పెన్షన్‌పై వైసీపీకి టెన్షన్ ఎందుకు?

– వాలంటీర్లతో వద్దని సీఈసీ ఆదేశం
– గతంలో వైసీపీ ఫిర్యాదుపై ఈసీ స్పందించలేదా?
– సీఎస్, డీజీపీ, ఏజీడీలను తొలగించలేదా?
– ఇప్పుడూ నిబంధనల ప్రకారమే చర్యలు
– పించన్లు ఎవరిస్తే ఏమిటి?
– గత ప్రభుత్వాలు వాలంటీర్లతో ఇవ్వలేదు కదా?
– ఇప్పుడు ఇవ్వమన్నది కూడా ఉద్యోగులతోనే కదా?
– ఉద్యోగులను వైసీపీ నమ్మడం లేదా?
– వాలంటీర్లే పించన్లు ఇవ్వాలా?
– వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదన్న హైకోర్టు
– ఎందుకీ అనవసర రాద్ధాంతం?

( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పించన్లు ఇకపై వాలంటీర్ల ద్వారా కాకుండా, ఉద్యోగులే పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలపై అధికార వైసీపీ గుండెలవిసేలా చేస్తున్న యాగీ.. గావుకేకలు, హాహాకారాలు రోత పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకూ వాలంటీర్లే పించనర్లకు డబ్బులు నేరుగా ఇచ్చేవారు. బాగుంది. ఇంతకుముందంటే ఎన్నికల కోడ్ లేదు కాబట్టి, సర్కారు నిర్ణయం చెల్లుబాటయింది. కానీ ఇప్పుడు కోడ్ వచ్చింది. అన్నీ నిబంధనల ప్రకారమే నడవాలి. అలా చూసే బాధ్యత ఎన్నికల సంఘానిది. అది ఉన్నదే అందుకు. దానికోసం ఢిల్లీ నుంచి ముగ్గురు పరిశీలకులను కూడా పంపింది.

వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కనుక.. వారు కేవలం సేవకులేనని హైకోర్టు కూడా తేల్చింది కనుక.. వాలంటీర్లంతా మన పార్టీ వాళ్లనే పెట్టామని గతంలో వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సెలవిచ్చారు కనుక.. వైసీపీ అభ్యర్ధుల వెంట వాలంటీర్లు ప్రచారంలో పాల్గొన్నందుకు డజన్ల మందిని తొలగించారు కనుక…పాపం వైసీపీ అభ్యర్ధుల కోసం మండుటెండలో తిరిగి శ్రమదానం చేస్తున్నందున.. అంత శ్రమ వారికి వద్దని, ఎన్నికల సంఘమే వారి నుంచి పించన్లు ఇచ్చే యవ్వారాన్ని తొలగించింది. సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకోమని చెప్పింది. వాలంటీర్ల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పించన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో తప్పెక్కడ కనిపిస్తుంది?

ఇది ఒకరకంగా పాపం వైసీపీ జెండా భుజం పుళ్లు పడేలా మోస్తున్న వాలంటీర్లను సుఖపెట్టడమే. ఎలాగూ ప్రతినెల వాలంటీర్లే పించనుదారుల వద్దకు వెళ్లి డబ్బులిస్తున్నారు. ఇప్పుడు బాగా ఎండాకాలం కాబట్టి, వారిని కాస్త నీడపట్టున ఉంచే పెద్ద మనసుతో, ఈసీనే వారికి ఎన్నికల వరకూ విశ్రాంతినిచ్చింది. దీనికి సంతోషించాలి గానీ ఈ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకో అర్ధం కాదు. సో. వచ్చే నెల ఒకటిన ఆ పనిచేయాల్సిన బాధ్యత సీఎస్ జవహర్‌రెడ్డిదే.

ఎలాగూ పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బు ఖజానాలో ఎవరెడీగా ఉన్నందున, పించన్లకు నిధుల సమస్య లేదనుకుంటా. ఒకవేళ పించనర్లకు ఒకటిన డబ్బులివ్వకపోతే, విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఆ డబ్బులు వైసీపీ అస్మదీయ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులకు కర్పూరహారతి చేసినట్లు అర్ధం చేసుకోవాలి. ఆ తర్వాత కథ వేరే ఉంటుంది. అది వేరే ముచ్చట.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు వల్లే వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయని.. అధికార పార్టీ గొంతులు రెండురోజుల నుంచి ఏకబిగిన ఏడుపు-పెడబొబ్బలు అందుకుని, విషాదరాగం ఆలపించడం వింత. ఎందుకంటే.. సీఈసీ పెన్షనర్లకు డబ్బులు ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇవ్వాలని ఆదేశించిందే తప్ప, అసలు పెన్షన్లు ఇవ్వవద్దని ఆదేశించలేదు. ఎన్నికల కోడ్ కాబట్టి వాలంటీర్ల బదులు, ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్ డబ్బులు అందచేయాలని చెప్పిందే తప్ప, సంక్షేమపథకాలు ఆపమని చెప్పలేదు. అంతమాత్రానికే అసలు పించన్లు ఆపేసినట్లు అధికార పార్టీ హంగామా చేయడమే రోత.

మరి ఇప్పుడు వైసీపీ గళధారుల ఏడుపు పెడబొబ్బలు.. ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పెన్షన్లు ఇస్తున్నందుకా? లేక వాలంటీర్ల ద్వారా ఇవ్వనందుకా? అన్నది స్పష్టం కాలే దు. ఎవరిస్తే ఏమిటి? డబ్బు లబ్థిదారులకు అందుతుందా? లేదా అన్నదే కదా లెక్క. ఆ లెక్కన ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పించన్లు ఇవ్వడం వైకాపేయులకు ఇష్టం లేదని.. అదే మన వాలంటీర్లయితే అవ్వాతాతలకు ఈ డబ్బులిస్తుంది జగనన్నయ్య కాబట్టి, ఫ్యాను గుర్తుకే ఓటు గుద్దమని ఉపదేశించే అవకాశం ఉంటుందన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. అసలు బాధ అదేనేమో?!

ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారు. అక్కడి నుంచి మొన్నటి చంద్రబాబునాయుడు వరకూ, మధ్యలో వచ్చిన ముఖ్యమంత్రులంతా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిన వారే. అయితే వారంతా ప్రభుత్వ సిబ్బంది ద్వారానో, పోస్టాఫీసుల ద్వారానో ఆ డబ్బును అందించారే తప్ప వాలంటీర్ల చేతికి ఎప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ మాత్రం వాలంటీర్ల చేతికి డబ్బులిస్తేనే పించన్లు అందుతాయని… భూమి ఆకాశం అదిరేలా చేస్తున్న ఆక్రందనలు, వెగటు పుట్టిస్తున్నాయన్నది బుద్ధిజీవుల ఉవాచ.

ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీపై విపక్షాలు ఫిర్యాదు చేయడం సర్వసహజం. గత ఎన్నికల ముందు ఇప్పటి అధికార పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు చేసిందీ అదే. దాని ఫలితంగానే నాటి డీజీపీ, సీఎస్, ఏడీజీని ఈసీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. ఎల్వీని ఈసీనే నేరుగా సీఎస్‌గా నియమించింది. ఇప్పుడూ అదే పద్ధతి-నిబంధనల ప్రకారమే వెళుతోంది.
దానికే ఈ రంకెలు, రాద్ధాంతాలూ ఎందుకన్నది ప్రశ్న. ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో పనిలో చేరినట్లు లేరు. ఆ ముగ్గురికీ పనిమంతులన్న పేరే ఉందట. కాబట్టి వారు రాగానే చేసే మొదటి పని, ఇప్పటిదాకా తమకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడం. ఇప్పటి ఎన్నికల అధికారి మాదిరిగా కాకుండా.. ఆ ముగ్గురిలో ఇద్దరు చకచకా చర్యల కొరడా ఝళిపించే ఘటనాఘట సమర్ధులేనట.

మరి ఆ ప్రకారం.. సీఎం జగన్‌కు ఆర్టీసీ కేటాయించిన ప్రత్యేక బస్సులు, భద్రత కోసం ప్రజాధనంతో తీసుకున్న రెండు హెలికాప్టర్లు.. డీజీపీ, సీఎస్, నిఘా దళపతి, ఎస్పీ, అడిషనల్ ఎస్పీలపై ఫిర్యాదు గట్రాలను.. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఇద్దరు అధికారులు దుమ్ముదులుపుతారన్నది సీనియర్ ఐఏఎస్‌ల ఉవాచ.

ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు, ఒక జిల్లా కలెక్టర్ కారు వాడుకుంటేనే ఆమెపై చర్యలు తీసుకున్నారు. కోడ్ అమలులో ఉండగా, అధికారంలో ఉన్నవారు సర్కారు వాహనాలు వాడకూడదు. ఒకవేళ వాడితే దానికి నిబంధనల ప్రకారం రుసుము చెల్లించాలి. పైగా ఇప్పుడు సీం జగన్ కోసం కేటాయించిన రెండు హెలికాప్టర్లను వాడుకునేది, అచ్చంగా వైసీపీ ఎన్నికల ప్రచారానికి.

విడిరోజుల్లో మాదిరిగా ప్రభుత్వ కార్యక్రమం కోసం వాడుతున్నామని చెప్పి, పార్టీ పనులు చేసుకోవడానికి కోడ్ అడ్డంకి. మరి జగన్ ఆ హెలికాప్టర్లను వాడేది కేవలం ఎన్నికల ప్రచారం కోసమే కాబట్టి, ప్రభుత్వ ధనంతో వాటిని అద్దెకు తీసుకోకూడదు. ఇటీల ప్రధాని మోదీ వాయుసేన హెలికాప్టర్ వాడితేనే విపక్షాలు ఫిర్యాదు చేశాయి. అలాంటిది జగన్‌ను ఎందుకు విడిచిపెడతాయి? ఇప్పుడు చంద్రబాబునాయుడు, పవన్ ఏవిధంగా అయితే ప్రైవేటు హెలికాప్టర్లు వాడుతున్నారో, జగన్ కూడా దానినే అనుసరించకతప్పదు. ఆ ఇద్దరు అధికారులు ఇలాంటి పనులపైనే ఉంటారన్నది అధికారుల మాట.

మొత్తంగా వాలంటీర్లు ఎండదెబ్బ తినకుండా, మజ్జిగ-చల్లటికుండలో నీళ్లు తాగి ఇంటిపట్టునే ఉండేలా ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటు, వారికి ఆనందంగానే ఉన్నట్లుంది. అందుకే ఎవరూ బయటకొచ్చి ఆందోళన చేయలేదు. భూమ్మీద వాలంటీర్ల సేవలు లేకపోతే తెరవు లేదన్న భయంతోనే అధికార పార్టీ ఆగమాగం చేస్తుందన్నది ప్రజల భావన. కందకు లేని దురద కత్తికెందుకు?

Leave a Reply