Suryaa.co.in

Andhra Pradesh

యాత్ర-2 సినిమా కోసం శాసనసభను వాయిదా వేయించడం జగన్ రెడ్డికే చెల్లింది

– నీతిమాలిన, ప్రజా వ్యతిరేక చర్యలకు.. ఘటనలకు సాక్షిగా నిలిచిన ఈ సభకు స్వస్తి చెబుతున్నం దుకు చాలా సంతోషిస్తున్నాం
-సినిమా కోసం సభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ శాసనసభను బహిష్కరించి బయటకు వచ్చిన అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ప్రభుత్వం 5ఏళ్లలో తీసుకొచ్చిన ప్రజాస్వామ్యవ్యతిరేక చీకటి జీవోల ప్రతులను దహనం చేసి మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు
-ఉభయసభలకు వెళ్లేముందు సచివాలయ అగ్నిమాపక కేంద్రం వద్ద ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
-నిరసనలో భాగంగా ‘ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు, రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు’ అంటూ బ్యానర్లు ప్రదర్శించిన తెలుగుదేశం సభ్యులు
-రాష్ట్రానికి వైసీపీప్రభుత్వ రూపంలో పట్టిన శని, దరిద్రం నేటితో వదిలిపోతోందని, ఐదేళ్లుగా ఇష్టానుసారం సాగించిన ప్రజావ్యతిరేక పాలన పరిసమాప్తి కానుందన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

యాత్ర-2 సినిమా కోసం శాసనసభను వాయిదా వేయించడం జగన్ రెడ్డికే చెల్లింది : కింజరాపు అచ్చెన్నాయుడు
“ చివరి అసెంబ్లీ సమావేశాలను, బడ్జెట్ తతంగాన్ని వైసీపీప్రభుత్వం అపహాస్యం చేసింది. ఉదయం టీడీపీ చేసిన నిరసనలో ఈ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టాము. శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. కానీ 9.15 ని.ల వరకు సభలో కోరం లేకపోవడంతో సభను వాయిదా వేశారు. నేడు యాత్ర-2 సినిమా విడుదల అవుతోందని చెప్పి జగన్ రెడ్డి కోరిక మేరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి 11గంటలవరకు సభను సమావేశపరచ లేదు. అందుకే టీడీపీ శాసనసభా పక్షం ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ, సభ్యులందరం బయటకు రావడం జరిగింది.

వైసీపీప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలన్నీ రాష్ట్ర వినాశనానికే దారి తీశాయి తప్ప ప్రజలకు మేలుకు, రాష్ట్రాభివృద్ధికి పనికిరాలేదు
చట్టసభల్లో చేసే చట్టాలు, రాష్ట్రాభివృద్ధికి..ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఉండా లి. కానీ జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వైసీపీప్రభుత్వం చేసిన చట్టాలన్నీ రాష్ట్ర వినా శనానికే దారి తీశాయి. పేదల బతుకులు బాగుచేయడం గురించి, సామాన్య ప్రజల జీవన స్థితిగతుల గురించి, మహిళలు..యువత..రైతుల సంక్షేమం గురించి ఒక్క చట్టం కూడా తీసుకురాలేదు. అందుకే బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజావ్యతిరేక చీకటి జీవోల ప్రతులను దహనం చేశాం.” అని అచ్చెన్నాయుడు తెలిపారు.

శాసనసభ సాక్షిగా జగన్ సర్కార్ తీసుకొచ్చిన చీకటి జీవోల ప్రతుల్ని దహనం చేశాం : నిమ్మల రామానాయుడు
“ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజనానంతర రాష్ట్రంలోకానీ శాసనసభ జరిగిన తీరు ఒకెత్తు అయితే, 4 ఏళ్ల 10నెలల జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో జరిగింది ఒక ఎత్తు. జగన్ రెడ్డి పాలనలో శాసనసభ నిర్వహించిన రోజులన్నీ బ్లాక్ డేస్ అనే చెప్పాలి. నిండు సభ సాక్షిగా వైసీపీ సభ్యులతో, ప్రతిపక్షసభ్యులపై దాడులు చేయించింది ఈ సభలోనే. వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు బూతులతో ప్రతిపక్ష సభ్యులపై విరుచుకుపడింది ఈ సభలోనే.

ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి, ప్రతి పక్షానికి సమాన అవకాశం ఇవ్వాల్సిన తరుణంలో ప్రతిపక్షసభ్యులు నోరెత్త కుండా వారి గొంతులు నొక్కేసింది ఈ సభలోనే. మహిళల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని కించపరిచేలా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ శాసనసభను కౌరవసభగా మార్చింది. ఇలాంటి అనేక దుశ్చర్యలకు, ప్రజాస్వామ్య హనన చర్యలకు వేదికగా నిలిచిన ఈ సభలో చేసిన అనేక ప్రజా వ్యతిరేక చట్టాలకు సంబంధించిన జీవోలను తగలబెట్టాం.

టీడీపీ సభ్యులు దహనం చేసిన చీకటి జీవోల ప్రతులు ఏమిటంటే…

జీవో నెం : 2430 – (మీడియాస్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో)
జీవో నెం : 217 – (మత్స్యకారుల గొంతులు కోస్తూ తీసుకొచ్చిన జీవో)
జీవో నెం : 159 – (రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేస్తూ మూడు రాజధానుల పేరుతో తీసుకొచ్చిన జీవో)
జీవో నెం : 98 – (చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న బీమా పథకాల రద్దు జీవో)
జీవో నెం : 99 – (చంద్రబాబు రైతుల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చిన రైతు రుణమాఫీని రద్దుచేస్తూ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో)
జీవో నెం : 96 – అన్నం పెట్టే అన్నదాతలను కులం, మతాల వారీగా వర్గీకరించి, కౌలు రైతుల నోట్లో మట్టికొట్టిన వైసీపీప్రభుత్వ జీవో)
జీవో నెం : 22 – (అన్నదాతలకు గతప్రభుత్వాలు అందించిన ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతూ జగన్ రెడ్డి సర్కార్ రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవో)
జీవో నెం : 464 – రైతులకు సున్నావడ్డీ రుణాలు చంద్రబాబు రూ.3లక్షల వరకు అందిస్తే, దాన్ని రూ.లక్షకుకుదిస్తూ జగన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన జీవో)
జీవోనెం : 90 – మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి, మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుగా ప్రకటించి మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయంతో అప్పులు తీసుకురావడానికి జారీ చేసిన జీవో)
జీవో నెం : 512 – (ప్రజల భూములకు రక్షణ లేకుండా జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవో)
ఇలాంటి చీకటి జీవోలను ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం 240కు పైగా తీసుకొచ్చింది. రాష్ట్ర శాసనసభను జగన్ రెడ్డి కౌరవసభగా మార్చిన తీరుని నిరసిస్తూ వైసీపీప్రభుత్వ చీకటి జీవోలు దహనం చేయడం జరిగింది. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో కౌరవసభగా మారిన శాసనసభ తిరిగి, చంద్రబాబు పవన్ కల్యాణ్ ల నాయకత్వంలో గౌరవసభగా మారాకే తిరిగి టీడీపీసభ్యులందరం సభలో అడుగుపెడతాం ” అని రామానాయుడు స్పష్టం చేశారు.

ప్రజల బాధలు, రాష్ట్రసమస్యల కంటే ముఖ్యమంత్రి..వైసీపీ సభ్యులకు సినిమాలే ముఖ్యమయ్యాయి : డోలా బాలవీరాంజనేయస్వామి
“ తెలుగు మహిళల్ని కించపరిచి, వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని రోడ్డున పడేసిన ఈ శాసనసభ కార్యకలాపాలు నేటితో ముగిశాయి. సభలోని సభ్యులపై చరిత్రలో మొదటి సారి భౌతిక దాడులు జరిగింది ఈ సభలోనే. స్పీకర్ కు మైక్ ఇవ్వకుండా, సభానిర్వహణకు స్పీకర్ కు అధికారం లేకుండా చేసింది ఈ సభలోనే. చివరకు కోరం లేక ఆలస్యంగా సభ ప్రారంభమైంది కూడా ఇక్కడే. సభకు రాకుండా వైసీపీ సభ్యులు సినిమాలకు వెళ్లడాన్ని ఏమనాలి?

ప్రజల బాధలు…రాష్ట్రసమస్యల కంటే ఈ ముఖ్యమంత్రికి, వైసీపీ సభ్యులకు సినిమాలే ముఖ్యమయ్యాయి. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇలాంటి నీతిమాలిన, ప్రజా వ్యతిరేక చర్యలకు.. ఘటనలకు సాక్షిగా నిలిచిన ఈ సభకు స్వస్తి చెబుతున్నం దుకు చాలా సంతోషిస్తున్నాం.” అని బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

LEAVE A RESPONSE