Suryaa.co.in

Editorial

బీజేపీకి ఒక ఎంపీ సీటు?

  • రాజ్యసభలో బలం పెంచుకునే వ్యూహం

  • టీడీపీకి 2, బీజేపీకి ఒకటి

  • బీజేపీ అభ్యర్ధిగా ఆర్.కృష్ణయ్య?

  • పరిశీలనలో కిరణ్‌కుమార్‌రెడ్డి?

  • కృష్ణయ్య వైపే మొగ్గు?

  • కిరణ్‌కు సీటిస్తే కృష్ణయ్యకు జాతీయ బీసీ కమిషన్ పదవి?

  • బీద మస్తాన్ సభ్యత్వం కొనసాగింపు

  • నాగబాబుకు ఎంపీ సీటు లేనట్టేనా?

  • ప్రధానితో భేటీ అందుకేనా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి మూడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ఎవరికి ఎన్ని స్థానాలనే అంశంపై కూటమిలో స్పష్టత వచ్చింది. వైసీపీ ఎంపీలు ఆర్.కృష్ణయ్య, మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు రాజీనామాలతో ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే వీరిలో బీద మస్తాన్‌రావు టీడీపీ ఎంపీగా మళ్లీ బరిలోకి దిగనున్నారు.

కాగా ఈ ఎన్నికల్లో ఒక సీటు పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకునే క్రమంలో భాగంగా, ఏపీ నుంచి జరిగే ఉప ఎన్నికల్లో ఒక సీటు తమకు కావాలని కేంద్రహోంమంత్రి అమిత్‌షా సీఎం చంద్రబాబును అభ్యర్ధించగా, ఆ మేరకు బాబు అంగీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దానితో బీజేపీ అభ్యర్ధి ఎవరు అవుతారన్న చర్చకు తెరలేచింది. రాజీనామా చేసిన బీసీ జాతీయ నేత ఆర్.కృష్ణయ్య బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రాజీనామా చేసే సందర్భంలో మళ్లీ ఆ సీటు తనకే ఇవ్వాలన్న షరతు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ వర్గాల్లో ఇమేజ్ ఉన్న కృష్ణయ్యతో తమకు రాజకీయంగా లాభమన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

అయితే మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు కూడా తెరపైకొస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన కిరణ్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా.. రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్షించడంతోపాటు, రాయలసీమలో పార్టీని పటిష్ఠం చేయవచ్చన్న వ్యూహం కూడా లేకపోలేదు. ఒకవేళ కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తే.. ఆర్ .కృష్ణయ్యకు జాతీయ బీసీ కమిషన్ పదవి ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

ఇదిలాఉండగా.. మూడు స్థానాల్లో ఒకటి, డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నాగబాబుకు ఇవ్వవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఒక సీటు బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో, ఉన్న ఒకేఒక సీటును జనసేనకు ఇవ్వడం అసాధ్యమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒక సీటు బీద మస్తాన్‌రావుకు ఖరారయిన నేపథ్యంలో, మరొక స్థానాన్ని పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారికి కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే రాజ్యసభ సీటుపై పార్టీలో విపరీతమైన ఒత్తిడి ఉంది.

కాగా తాజా పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో, ఆయన ప్రధాని మోదీని కలిసినప్పుడు.. ఒక సీటు తమకు ఇవ్వాలని ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్‌ను కోరినప్పుడు, ఆయన కూడా అందుకు సానుకూలంగా స్పందించారన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో జరుగుతోంది.

టీ డీపీకి గవర్నర్ పదవి?

ఇదిలాఉండగా.. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించినట్లు, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇద్దరికి గవర్నర్ పదవులు వచ్చిన సందర్భాలు లేకపోలేదు. తర్వాత మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులుకు గవర్నర్ పదవి వస్తుందన్న ప్రచారం జరిగినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. దానితో పాపం మోత్కుపల్లి మీడియా గవర్నర్‌గా మిగిలిపోవలసి వచ్చింది.

ఇప్పుడు మళ్లీ టీడీపీకి గవర్నర్ పదదవి ఇచ్చేందుకు, బీజేపీ సుముఖంగా ఉందన్న చర్చకు తెరలేచింది. ఆ ప్రకారం టీడీపీకి గవర్నర్ అవకాశం వస్తే అశోక్‌గజపతి రాజుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం పార్టీలో ఉన్నవారిలో యనమల రామకృష్ణుడు, కెఇ కృష్ణమూర్తి, దాడి వీరభద్రరావు సీనియర్లు. వీరిలో కెఇ కృష్ణమూర్తి ఆరోగ్యం అంతా బాగాలేకపోవడంతో, ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించటంలేదు. ఇక ఎమ్మెల్సీ యనమలకు వరసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఆయన కుమార్తె, వియ్యంకుడికి ఎమ్మెల్యే, అల్లుడికి ఎంపీ సీటు ఇవ్వడం తెలిసిందే. ప్రస్తుతం ఆ ముగ్గురూ అసెంబ్లీ, లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనుభవం-హుందాతనం-వయసుపరంగా చూస్తే యనమలతోపాటు మరో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా, గవర్నర్ పదవికి అర్హులేనని పార్టీ నాయకులు చెబుతున్నాయి. అయితే దాడి వీరభద్రరావు ఎన్నికల ముందు టీడీపీలో చేరినప్పటికీ, రాజకీయాల్లో ఇంకా చురుకుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఒకవేళ టీడీపీకి గవర్నర్ అవకాశం వసే, ్త అశోక్‌గజపతిరాజుకే ఎక్కువ అవకాశాలున్నట్లు సీనియర్లు చెబుతున్నారు.

LEAVE A RESPONSE