Suryaa.co.in

Andhra Pradesh

హోదా రావాలంటే జగన్‌ పోవాలి

-రాష్ట్రాన్ని మోసగించిన జగన్‌ అవసరమా?
-పోలవరం, అమరావతి కావాలంటే దిగిపోవాలి
-పామర్రులో పేదల భూములు నొక్కిన వ్యక్తికి ఓటేస్తారా?
-సీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి

రాష్ట్రాన్ని మోసగించిన జగన్‌ అవసరమా? అని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం కట్టాల న్నా, రాజధాని కావాలన్నా ఆయన దిగిపోవాలి…కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోరారు. ఐదేళ్లు అధికారమిస్తే ఇవేమీ చేయని ఆయన ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మోసగించిన జగన్‌ను దించివేయాలని పిలుపునిచ్చారు.

పామర్రు ప్రబుద్ధుడిని మళ్లీ ఓటేస్తారా?
పామర్రు ఎమ్మెల్యే కృష్ణా నది ఇసుక మొత్తం దోచేశాడట. ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టిస్తాడట. ప్రభుత్వ భూములు మింగేస్తారట. పేదల భూములు ఎకరాకు రూ.15 లక్షలకు కొన్నాడట. సర్కారుకు రూ.40 లక్షలకు అమ్మాడట. ఈ ప్రబుద్ధుడు మహిళా అధికారులను ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడుతాడట. ఇంత చేస్తున్నా చర్యలు ఉన్నాయా? మళ్లీ ఆయనకే సీట్‌ ఇచ్చాడట..మిగిలింది దోచుకో అని చెప్పడానికి.. కనీసం 100 పడకల ఆసుపత్రి అని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. పాములలంక బ్రిడ్జి కడతామని మోసం చేశాడు. రక్షిత తాగునీటి పథకం అని చుక్క తాగునీరు ఇవ్వలేదు. అంతా దోచుకోవడం….దాచుకోవడం. రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే అభివృద్ధి ఇంకోలా ఉండేది. బీజేపీ మోసం చేసింది. బాబు, జగన్‌ ఆయన కొంగు పట్టుకుని తిరుగుతున్నారు. మోదీ రాష్ట్రానికి ఏమి ఇచ్చారని పొత్తు పెట్టుకున్నారు? బాబు బీజేపీకి పొత్తు…జగన్‌ బీజేపీకి తొత్తు అని మండిపడ్డారు. ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్ర రాజకీ యాలను ఏలుతుంది? అని ధ్వజమెత్తారు.

మళ్లీ అప్పుల్లో నెట్టడానికి సిద్ధమా?
ఆర్టీసీ చార్జీలు ఐదింతలు పెరిగాయి. కరెంట్‌ చార్జీలు ఏడు సార్లు పెరిగాయి. ఒక చేత్తో ఇవ్వడం…మరో చేత్తో తీసుకోవడం. బటన్‌ నొక్కడం పెద్దమోసం. మద్యనిషేధం అని మోసం చేశారు. ప్రభుత్వమే కల్తీ మద్యం అమ్ముతుంది. అంతా బూమ్‌ బూమ్‌, రాష్ట్రపతి మెడల్స్‌… జగన్‌ హామీలు వైన్‌ షాపుల్లో మాత్రమే కనపడుతున్నాయి. రేషన్‌ షాపుల్లో 11 సరుకులు వైఎస్సార్‌ ఇచ్చారు. జగన్‌ రెండు కూడా ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద గడులు కట్టుకున్నారు. ప్రజలకు కనిపించరు. ఎమ్మెల్యేలకే జగన్‌ దర్శనం లేదు.. ఏదో ఉద్ధరించినట్లు సిద్ధం అంటూ బయలుదేరారు.. దేనికి సిద్ధం జగన్‌ సార్‌? మళ్లీ మోసాలు చేయడానికి సిద్ధమా? రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టడానికి మళ్లీ సిద్ధమా? అంటూ ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE