-తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోండి
-టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి :- రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు జవహర్ రెడ్డితో చంద్రబాబు నాయుడు మంగళవారం ఫోనులో మాట్లాడారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలూ పెట్టలేదన్న విషయాన్ని సీఎస్ తో చంద్రబాబు ప్రస్తావించారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేపట్టాలని కోరారు.
ఎండల సమయంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని వివరించారు. రెండుమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలకు పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులను రావాలని చెప్పడం సరికాదన్నారు. సచివాలయం సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేపట్టలాని చంద్రబాబు కోరారు. ఏ ఒక్క లబ్దిదారుడికీ ఇబ్బంది లేకుండా వెంటనే పంపిణీ ప్రక్రియను చేపట్టాలన్నారు. సీఎస్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా తోనూ చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. పెన్షన్ ల విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేలా…. ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పెన్షన్ ల విషయంలో వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారం పైనా చర్యలు తీసుకోవాలి ఎన్నికల ప్రధాన అధికారి మీనాను చంద్రబాబు కోరారు.