Suryaa.co.in

Andhra Pradesh

పెన్షన్లపై ఇంకెన్నాళ్లీ నీతిమాలిన రాతలు?

-అబద్దాల పునాదులపై ఎల్లకాలం బతకలేరని జగన్ రెడ్డి గుర్తించాలి
-రూ.3వేల హామీపై మాట తప్పి ఒక్కొక్కరికి రూ.30వేలు ఎగనామం పెట్టిన జగన్ రెడ్డి
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

నిజం చెబితే తల వేయిముక్కలవుతుందనే శాపం జగన్ రెడ్డిని వేధిస్తున్నట్లుంది. నోరు తెరిస్తే అబద్దం చెప్పడం తప్ప ఒక్క రోజు కూడా నిజాలు మాట్లాడడం లేదు. అధికారంలోకి వస్తే రూ.3వేలు పెన్షన్ ఇస్తానన్న అదే నోటితో అధికారంలోకి వచ్చీ రాగానే ఏటా పెంపు అంటూ మాట మార్చి ఒక్కొక్కరికి రూ.30వేలు ఎగనామం పెట్టారు. ఇప్పుడు పెన్షన్ దారులకు లేఖలో కూడా అవే పచ్చి అబద్దాలు చెప్తున్నాడు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.200 ఉన్న పెన్షన్ 2019 నాటికి రూ.2000 చేశారు. అంటే ఐదేళ్లలో రూ.1800 పెంచారు. పెన్షన్ లబ్దిదారుల సంఖ్య 34 లక్షల నుండి 54.25 లక్షలకు పెంచారు. జగన్ రెడ్డి ఇప్పటి వరకు పెంచింది రూ.750 మాత్రమే అయినా సిగ్గులేకుండా ఉద్దరించానని చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు హయాంలో పెన్షన్ మొత్తాన్ని ఎక్కడైనా తీసుకునే అవకాశముంటే, ఇప్పుడు కేవలం 15కి.మీల పరిధిలోనే ఉండాలంటూ సిగ్గులేకుండా జీవోలిచ్చారు. ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే నంటూ లబ్దిదారులకు నోటీసులిచ్చిన దుర్మార్గ పాలన జగన్ రెడ్డిదే.

చంద్రబాబు ఐదేళ్లలో రూ.7లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉన్నప్పటికీ 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చి, పెన్షన్ మొత్తాన్ని కూడా రూ.1800 వరకు పెంచారు. రూ.12లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేసిన జగన్ రెడ్డి ఐదేళ్లలో కొత్తగా ఇచ్చిన పెన్షన్లు 10 లక్షలు మాత్రమే. చరిత్రలో తొలిసారిగా కిడ్నీ, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి బాధితులకు పెన్షన్లు మంజూరు చేసింది చంద్రబాబే. గిరిజనులకు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారికి 50 ఏళ్లకు పెన్షన్ చేసిందీ చంద్రబాబే.

చంద్రబాబు ట్రాన్స్ జెండర్లకు కూడా పెన్షన్లు మంజూరు చేస్తే.. జగన్ రెడ్డి రద్దు చేయడం వాస్తవం కాదా? అధికారంలోకి రావడానికి అబద్దాలను నమ్ముకున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అవే పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారు. జగన్ రెడ్డి చెప్పే అబద్దాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని గుర్తుంచుకోవాలి.

LEAVE A RESPONSE