సాక్షి రాసే ముష్టి రాతలను విశ్వసించొద్దు

జగన్మోహన్ రెడ్డి మాయలో ప్రజలు పడొద్దు
జగన్మోహన్ రెడ్డేమో దేశ సేవకుడైనట్టు… ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్, సిటిజన్స్ ఫోరం లు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నట్లుగా బిల్డప్
ఇటువంటి నాన్సెన్స్ కబుర్లను ప్రజలు నమ్మొద్దు
వాలంటీర్లు ఇళ్లల్లోకి వెళ్లి పింఛన్లు ఇవ్వకపోతే ఏమిటి?
పెద్దగా పని లేకుండానే ప్రతీ గ్రామంలో సచివాలయ సిబ్బంది ఉండనే ఉన్నారు
ప్రత్యామ్నాయంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలను ఉపయోగించుకొని ఇంటింటికి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయాలి
జగన్మోహన్ రెడ్డి దృష్టిలో 1000 కోట్లు ఉన్నవారు కూడా బీదలే
అటువంటి పేదల తరుపునే జగన్మోహన్ రెడ్డి పెత్తందారులపై పోరాడుతున్నారు
ప్రజలకు కూటమినేతలు అన్యాయం చేయరనే భావిస్తున్నాను… ప్రజాస్వామ్యంలో ప్రజల దీవెనలు చాలా అవసరం… వారి దీవెనలు నాకు ఉన్నాయి
కూటమిలోని పార్టీలు న్యాయం చేస్తాయని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అబద్దాలను నమ్మొద్దని, ఆయన మాయలో ప్రజలు పడొద్దని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కోరారు. జగన్మోహన్ రెడ్డి తనకు తానే దేశ సేవకుడైనట్లుగా, స్వామి వివేకానంద అన్నట్టు గా తొక్కలో బిల్డప్పులు ఇస్తూ, ఎన్నికల విధుల్లో వాలంటీర్లను దూరంగా ఉంచాలని పోరాడిన ఫోర్ అండ్ ఫర్ గుడ్ గవర్నెన్స్, సిటిజన్ ఫోరం ప్రతినిధులను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నట్టు గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సిటిజన్స్ ఫోరం ద్వారా విశ్రాంత న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సమాజంలో జరుగుతున్న ఘోరాలపై పోరాటం చేస్తున్నారన్నారు. వారికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఒక దుర్మార్గుడిపై చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్నారు. అలాగే సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో విశ్రాంత న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ దుర్మార్గ ప్రభుత్వంపై పోరాడుతున్నారని, నా దారిలో నేను కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వం, పాలకుడిపై పోరాటం చేస్తున్నానని చెప్పారు.

ఈ ప్రభుత్వంపై పోరాడుతున్న వారంతా చంద్రబాబు నాయుడు మనుషులేనా? అంటూ నిలదీశారు. సాక్షి దినపత్రికకు ఎంతసేపు చూసినా ఇతరులపై ఏడవడం తప్ప మరొకటి తెలియదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ ఆదేశాల వల్ల ఒకటవ తేదీన అవ్వ, తాతలకు పింఛన్లు ఇవ్వలేకపోతున్నామని, ఆలస్యం జరుగుతోందని, అకస్మాత్తుగా ఈ జీవో వచ్చిందని సాక్షి దినపత్రికలో జగన్మోహన్ రెడ్డి ఆవేదన చెందుతున్నట్లుగా కట్టు కథలను రాశారన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్ద, అవ్వ తాతలకు పింఛన్లు ఇవ్వడానికి అసలు సొమ్ములే లేవని, ఎన్నికల కమిషన్ ఆదేశాలను సాకు గా చూపెడుతూ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాలంటీర్లు లేకపోతే ఏమయిందని, ప్రతి గ్రామంలో పెద్దగా పని లేకుండా సచివాలయ సిబ్బంది ఉండనే ఉన్నారన్నారు. ప్రత్యామ్నాయంగా వారి సేవలను ఉపయోగించుకుని వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేయాలని సూచించారు.

తక్షణమే గ్రామాలలో గ్రామ సచివాలయ సిబ్బందిని, పట్టణాలలో వార్డు సచివాలయ సిబ్బంది సేవలను ఉపయోగించుకొని ఇంటికే వెళ్లి వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. సోది కబుర్లు చెప్పకుండా గ్రామ సచివాలయ సిబ్బందికి వృద్ధాప్య పింఛన్ల పంపిణీ బాధ్యతలను అప్పజెప్పాలని జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి హితవు పలికారు.

సాక్షి దినపత్రికలో రాస్తే ఎవరు ఖండించలేరు అనుకున్నారా?

వాలంటీర్ల గురించి సాక్షి దినపత్రికలో రాస్తే ఎవరు ఖండించలేరనుకున్నారా? అని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ గురించి ఖండించడానికి పార్టీలకు దమ్ము ధైర్యం లేకపోవచ్చు. నాకు వ్యక్తిగతంగా దమ్ము ధైర్యం ఉంది. వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే ప్రయత్నాన్ని నేను నిరంతరాయంగా చేస్తూనే ఉన్నాను. వాలంటీర్ వ్యవస్థ లేకముందు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధాప్య పింఛన్లను సక్రమంగా పంపిణీ చేయలేదా? అని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు.

రాష్ట్రంలో మహా అయితే 40 లక్షల మందికి ఈ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లను ఇస్తుందేమోనని అన్నారు . ప్రతి గ్రామానికి, పట్టణంలో వార్డుకు ఒక సచివాలయం చొప్పున ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి సచివాలయంలో పది నుంచి 11 మంది సిబ్బంది చొప్పున రాష్ట్రంలో లక్షా పాతిక వేలమంది పెద్దగా పని లేకుండానే ఉన్నారన్నారు. ఒక్కొక్క ఉద్యోగి 40 మందికి ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేయలేరా? అంటూ ప్రశ్నించారు.

ప్రత్యామ్నాయ వ్యవస్థ అందుబాటులో ఉండగా, వారి ద్వారా వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేయకుండా, ఇలా కాకి గోల చేయడం వెనక మర్మం ఏమిటని నిలదీశారు. గ్రామ సచివాలయ సిబ్బందితోపాటు, అవసరమైతే ఎన్నికైన ప్రజా ప్రతినిధుల సేవలను కూడా ఉపయోగించుకోవచ్చునని సూచించారు. వాలంటీర్లు వెళ్లి ఎలాగైతే వేలిముద్రలను తీసుకొని వృద్ధాప్య పింఛన్ అందజేసేవారో, అలాగే గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే ప్రజాప్రతినిధులు కూడా ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేస్తారన్నారు.

ఎన్నికల సభలో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయనున్న జగన్మోహన్ రెడ్డి

ఒకటవ తేదీనే ఇళ్ల వద్దకు వచ్చి అవ్వ, తాతలకు వాలంటీర్లు వృద్ధాప్య పింఛన్లు అందజేయలేదా? మీరు చెప్పండని , అవ్వా నువ్వు చెప్పు, తాత నువ్వు చెప్పు అని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రత్యామ్నాయ అవకాశం ఉండగా, ఈ దొంగ ఏడుపులు, వెధవ అరుపులు అవసరం లేదని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఎండలో వెళ్లి, లైన్లో నిలబడి వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికి ముసలమ్మలు పడే అవస్థ నేను చూసి తట్టుకోలేకపోతున్నానని జగన్మోహన్ రెడ్డి దొంగ ఏడుపులు ఏడుస్తారన్నారు.

ఎండలో నిలబడి వృద్ధాప్య పింఛన్లు తీసుకోవాల్సిన దుస్థితిని ఎవరికి రాదని చెప్పారు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఎదురైతే వృద్ధుల పక్షాన ప్రతిపక్ష పార్టీలుగా టిడిపి, జనసేన తో పాటు , ఏ పార్టీలో చేర్చుకోని వ్యక్తిగా నేను కూడా పోరాడుతానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతో నడిచే గ్రామ సచివాలయాలలో పనిచేసే సిబ్బంది ఉండనే ఉన్నారు.

వారే మీ ఇళ్లకు వచ్చి, వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని అందజేస్తారని చెప్పారు. కావాలని బలవంతంగా వృద్ధులను ఎండలో నిలబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడాలని ఈ దగుల్బాజీలను వదిలించుకోవాలన్నారు. ఒక గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీకి 11 మంది సిబ్బంది సరిపోరా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఈ విషయంపై తొలుత నేనే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. నా తరువాత ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చునని చెప్పారు.

99% హామీలను అమలు చేసింది ఎక్కడ?

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో 99% అమలు చేశానని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఎన్నికలకు ముందు మద్య నిషేధం అమలు చేస్తానని, అమలు చేయకపోతే మళ్లీ ఓట్లే అడగనని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, మద్య నిషేధం అమలు చేయకపోగా, మద్యం ఆదాయంపై అప్పులు చేశారని గుర్తు చేశారు.

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఇలాగే తుంగలో తొక్కి, ఇప్పుడేమో 99 శాతం హామీలను అమలు చేశానని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు . ఒక సినిమాలో కమెడియన్ భరత్ ను తండ్రి పాత్రధారి శివాజీ రాజా స్కూలుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించగా… పేదవారి గురించి వ్యాసం రాస్తున్నానని సమాధానం ఇస్తాడు. ఓ పేద తల్లి, తండ్రి కి పేద తోటమాలి, వంటవాడు, బెంజ్ కారు నడిపే డ్రైవర్ కూడా పేదవాడేనని, ఆకలి వేస్తే ఇంట్లో ఏమీ లేకపోవడంతో బెంజ్ కారులో అడుక్కోవడానికి బయలుదేరుతాడని చెప్పగా… ఒరేయ్ దరిద్రుడా బెంజ్ కారులో వెళ్లేవాడు. ఇంట్లో తోటమాలిని, వంట వాడిని పెట్టుకున్న వాడు పేదవాడు ఏమిట్రా అని తండ్రి పాత్రధారి శివాజీ రాజా, కొడుకైన భరత్ మందలిస్తాడన్నారు.

ఈ కథ విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఏమని తిడుతారో తెలియడం లేదన్నారు. కొడుకు పాత్రలో ఉన్న భరత్ ను అన్నట్లు ఒరేయ్ దరిద్రుడా అని జగన్మోహన్ రెడ్డిని అనమనడం లేదన్నారు. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నా బుట్టా రేణుకను ప్రజలే చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి కోరడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. గతంలో బుట్టా రేణుక తన ఎన్నికల అఫిడవిట్లో 247 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారని గుర్తు చేశారు.

247 కోట్ల రూపాయలు ఉన్న బుట్టా రేణుక, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పేదవారేనని అన్నారు. లక్ష కోట్ల రూపాయల చిల్లర ఆస్తులు కలిగిన జగన్మోహన్ రెడ్డి దృష్టిలో 1000 కోట్ల ఆస్తులు ఉన్న వారు కూడా పేదవారేనని అపహాస్యం చేశారు. అటువంటి పేదల పక్షానే జగన్మోహన్ రెడ్డి పెత్తందారులతో పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వారిని కూడా పాపం… ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నవాడనడం పరిశీలిస్తే సీట్లు ఇచ్చేటప్పుడే ఉన్న క్యాష్ అంతా లాగేసుకుంటే అంతంత మాత్రం ఉన్నవాడు కాకపోతే ఏమవుతారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

నాలుగేళ్లుగా ఈ పనికిమాలిన ప్రభుత్వంపై పోరాటం చేశాను

గత నాలుగేళ్లుగా ఈ పనికిమాలిన ప్రభుత్వం పై ప్రజల పక్షాన పోరాటం చేశానని, ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలనపై తొలుత గొంతు విప్పిన వ్యక్తిని తానేనని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. అటువంటి నాకు కూటమి అన్యాయం చేస్తుందని అనుకోవడం లేదన్నారు. లక్షలాది మంది ప్రజలు తమ సానుభూతిని వ్యక్తం చేస్తూ నాకు సందేశాలను పంపిస్తున్నారని చెప్పారు.

కూటమి నేతలు చర్చించుకుంటున్నారని, తప్పకుండా నాకు న్యాయం చేస్తారని వస్తున్న వార్తలను అందరిలాగే నేను కూడా టీవీలలో చూశాను… పేపర్లలో చదివానన్నారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి నాయకులు కలిసి చర్చించుకుని ప్రజలకు అన్యాయం చేయరని నేను భావిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల దీవెనలు చాలా ముఖ్యమైనవి, ఆ ప్రజల దీవెనలు నాకు ఉన్నాయి.

ఒకటి రెండు రోజుల్లో నాకు న్యాయం జరుగుతుందని టీవీల్లో వచ్చిన కథనాలను చూశాను. కూటమి నేతలు నాకు న్యాయం చేస్తారని ఆశాభావంతోనే ఉన్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నాకు సంపూర్ణ సానుభూతి ప్రకటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలని తెలియజేస్తున్నానని అన్నారు.

Leave a Reply