Suryaa.co.in

Andhra Pradesh

అది నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెబుతా

– ఆరోగ్య రంగంలో 52 వేల మందిని నియమించామని జగన్ చెప్పడం పచ్చి అబద్ధం
– ఓటు వేయని ప్రజల్ని జగన్ నిందించడం ఇప్పటికైనా మానుకోవాలి
– అధికారం లేదన్న నిరాశ, ఆక్రోశం జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది
– ఎక్స్‌లో జగన్‌ విధ్వంస వైఖరిపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ట్వీట్‌

అమరావతి: అధికారం లేదన్న నిరాశ జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. అధికారంలో లేని ఈ 5 నెలల్లో దాదాపు డజను సార్లు మీడియాతో మాట్లాడిన జగన్‌, ప్రతిసారీ ప్రజలను తిడుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో అద్భుతాలు చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారని ప్రశ్నించారు. ఓడిపోయిన వ్యక్తి ప్రజలిచ్చిన ప్రజాస్వామ్య తీర్పును నిందించడమేంటని ప్రశ్నించారు.

తన హయాంలో సంపద సృష్టించానని జగన్‌ చెబుతున్నారని, కాకపోతే ప్రజల సొమ్ముతో ఆయన సొంత సంపద పెంచుకున్నారన్నారు. విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేసిన విధానమే జగన్ సంపద సృష్టికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా జగన్‌ పచ్చి అబద్ధాలు చెప్పారంటూ మంత్రి మండిపడ్డారు.

ఐదేళ్లలో 52 వేల మందిని రిక్రూట్‌ చేశామని చెబుతున్న జగన్‌, ఆ వివరాలను బహిరంగపరచాలని సవాల్‌ విసిరారు. ఆరోగ్య రంగంలో 52 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది నిజమేనని నిరూపించగలిగితే తాను బహిరంగంగా క్షమాపణలు చెబుతానన్నారు. ‘జీరో వేకెన్సీ విధానం’పైనా జగన్‌ కల్లబొల్లి కబుర్లు చెప్పారన్న మంత్రి, రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2 వేల మంది అధ్యాపకుల కొరత ఉందని స్పష్టం చేశారు.

సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత 4 శాతం మాత్రమేనంటూ జగన్ మరో పచ్చి అబద్ధం చెప్పారని, ఇది జగన్‌ హయాం నుంచి చెక్కుచెదరకుండా 59 శాతంగా ఉందన్నారు. ఆరోగ్య రంగంపై తాను సమీక్ష చేస్తే ఈ విషయాలు బయట పడ్డాయని సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.

ఇలా అబద్ధాలు చెప్పడం, ప్రజలను నిందించడం మానుకోవాలని జగన్ కు సత్యకుమార్‌ యాదవ్‌ హితవు పలికారు. తన అసహనాన్ని, నిరాశను, భ్రమలను ప్రజలపై రుద్దకుండా, వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ మేరకు సత్యకుమార్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు.

LEAVE A RESPONSE