారు. గత ప్రభుత్వంలో అమలుచేసిన చంద్రన్న బీమా పథకాన్ని కూడా రద్దుచేసి తీరని ద్రోహం చేశారన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణరంగం పడకేసింది. మూడుముక్కలాటతో అమరావతి పనులు నిలిపేయడంతో కార్మికులు పొట్టచేతబట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అమరావతి నిర్మాణం కొనసాగించి ఉంటే 5లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. టీడీపీ పాలనలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే.. జగన్ రెడ్డి పాలనలో రూ.5వేల నుంచి రూ.7వేల వరకు పెరిగింది. దీంతో నిర్మాణరంగం కుదేలై భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు.

కరోనా సమయంలో వందలాది కార్మికులు ఉపాధి లేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ద్వారా కార్మికులను ఆదుకున్నాం. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే రూ.5 లక్షల సాయం అందించాం. మట్టి ఖర్చులకు తక్షణమే రూ.5వేలు అందించడం జరిగింది. నేడు చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేయడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రమాదాలు జరిగినా ఆదుకునేవారు లేరు. గతంలో కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సాయం అందేది. నేడు సంక్షేమ బోర్డు అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వంలో కార్మిక సంక్షేమ బోర్డును పునర్ నిర్మించి ఆ డబ్బులు కార్మికుల సంక్షేమానికే ఖర్చుచేస్తాం.

పనుల్లేక పస్తులుంటున్నాం: కార్మికుల ఆవేదన

ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుక అందుబాటులో లేకపోవడంతోడ పనులు లేవని, అమరావతి నిర్మాణం నిలిచిపోవడంతో తామంతా రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలో అతి కష్టం మీద మూడురోజులు మాత్రమే పని దొరుకుతోందని, మిగిలిన రోజుల్లో పస్తులుండాల్సి వస్తోందని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చాక ఇసుక ధరలు తగ్గించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. అనారోగ్యానికి గురైన కార్మికులను ఆదుకునే నాధుడు లేడన్నారు. రోజువారీ ఖర్చులకోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఒక పక్క పనుల్లేక ఇబ్బంది పడుతుంటే జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు మోయలేని భారంగా మారాయని తెలిపారు.

లోకేష్ స్పందిస్తూ భవన నిర్మాణ కార్మికులు ధైర్యంగా ఉండాలని, రాబోయే ప్రభుత్వం కార్మికులను అన్ని విధాల అండగా నిలుస్తుందని అన్నారు. జగనోరా వైరస్ ను ఓటు ద్వారా తరిమికొడితేనే కార్మికులకు మళ్లీ చేతినిండా పని దొరుకుతుందని చెప్పారు. కార్మికులు, పేదలను కష్టాలనుంచి గట్టెక్కించేందుకే చంద్రబాబానాయుడు సూపర్-6 పథకాలను ప్రకటించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన ఇసుక పాలసీని అమలుచేస్తామని, అమరావతి పనులు కొనసాగించి నిర్మాణరంగానికి గత వైభవం చేకూరుస్తామని యువనేత లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE