చేనేతలు నా ఆత్మ బంధువులు…

-మీ బాధ్యత నాదే!
-అన్నివిధాలా అండగా ఉంటా… ఆశీర్వదించండి

-మంగళగిరి ప్రముఖులతో నారా లోకేష్ వరుస భేటీలు

మంగళగిరి: మంగళగిరి చేనేతలు నా ఆత్మబంధువులు… మీ సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది, కుటుంబసభ్యుడిలా అన్నివిధాలా అండగా నిలుస్తా, రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని యువనేత నారా లోకేష్ కోరారు. మంగళగిరి పట్టణానికి చెందిన పలువురు చేనేత కార్మికులను యువనేత లోకేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు మంగళగిరి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించారు. తొలుత మంగళగిరి 18వ వార్డులో నివసిస్తున్న జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లారు. శ్రీనివాసరావు కుటుంబసభ్యులు యువనేతకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు చేనేతలకు అందించిన రాయితీలన్నింటినీ జగన్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చాక చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని కోరారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… గత టిడిపి హయాంలో ఇచ్చిన యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ పథకాలను వైసిపి ప్రభుత్వం ఎత్తేసింది. ఇస్తామన్న నేతన్న నేస్తం కూడా కేవలం సొంత మగ్గాలు ఉన్న వారికే అని కండిషన్ పెట్టింది. దీంతో 90 శాతం మందికి సాయం అందడం లేదు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు చేనేత రుణమాఫీ కింద 110 కోట్ల రూపాయలు చెల్లించాం. ఆదరణ పథకం ద్వారా ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి 30 వేల రూపాయల విలువైన చేనేత పనిముట్లు అందించాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ ఎత్తేశారని చెప్పారు. మంగళగిరిలో చేనేతలను ఆదుకునేందుకు వీవర్స్ శాలను ఏర్పాటుచేసి చేనేతలకు అధునాతన డిజైన్లు, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ భారం లేకుండా చేస్తాం. గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలు పునరుద్దరించడంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేతల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. అనంతరం 18వవార్డుకే చెందిన చేనేత ప్రముఖులు నీలి నాగమల్లేశ్వరరావు, కుర్నెల్ల శ్రీను, కొల్లి కోటయ్య నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Leave a Reply