జగన్ రెడ్డి నూతన విద్యా విధానం, రాష్ట్రవిద్యారంగానికి పట్టిన గ్రహణం

• దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నత విద్య లభిస్తే, వారిలో జ్ఞానం పెరిగి, తనను ప్రశ్నిస్తారన్న అక్కసు జగన్ రెడ్డిలో ఉంది
• నూతన విద్యావిధానం పేరుతో 11వేల పాఠశాలల్ని మూసేశాడు 3.50లక్షల మంది విద్యార్థులకు విద్యను దూరంచేశాడు
• యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం ఏపీలో 1 – 8 తరగతుల విద్యార్థులు ఆంగ్ల, తెలుగుఅక్షరాలు, చిన్నఆంగ్లపదాల్ని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారు
• రాష్ట్రంలో 19.6శాతం పాఠశాలల్లో గ్రంథాలయాలు, 75.9శాతం పాఠశాల్లలో కంప్యూటర్లు, 18.5శాతం పాఠశాలల్లో పీఈటీ లు లేరని, 40శాతం పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందలేదని సదరు నివేదిక చెప్పింది
• అన్నవస్తాడు..చదువుకునేవారందరికీ అమ్మఒడి ఇస్తాడన్న జగన్ భార్య భారతి మాటలు, నీటిమీద రాతలయ్యాయి
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్

తనదోపిడీకోసం రాష్ట్ర విద్యారంగాన్ని కోలుకోలేనివిధంగా జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడని, నూతన విద్యావిధానం పేరుతో అమలుచేసిన విధానాలు విద్యార్థులపాలిట మరణశాసనాలు అయ్యాయని, 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల్లో కనీస ఆంగ్లపరిజ్ఞానం కూడా లేదన్న, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ పై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“జగన్ రెడ్డి జమానా విద్యావ్యవస్థకు పట్టిన గ్రహణం. వ్యవసాయ, పారిశ్రామిక, వైద్య రంగా లు దారుణంగా దెబ్బతిన్నాయి. అవి దెబ్బతిన్నా.. తిరిగి పుంజుకోగలవు. కానీ విద్యారంగం పరిస్థితి అందుకు పూర్తిభిన్నం. విద్యావ్యవస్థను ప్రయోగశాలగా మార్చి, జగన్ రెడ్డి చేస్తున్న దిక్కుమాలిన ప్రయోగాలు భావితరాలకు ఓనమాలు రాకుండా చేస్తున్నాయి.

తెలుగు, ఆంగ్ల అక్షరాలను గుర్తించలేని స్థితిలో విద్యార్థులు ఉండటమేనా, జగన్ రెడ్డి నూతన విద్యావిధానం?
నీతిఅయోగ్ 2019లో ఇచ్చిన నివేదిక ప్రకారం, విద్యారంగంలో 3వస్థానంలో ఉన్న రాష్ట్రం నేడు జగన్ రెడ్డి తలతిక్క విధానాలతో 19వ స్థానానికి దిగజారింది. తప్పుని సరిచేసుకో వాలన్న ఆలోచన జగన్ రెడ్డికి ఏకోశానా లేదు. ఆయన ఆలోచనలన్నీ ఎప్పుడూ సంపాదన చుట్టూనే తిరుగుతుంటాయి. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. 1, 2, 3 వ తరగతి విద్యార్థుల ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. 1వ తరగతి విద్యార్థుల్లో 43.3 శాతం మంది తెలుగు అక్షరాలు చదవలేకపోతున్నారు. 2వ తరగతిలో 21శాతం, 3వ తరగతిలో 12.6శాతం మంది, 4వ తరగతిలో 6.09శాతం మంది, 5లో 3.8శాతం, 6లో 4.6శాతం, 7లో 4.6శాతం, 8వ తరగతిలో 2.7శాతం మంది విద్యార్థులు తెలుగు అక్షరాలు చదవలేని దుస్థితిలో ఉన్నారు.

పోనీ ఇంగ్లీష్ మీడియం అయినా ఇరగదీస్తున్నారా అంటే అదీలేదు. ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులు కనీసం ఆంగ్ల అక్షరాలను, చిన్నచిన్న ఆంగ్ల పదాలను కూడా గుర్తించలేక పోతున్నారు. 1వ తరగతిలో 20.1శాతం, 2లో 16శాతం, 3లో 11.4శాతం విద్యార్థులు మాత్రమే చిన్నచిన్న ఆంగ్ల అక్షరాలను, చిన్న ఆంగ్లపదాలను గుర్తించగలుగుతున్నారు. 20శాతం మంది మాత్రమే ఆంగ్లపదాలను గుర్తిస్తున్నారంటే, ఈప్రభుత్వం 80శాతం మంది విద్యార్థుల అభ్యసనాప్రక్రియను అధోగతి పాలు చేసిందనే చెప్పాలి. గతంలో చంద్రబాబుగారు జీవోనెం-14 ద్వారా మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో దేన్నైనా ఎంచుకోవచ్చని చెప్పారు. దానిపై సాక్షి మీడియా ఇంగ్లీష్ మీడియాన్ని చూసి విద్యార్థులు భయపడుతున్నారని, డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని రాశారు. మరిప్పుడు జగన్ రెడ్డి అమలుచేస్తున్న ఇంగ్లీష్ మీడియం పరిస్థితి ఎలా ఉందో నివేదికలే చెబుతున్నాయి. ఆనాడు చంద్రబాబు నచ్చిన భాషలో విద్యాభ్యాసం కొనసాగించవచ్చని చెప్పారు. జగన్ ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు. జగన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం వల్ల ఇప్పుడు విద్యార్థులు తెలుగు, ఆంగ్లపదాలే గుర్తించలేని స్థితికి వచ్చారు.

డిజిటల్ క్లాస్ రూమ్ లు, కంప్యూటర్లు, ఉపాధ్యాయులు లేకుండా బైజుస్ సంస్థ విద్యార్థులకు ఏం బోధిస్తుంది?
ఉపాధ్యాయులు లేకుండా, డీఎస్సీ నిర్వహించకుండా, 40 నుంచి 50 వేల ఉపాధ్యాయ నియామకాలకు మంగళం పాడిన జగన్ రెడ్డి, విద్యార్థులకు మెరుగైన ప్రాథమికవిద్యను ఎలా అందిస్తాడు? చాలామంది విద్యార్థులు పాఠశాలల్లో సరిగా బోధించడంలేదని ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. పేదల పిల్లలకు ఆ అవకాశం ఉండదుకాబట్టి, వారిపరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజుకి రాష్ట్రంలో 19.6శాతం పాఠశాలల్లో గ్రంథాలయాలు లేవు, 75.9శాతం పాఠశాల్లలో కంప్యూటర్లు లేవు, 18.5శాతం పాఠశాలల్లో వ్యాయామఉపాధ్యాయులు లేరు.

నేటికి 40శాతం పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందలేదు. జగనన్న కిట్ల పేరుతో ఇచ్చిన స్కూలుబ్యాగులు, టైలు, బూట్ల ముసుగులో వైసీపీనేతలు దోపిడీచేశారు. అప్పులఊబిలో కూరుకుపోయిన బైజుస్ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చిన జగన్ రెడ్డి, దాన్నికూడా తనదోపిడీకోసం వాడుకున్నాడు. రూ.250కోట్లతో విద్యార్థులకు పంపిణీ చేసిన ప్యాడ్లు పనికిరాకుండా పోయాయి. బైజుస్ సంస్థ కోసం ఈ ప్రభుత్వం ఎన్ని డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటుచేసింది? 75శాతం పాఠశాలల్లో కంప్యూటర్లే లేకుంటే, బైజుస్ విద్యార్థులకు ఏం బోధిస్తుంది?

జగన్ నూతన విద్యావిధానంతో 11వేల ప్రభుత్వపాఠశాలలకు తాళాలు, 3.50లక్షల విద్యార్థులు ఇళ్లకు…
జగన్ రెడ్డికి విద్యపైన, విద్యార్థులపైన చెప్పలేనంత కోపం? తనముందు ఆంగ్లంలో ఎవరు గొప్పగా మాట్లాడినా, ఓర్చుకోలేరు. చంద్రబాబు కిలోమీటర్ కు ఒక పాఠశాల, మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ పాఠశాల, 5 కిలోమీటర్లకు హైస్కూల్ ఉండేలా చేసి, విద్యార్థుల ముంగిటకు విద్యను తీసుకెళ్లారు. జగన్ రెడ్డి రాగానే నూతన విద్యావిధానం పేరుతో విద్యను విద్యార్థులకు దూరంచేశాడు. 11వేల ప్రభుత్వ పాఠశాలలు జగన్ నూతన విద్యావిధానంతో మూతపడ్డాయి. కొఠారి కమిషన్ ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్ని ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి, ఒకే విద్యావిధానం అమలుచేయాలని చెబితే, జగన్ దాన్ని తనకు అప్పులు పుట్టేలా కొత్తగా మార్చుకున్నాడు.
పిల్లల్ని పాఠశాలలకు దూరంచేసి, ఊరిబయట ఉండే ఒకేఒక పాఠశాలకు పరిమితం చేశాడు. పాఠశాలల విలీనం పేరుతో జగన్ రెడ్డి, బడుగు బలహీనవర్గాలు, దళితుల పిల్లలకు విద్యను దూరంచేశాడు. జగన్ నిర్వాకంతో 3.50లక్షల డ్రాపౌట్స్ పెరిగాయి. జగన్ రెడ్డి నూతన విద్యావిధానం విద్యార్థులకు శాపంగా మారిందనే చెప్పాలి.

అమ్మఒడి పేరుతో ఇస్తున్న దానికంటే నాన్న బుడ్డితో కొట్టేస్తున్నదే ఎక్కువ
అన్న వస్తాడు..ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తాడని, మీ బిడ్డలకు మేనమామ అవుతాడని జగన్ భార్య భారతి డబ్బాలు కొట్టింది. అన్న వచ్చాక ఇస్తున్న అమ్మఒడి కంటే నాన్నబుడ్డి రూపంలో కొట్టేస్తున్నదే ఎక్కువైంది. 80లక్షల మంది విద్యార్థులుంటే, అమ్మఒడిని కేవలం 40లక్షలమందికే పరిమితం చేశాడు. అమ్మఒడి కింద ఏటా రూ.15వేలు ఇస్తాననిచెప్పిన జగన్, దాన్ని రూ.14వేలకు కుదించాడు… తరువాత మెయింటినెన్స్ పేరుతో రూ.13వేలకే పరిమితం చేశాడు. దళితులకు నాణ్యమైన, ఉన్నత విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను రద్దుచేశాడు, విదేశీవిద్య, అంబేద్కర్ స్టడీసర్కిళ్లను మూసేశాడు.

దళితవిద్యార్థులు, యువకులు జ్ఞానవంతులైతే, తనను ప్రశ్నిస్తా రన్న అక్కసుతోనే జగన్ వారిని ఉన్నతవిద్యకు దూరంచేశాడు. గత ఏడాది పదో తరగతి ఫలితాలు 64.02శాతానికి పరిమితమవడమేనా జగన్ రెడ్డి అమలుచేసిన నూతన విద్యా విధానం? పదోతరగతి ఫలితాలు ఆస్థాయిలో పడిపోవడానికి జగన్ రెడ్డి ఉపాధ్యాయు లపై సాధిస్తున్న కక్షసాధింపులే నిదర్శనం. ప్రపంచబ్యాంకు నిబంధనలకు తలొగ్గి, 50వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలను పక్కనపెట్టాడు.

విద్యావ్యవస్థ నాశనమైతే దాన్ని బాగు చేయడం ఎవరితరం కాదనే వాస్తవాన్ని జగన్ రెడ్డి గుర్తించాలి. జగన్ పాలనలో కే.జీ నుంచి పీ.జీ వరకు చదివే విద్యార్థుల పరిస్థితి, జిల్లాపరిషత్, గవర్నమెంట్, ఎయిడెడ్ టీచర్ల పరిస్థితి హృదయవిదారకంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రికాగానే దళిత, గిరిజన విద్యార్థు లకు గతంలో అమలుచేసిన అన్ని పథకాలు పునరుద్ధరిస్తాం” అని జవహర్ చెప్పారు.

Leave a Reply