రూ. 2200 కోట్ల అప్పుల కోసం విద్యార్థుల భవిష్యత్ తాకట్టుపెట్టిన జగన్ రెడ్డి

• వరల్డ్ బ్యాంక్ సాల్ట్ ఒప్పందానికి కట్టుబడి డీఎస్సీలు వాయిదాలు వేసి, చదువుల్ని చట్టుబండలు చేసిన వైసీపీ ప్రభుత్వం
• జగన్ రెడ్డి అప్పుల పిచ్చితో 4.5 లక్షల విద్యార్ధులు వెళ్లిపోయారు
• రాష్ట్రవ్యాప్తంగా 4709 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి.
• 23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ఎన్నికల స్టంట్ కాదా జగన్ రెడ్డి?
• మొత్తంగా ప్రపంచ బ్యాంక్ నిబంధనకు తలొగ్గి 15,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గండికొట్టారు
• IB విద్యావిధానం..బైజూస్ కంటెంట్ అని గొప్పులు చెప్పుకునే జగన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయో, దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులనుంచి ఎందుకు వెళ్లిపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి
• దేశంలోనే గొప్ప విద్యావిధానం అంటే.. ఇదేనా జగన్ రెడ్డి!
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

రాష్ట్రంలో విద్యావిధానం గొప్పగా ఉందంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అసెంబ్లీలో చెప్పిన మాటలకు, క్షేత్రస్థాయిలో జగన్ రెడ్డి, వైసీపీప్రభుత్వ నిర్వాకాలకు ఎక్కడా పొంతనలేదని, 3 ఏళ్లుగా లక్షలాది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ బై చెప్పినా ప్రభుత్వంలో చలనంలేదని, ప్రాథమికోన్నత విద్యను హేతుబద్ధీకరణ పేరుతో విలీనంచేస్తూ ఉన్న ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేశారు తప్ప, కొత్తగా నియామకాలు చేపట్టలేదని, 5 ఏళ్ల తర్వాత విధిలేకనే ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ ఆంధ్రరాష్ట్రంలో విద్యావిధానం జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం చెప్పినంత గొప్పగా ఏమీలేదు. జగన్ పాలనలో 4.50 లక్షల పైచిలుకు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వెళ్లిపోయారనే వాస్తవం విద్యాశాఖలోని అధికారులకు తెలుసా ? విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయినా ఈ వాస్తవాలు బయట పెట్టారా? నూతన విద్యావిధానం పేరుతో వైసీపీప్రభుత్వం చేసిన దిక్కుమాలిన ప్రయోగాలతో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు గడచిన మూడేళ్లలో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిపోయారనేది వాస్తవం. జగన్ రెడ్డి గొప్పులు చెప్పుకుంటున్న ఘనమైన విద్యావిధానానికి విరుద్ధంగా ఏపీ విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టి పోయింది.

జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రెండేళ్లలోనే 5 లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ బై చెప్పారు
ఏపీ పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారమే 2021-22 నాటికి దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు. 2023 జూలై నాటికి ఆ సంఖ్య 37.80లక్షలకే పరిమితం అయ్యింది. జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో 4.50 లక్షలనుంచి 5లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ బై చెప్పారు. పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని టీడీపీప్రభుత్వం ఎక్కడికక్కడ నివాస సముదాయాలకు సమీపంలోనే ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తే, జగన్ రెడ్డి వరల్డ్ బ్యాంక్ అప్పునిబంధనల కోసం పెత్తందారీ పోకడలకు పోయి ప్రతి 3 కిలోమీటర్లకు ఒక పాఠశాల మాత్రమే ఉండాలంటూ వేలాది బడులకు తాళాలేయించారు.

ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో చేరిన ఒకటో తరగతి విద్యార్థుల సంఖ్య 4.65లక్షల మంది అయితే, ప్రైవేట్ పాఠశాలల్లో కొత్తగా చేరిన వారి సంఖ్య కూడా దాదాపు 4 లక్షలకు చేరింది. ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య గతేడాది 29 లక్షలుగా ఉంటే, ఈ విద్యాసంవత్సరం నాటికి ఆ సంఖ్య 34 లక్షలకు పెరిగింది. దాదాపు 5లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరారు. నాడు-నేడు కింద పాఠశాలల్ని తీర్చిదిద్దామని, విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న జగన్ రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరగడంపై ఏం సమాధానం చెబుతాడు?

23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల వరకు ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదు?
అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల వరకు జగన్ రెడ్డి ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు? టీడీపీప్రభుత్వం దిగిపోయే ముందు కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 23వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న జగన్, తాను ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క టీచర్ పోస్ట్ కూడా డీఎస్సీద్వారా ఎందుకు భర్తీ చేయలేదు? 27వేల మంది ఉపాధ్యాయులు తగ్గిపోయారని వైసీపీ ప్రభుత్వం నియమించిన బాలకృష్ణన్ కమిటీనే చెప్పిన నేపథ్యంలో తాజాగా 6,100 పోస్టులతో డీఎస్సీ ఇచ్చి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎందుకు దారుణంగా కోత పెట్టిందో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
2021లో ప్రపంచబ్యాంక్ తో జగన్ రెడ్డి సర్కార్ చేసుకున్నఒప్పందం వల్లే అటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు, ఇటు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గండిపడింది.

అసలేమిటీ ప్రపంచ బ్యాంక్ రుణం?
SALT (supporting Andhras Learning Transformation) ఒప్పందంలో భాగంగా ప్రపంచ బ్యాంక్ నుంచి 2021లో అయిదేళ్ల కాలానికి గానూ విద్యారంగ అభివృద్ధికి 250 మిలియన్ US డాలర్ల ప్రపంచ బ్యాంకు లోన్ (రూ.2,200 కోట్లు) తీసుకున్నారు
మొత్తం ప్రాజెక్టు వ్యయం – 1020 మిలియన్ డాలర్లు. – (8,500 కోట్లు) – దానిలో ప్రపంచ బ్యాంకు వాటా 2,200 కోట్లు.

కాకపోతే దీనిలో ఒక మెలిక ఉంది. మానవ వనరుల మీద ఖర్చును తగ్గించుకోవాలనే నిబంధనను ప్రపంచ బ్యాంక్ పెట్టింది. దానిప్రకారం విద్యాశాఖలో మానవవనరుల పాత్రను బాగా తగ్గించాలని, ప్రపంచ బ్యాంక్ షరతుకు లోబడి జగన్ సర్కార్ నిస్సిగ్గుగా అప్పు తీసుకుంది. అందువల్లనే తనహాయాంలో ఇప్పటివరకు టీచర్ పోస్టుల భర్తీకోసం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. పైపెచ్చు హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలల్ని విలీనం చేసి, కొత్త పోస్టులు సృష్టించకుండా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్నే సర్దుబాటు చేసింది.

విద్యారంగాన్ని గొప్పగా ఉద్ధరించినట్టు ఏకంగా గవర్నర్ తోనే అసెంబ్లీలో అబద్దాలు చెప్పిం చింది. మానవ వనరుల తగ్గింపు అంటే ప్రధానంగా ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడమే. జగన్ రెడ్డి అప్పుల పిచ్చితో తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు.

ఒక ఊరికి గతంలో రెండు, మూడు ఉండే ప్రాథమిక పాఠశాలల్ని తీసేసి, 3, 4, 5 తరగతుల్ని కూడా ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులు లేకపోవడంతో 1, 2 తరగతుల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి విముఖత చూపారు. గతేడాది 10లోపు విద్యార్థులు ఉన్న బడుల్లో ఈ ఏడాది ఒక్కరు కూడా చేరలేదు. విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వం వందలకొద్దీ పాఠశాలల్ని మూతేసింది. 2021 నుంచి ఇదే తంతు కొనసాగడంతో ఈ విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ఆ సంఖ్య మరింత పెరిగింది.

పాఠశాలల్ని విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఎదురు తిరిగారు
ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యేలే ఎదురు తిరిగారు. 70 మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు మంత్రి బొత్సకు లేఖరాస్తే, ఆయన కిందమీదా పడి కేవలం ఒక 10 పాఠశాలల్ని మాత్రమే విలీనం కాకుండా కాపాడగలిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలే తప్పుపట్టినా జగన్ సర్కార్ అప్పులకోసం తాను అనుకున్న విధంగానే ముందుకు వెళ్లింది. విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులకు చెందిన విద్యార్థుల్ని హైస్కూళ్లకు తరలించారు. దాంతో 4,234 ప్రాథమిక పాఠశాలలు విలీనం చేయబడ్డాయి.

3, 4, 5 తరగతులు లేకపోవడంతో 1, 2 తరగతులకు ఒక్క ఉపాధ్యాయుడే దిక్కయ్యాడు. దాంతో రాష్ట్రంలో 9వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంతో కాస్త ఆర్థికంగా భారమైనా ప్రైవేట్ పాఠశాలల్లోఅయితే 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసే అవకాశముందని తల్లిదండ్రులు తమపిల్లల్ని ప్రభుత్వ బడులు మాన్పించారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవోనెం-117తో విద్యార్థులు లేక రాష్ట్రంలో 500 వరకు ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి.

టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 18వేల మంది ఉపాధ్యాయుల్ని నియమిస్తే, జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో ఒక్కరినీ నియమిచంలేదు
టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో (2014-19 మధ్యన) 18వేల మంది ఉపాధ్యాయుల్ని కొత్తగా నియమిస్తే, జగన్ రెడ్డి తన హాయాంలో ఇప్పటివరకు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు, రిటైరైన వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో సహజంగానే పాఠశాలలు మూతపడతాయి. ఆ ఆలోచనతోనే జగన్ రెడ్డి సర్కార్ నాలుగున్నరేళ్లవరకు ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా, విలీనం పేరుతో పాఠశాలల్ని మూసేసింది.

జగన్ రెడ్డి పాలనలో 4,709 పాఠశాలలు మూతపడ్డాయి
2019-20 విద్యాసంవత్సరం నాటికి రాష్ట్రంలో మొత్తం 63,463 పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు 61వేలు అయితే, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 4,287, స్థానిక సంస్థలు (జడ్పీ, మండల పరిషత్, మున్సిపల్‌) ఆధ్వర్యంలో నడిచేవి 40,708, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు 2,234, ప్రైవేట్‌ పాఠశాలలు 16,173 ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి వాటిలో 58, 754 పాఠశాలలు మాత్రమే మిగిలాయి. మొత్తంగా నాలుగేళ్ల జగన్ రెడ్డి పాలనలో 4,709 పాఠశాలలు కనుమరుగయ్యాయి.

5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వెళ్లిపోయినా సిగ్గులేకుండా జగన్ సర్కార్ గవర్నర్ తో అసెంబ్లీసాక్షిగా విద్యారంగాన్ని ఉద్ధరించినట్టు అబద్ధాలు చెప్పించింది
2019-20లో 2,234 ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య కూడా 787కు పడిపోయింది. 2019-20 విద్యా సంవత్సరంలో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 1,96,750 మంది విద్యార్థులు చదవగా, ప్రస్తుత విద్యాసంవత్సరం ఆ సంఖ్య 95 వేలకు పడిపోయింది. దాదాపు లక్షమంది ప్రైవేట్ పాఠశాలలకు తరలి పోయారు.

అందుకే ఏకంగా ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 29 లక్షల నుండి 34 లక్షలకు చేరింది. విద్యారంగంలో జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం బ్రహ్మండంగా చేస్తే 4.50 లక్షల నుంచి 5లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వెళ్లిపోయారు? ఇంతజరిగినా ఏ ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా ముఖ్యమంత్రి విద్యారంగంలో తాను ఉద్ధరించినట్టు గవర్నర్ తో అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించారు?

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే IB (International Baccalaureate) విద్యావిధానం తీసుకొచ్చామని, బైజూస్ కంటెంట్ అందిస్తున్నామని ప్రచారంతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డి 5లక్షల మంది విద్యార్థులు ఎందుకు ప్రభుత్వ బడుల నుంచి వెల్లిపోయారో సమాధానం చెప్పాలి? నాడు-నేడు మొదటిదశలో 15000 స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలల కంటే గొప్పగా తీర్చిదిద్దామని చెప్పుకున్నారు. రూ.50,000 కోట్లు ఖర్చు పెట్టేసి, ప్రభుత్వ బడులను సమూలంగా మార్చేశామని ప్రగల్భాలు పలికారు. ఇంత గొప్పగా మార్పులు జరిగితే విద్యార్థులు ఎందుకు లేరు?

మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్
6100 పోస్టులకి విడుదల చేసిన తాజా డీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులు ఏమింటే… ఎస్జీటీలు – 2280, స్కూలు అసిస్టెంట్స్ -2299, టీజీటీలు – 1264, పీజీటీలు – 215, ప్రిన్సిపాల్ పోస్టులు – 42. అంటే ఈ పోస్టుల ఖాళీలన్నీ ఇంతకు ముందు నుంచీ ఉన్నవే. కానీ ఇప్పటివరకు భర్తీ చేయలేదు. కావాలనే జగన్ సర్కార్ పోస్టుల భర్తీని వాయిదా వేస్తూ వచ్చింది అనడానికి ఇదే నిదర్శనం. ప్రపంచ బ్యాంక్ నిబంధనకు విరుద్ధంగా పోస్టులు భర్తీచేసేందుకు కూడా ప్రభుత్వం సాహసించలేకపోయింది.

పోస్టుల భర్తీ సంగతి పక్కన పెడితే, హేతుబద్దీకరణ పేరుతో టీచర్లను తగ్గించే ప్రయత్నం చేశారు. పాఠశాలల్ని విలీనం చేస్తున్నా మంటూ, మూసేశారు. ఇప్పుడేమో… ఎన్నికలు సమీపించాయి కాబట్టి మొక్కుబడిగా 6,100 పోస్టులకు డీఎస్సీ విడుదలచేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగు లపై జగన్ రెడ్డికి ఎంత ప్రేమ.. ఎంత ఔదార్యమో కదా! IB విద్యావిధానంలోని గుట్టుమట్లు, బైజూస్ కంటెంట్ వెనకున్న కథాకమామీషు ఏమిటో త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాం ” అని విజయ్ కుమార్ చెప్పారు.

Leave a Reply