Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన నచ్చకనే పార్టీలో తిరుగుబాటు

-ఇప్పటికే బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశమైన 40 మంది ఎమ్మెల్యేలు
-పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు రెడీ అంటోన్న వైకాపా నేతలు, ప్రజా ప్రతినిధులు
-వైకాపాలో ఎమ్మెల్యే టికెట్ దక్కని వారు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం
-ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మా పార్టీ 30 స్థానాల్లో మాత్రమే గెలిచే ఛాన్స్
-క్వార్జ్ మైనింగ్ లో కోటాను కోట్లు దోచుకుంటున్న కొంతమంది వ్యక్తులు
-గతంలో నేరుగా పోలీసుల చేత దాడులు చేయించేవారు… ఇప్పుడు హిజ్రాలతో దాడి చేయించే ప్రయత్నం చేయడం విడ్డూరం
-యువ గళం ముగింపు సభ… ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతకు నాంది సభ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన నచ్చకనే వైకాపా లో తిరుగుబాటు మొదలయ్యిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తనకు తానే గొప్ప వ్యక్తిగా, మహానుభావుడిగా ఊహించుకుంటూ… పార్టీ ఎమ్మెల్యేలు పనికిరన్నట్టుగా వారిగా తీసేస్తున్నాం, వీరిని మార్చేస్తున్నామని అంటే ఎవరు మాత్రం సహిస్తారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించక ముందే, మూడు, నాలుగు సార్లు శాసన సభ్యులుగా ఎన్నికైన వారు, మంత్రులుగా పని చేసిన వారు ఉన్నారన్నారు. ముందు వచ్చిన చెవులను వెనక వచ్చిన కొమ్ములు వెక్కిరించినట్లుగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… బెంగళూరులో మా పార్టీకి చెందిన 40 మంది ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసిందన్నారు. పార్టీలోని ప్రజాప్రతినిధులు, నాయకులంతా తిరుగుబాటు సిద్ధమవుతున్నారని చెప్పారు. వైకాపా లో భూకంపం మొదలయ్యిందని, గతంలో వాడితో మాట్లాడేది ఏందీ… వీడ్ని చూసేది ఏందీ ?!.. అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరిని బ్రతిమాలే పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి నెట్టి వేయబడ్డారన్నారు. పార్టీలో నెలకొన్న భూకంప ప్రకంపనలు ప్యాలెస్ ను కూడా తాకాయి.

ఆవేశంతో పార్టీ పెట్టిన బాలుడు
కుటుంబ వారసత్వాన్ని చాటుకోవాలని ఆరాటపడిన జగన్మోహన్ రెడ్డికి కొన్నాళ్లు ఓపిక పట్టమని, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సూచించినప్పటికీ… ఆవేశంతో బాలుడు పార్టీ ఏర్పాటు చేశారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు . ఒకసారి ఓడిపోయి, రెండవసారి ఒక్క అవకాశం ఇవ్వమంటే ప్రజలు ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారే అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి వెంట కలిసి నడిచారు. దీనితో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా వైకాపా వైపు షిఫ్ట్ అయ్యింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి వైకాపాలో చేరిన వారు, రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే తిరిగి మళ్ళీ అదే పార్టీలో చేరనున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం పై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా దృష్టి సారించింది. 2024లో అవకాశాలు లేకపోయినప్పటికీ , 2029లో అవకాశం లభిస్తుందని ఆశాభావంతో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. 2029 నాటికి వైకాపా ఉంటుందో, ఉండదోననే అనుమానం చాలామందిలో ఉంది .. కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేయడం వల్ల, రానున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను దారుణంగా ఓడించనున్నారు.

వైకాపా అభ్యర్థులు ఎలాగో ఓడిపోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వైకాపా ఓటు బ్యాంకు ను గట్టిగానే చీల్చనున్నారు . ప్రస్తుతం ఒక శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, నాలుగు నుంచి ఐదు శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. నరసాపురం నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు మంత్రులలో ఒక మంత్రి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిసింది. మరొక మంత్రి ని ఇంటి వద్దనే ఉండమన్నారని, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని చెప్పారట. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలంటే పార్టీ అధికారంలోకి రావాలి కదా అంటూ రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. నరసాపురం లోక్ సభ స్థానానికి ఎవరూ దొరకక, ఒక ఎమ్మెల్యేను పోటీ పెడతారని తెలుస్తోంది.

రాజమండ్రి ఎంపీ ని ఎమ్మెల్యేగా పోటీ చేయించనున్నట్లు, మంత్రి చెల్లుబోయిన వేణును రాజమండ్రి రూరల్ నుంచి, సిటీ నుంచి చీఫ్ విప్ ను పోటీ చేయించనున్నారని తెలిసిందన్నారు. రానున్న ఎన్నికల్లో… ఇలా ఎన్నో మార్పులు ఉంటాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మార్పుల ద్వారానే ప్రజలకైన గాయాలను ముఖ్యమంత్రి మాన్పించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రజల మనసులను గాయపరిచింది ముఖ్యమంత్రి అయితే, ముఖ్యమంత్రి చేసిన గాయాలతో ఎమ్మెల్యేలకు ఏమిటి సంబంధం అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

రానున్న మూడు నెలల పాటైనా ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుందా?, లేకపోతే ఈ లోగానే ప్రజాప్రతినిధులే తిరగబడితే… జరగరానిది జరిగే అవకాశాలు లేకపోలేదు. గతంలో కనీసం మనుషులను కూడా ప్యాలెస్ లోపలికి అనుమతించేవారు కాదు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాహనాలతో సహా ప్రజా ప్రతినిధులను ప్యాలెస్ లోపలికి అనుమతిస్తున్నట్లుగా తెలిసింది.

గతంలో ముఖ్యమంత్రి పిఏ, పిఎస్ లతో మాట్లాడి వెనుదిరిగే ప్రజాప్రతినిధులతో… ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నారని, ఇది ఎమ్మెల్యేల తిరుగుబాటు మహిమేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు గా పరిస్థితి తయారయ్యింది. వైకాపా ను వీడే వారిలో కొద్దిమంది మంచివారు ఉంటే… వారిని పార్టీలోకి తీసుకునేందుకు టిడిపి నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా పత్రికల్లో వార్తా కథనాలు వెలువడ్డాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు .

నెల్లూరులో ఒక్క స్థానం కూడా గెలిచే ఛాన్స్ లేదు… మా పార్టీకి 30 స్థానాలు వస్తే గొప్ప
రానున్న ఎన్నికల్లో వైకాపా నెల్లూరు జిల్లాలో ఒక్క స్థానం కూడా గెలిచే ఛాన్స్ లేదని, ఇక రాష్ట్రవ్యాప్తంగా 30 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన మద్య నిషేధం హామీ, ఉద్యోగులకు , ఎస్సీ వర్గాలకు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్ల… రానున్న మూడు నెలల్లో పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడితో ఆగితే 30 స్థానాలలో వైకాపా గెలిచే ఛాన్స్ ఉంది. లేకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చు.

రాయలసీమ ప్రాంతంలోనూ వైకాపా గ్రాఫ్ పడిపోయింది. నియోజకవర్గాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఎమ్మెల్యేలను రానున్న ఎన్నికల్లో అభ్యర్థులుగా మారుస్తామని ప్రకటించడమే దానికి కారణమై ఉండొచ్చు. ఇంకా మా పార్టీ పరిస్థితి మరింత దిగజారితే, సింగిల్ డిజిట్ కే పరిమితమైన ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. ప్రస్తుతం అతిశయోక్తిగా అనిపిస్తున్న ఇది అక్షరాలా నిజమని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. వైకాపాలో టికెట్ దక్కని వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, మా పార్టీ నాయకత్వానికి చుక్కలు కనిపించనున్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు .

హవ్వ… ఇదెక్కడి విడ్డూరం?
మైనింగ్ యజమానిని ఆశీర్వదించడానికి హిజ్రాలను పిలిపించుకోవడం సర్వసాధారణమే కానీ, మైన్ ను ఆశీర్వదిస్తారని చెప్పి వందలాది మంది హిజ్రాలను పొదలకూరు రుస్తుం మైనింగ్ వద్దకు తరలించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రుస్తుం మైన్ వద్ద మూడు రోజులపాటుగా తెదేపా సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపడుతుండగా, ఆయన పై దాడి కి హిజ్రాలను పంపారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే తెదేపా కార్యకర్తలు, నాయకులు ఆయనకు వెన్ను దన్నుగా నిలిచారు. రుస్తుం మైనింగ్ లో తవ్విన 12 ట్రక్కులను తరలించడానికి ఈ డ్రామా ఆడినట్టు స్పష్టమవుతుంది. గతంలో నేరుగా పోలీసులతోనే ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించేవారు. ఇప్పుడు హిజ్రాలతో దాడి చేయించే కొత్త సంస్కృతికి తెర లేపారు. రుస్తుం మైనింగ్ వద్ద నిరసన చేపడుతున్న చంద్రమోహన్ రెడ్డిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

లైసెన్సులు ఎవరి పేరిట ఉన్నా హక్కులు మాత్రం వారికే…!
నెల్లూరు జిల్లాలో క్వార్జ్ మైనింగ్లో కొంతమంది వ్యక్తులు కోటాను కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. శాండ్, క్వార్జ్, మైకా మైనింగ్ లైసెన్సులు ఎవరి పేరిట ఉన్నప్పటికీ, జిల్లాలోని మండలాలను, గ్రామాలను అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలకు పంచడం జరిగింది … దీనితో మైనింగ్ లైసెన్సులన్నీ వారికే అనధికారికంగా కేటాయించినట్లయింది. ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తి నుండి ఆదేశాలు వెలువడడం వల్ల, జిల్లాలోని ఉన్నతాధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూసే సాహసాన్ని చేయలేదు.

గనుల అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపితే, అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు కాకపోయినా రేపు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమార్కుల పని పట్టడానికి సులువు అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. యువ గళం ముగింపు సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది.

ఈ సభ ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతకు నాంది సభ గా మారనుందని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించి, ఈ మూడు నెలలపాటైన ముఖ్యమంత్రి సుపరి పాలన అందిస్తే బాగుంటుందని రఘురామకృష్ణంరాజు సూచించారు.

LEAVE A RESPONSE