అసెంబ్లీ సాక్షిగా పోలవరంపై జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం

-నిర్వాసితులకు 10లక్షల రూపాయల హామీ ఏమైంది?
-డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న ఐఐటిహెచ్ నివేదికకు ఏం సమాధానం చెబుతారు?
-ప్రాజెక్టు ఎత్తుపై కేసీఆర్ తో కుమ్మక్కయి డ్యామ్ గా మార్చిందెవరు?
-కమిషన్ల కక్కుర్తి కోసం కాంట్రాక్టర్ ను మార్చడం వల్లే పనుల జాప్యం
-మాపై ఆరోపణలు మాని నిపుణుల కమిటీకి సమాధానం చెప్పండి
-టిడిపి సీనియర్ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి

పోలవరంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పచ్చి అబద్దాలు వల్లెవేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… నిర్వాసితులకు న్యాయం చేయమని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు డొంకతిరుగుడు సమాధానం చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను అసెంబ్లీ నుండి బయటకు పంపి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రామానాయుడు, బుచ్చయ్యచౌదరి ఏమన్నారో వారి మాటల్లోనే…!

నిమ్మల రామానాయుడు, టీడీపీ శాసనసభపక్ష ఉపనాయకుడు
జగన్ రెడ్డి తన పాదయాత్రలో పోలవరం దగ్గరకు వెళ్ళినపుడు పునాదులు కూడా వేయలేదన్నారు. అయితే అప్పటికే డయా ఫ్రం వాల్ నిర్మాణం శరవేగంతో సాగుతోంది. డయా ఫ్రం వాల్ భూగర్భంలో నిర్మాణం అవుతుందనే కనీస జ్ఙానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. అసెంబ్లీలో కాపర్ డ్యాం, స్పిల్ వే గురించి జగన్ రెడ్డి మాట్లాడుతుంటే అసెంబ్లీకి రావణాసురుడు వచ్చి రామాయణం చెప్తున్నట్టుగా ఉంది.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరంపై నీలినీడలు అలముకుని ప్రాజెక్ట్ ప్రశ్నార్ధకంగా మారింది. 2004 నుంచి 2014 వరకు కేవలం 7శాతం పనులు పూర్తి అయ్యాయి. 2014-19 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో 71శాతం పోలవరం పనులు పూర్తయ్యాయి. ఒక్కరోజులోనే 32,350 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటుని వేసి రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్ లో నమోదైంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మూడున్నరేళ్లలో 4శాతం పనులని మాత్రమే పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి సంఘం ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. డయా ఫ్రం వాల్ ఎక్కడ నిర్మిస్తారో ముఖ్యమంత్రికి తెలియదు.

డయా ఫ్రం వాల్ ఏ ప్రాజెక్ట్ కు ఉంటుందో నీటిపారుదల శాఖా మంత్రికి తెలీదు. డయా ఫ్రంవాల్ ప్రతి ప్రాజెక్ట్ కు ఉంటుందని చెప్పి ప్రస్తుత నీటి పారుదలమంత్రి అంబటి అభాసుపాలయ్యారు. పోలవరం గురించి జగన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అవగాహన లేకుండా మాట్లాడారు. స్పిల్ వే ముందు నిర్మించాలని, తరువాత కాపర్ డ్యాం, డయా ఫ్రం వాల్ నిర్మించాలని నీతులు చెప్పారు. చంద్రబాబు నాయుడు 2020 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనే లక్ష్యంతో కాపర్ డ్యాం, డయా ఫ్రం వాల్, స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏకకాలంలో సమాంతరంగా పనిచేస్తేనే దాన్ని పూర్తి చేయడానికి వీలవుతుంది.

అందువల్లే ఒకేసారి పనులు ప్రారంభించి వేగంగా చేపట్టడం జరిగింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అర్ధాంతరంగా పనులని నిలిపివేశారు. వరదలతో ముంచెత్తే పోలవరాన్ని ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేయకుండానే 2019లో పనులు నిలిపివేయడం ప్రాజెక్ట్ నాశనం అవడానికి కారణమని ఐఐటి హైదరాబాద్ పీపీఏకు నివేదికను పంపింది. పోలవరం ప్రాజెక్ట్ డయా ఫ్రం వాల్ దెబ్బ తినడానికి ప్రకృతి కారణం కాదు, మానవ వైఫల్యం ఆ నివేదికలో ఐఐటి వెళ్లడించింది. 2019 మే నెలకు కాపర్ డ్యాం 80శాతం పని పూర్తియింది. ఆ కాపర్ డ్యాం పనులు చేసిన ఏజెన్సీ కొనసాగుంటే నెల రోజుల్లో ఆ కాపర్ డ్యాం 2019 జూన్ నాటికి పూర్తియ్యి ఉండేది. గోదావరికి 2020లో వరదలొచ్చాయి.

2019 మే నెల నుంచి 2020 జూలై నెల వరకు దాదాపు 14 నెలలు కాపర్ డ్యాం పనులు జగన్ రెడ్డి నిలిపివేయడం వల్ల డయా ఫ్రం వాల్ దెబ్బతినిందని ఐఐటి ఇచ్చిన నివేదకకు జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? మిగిలిన 20శాతం పనులు పూర్తి చేయలేని జగన్ కు పాలించే హక్కు లేదు. జులై 29, 2019న నవయుగ, ఎల్ అండ్ టి, బెకం కంపెనీని టెర్మినేట్ చేస్తూ అప్పటి చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబుకి నోటిస్ ఇవ్వడం జరిగింది. 50లక్షల క్యూసెక్లు నీటిని డైవర్ట్ చేసే నిర్మాణం స్పిల్ వే. జగన్ రెడ్డి అధికారంలోకి రాకముందు 2017-2018 లో స్పిల్ ద్వారా నీటిని మరలించి ప్రాజెక్ట్ ని కాపాడుకున్నాం. 2018లో 15లక్షల క్యూసెక్ ల నీరు వచ్చిన కూడ డయాఫ్రం వాల్, ప్రాజెక్ట్ గాని ఎటువంటి ఇబ్బంది జరుగకుండా స్పిల్ వే ద్వారా దారి మళ్లించాం.

రివర్స్ టెండరింగ్ కాదు రిజర్వ్ టెండరింగ్
పోలవరానికి నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ కు పాల్పడ్డారు. కాంట్రాక్టర్ ను మారిస్తే ప్రాజెక్టు భద్రత ఎవరు కల్పిస్తారని పీపీఏ మిమ్మల్ని ప్రశ్నించినా మీరు పట్టించుకోలేదు. పీపీఏ సీఈవో ఆర్.కే. జైన్ ఆగస్టు 16, 2019న ఏజెన్సీని మార్చడం కరెక్టు కాదు. మారిస్తే ప్రాజెక్టు ప్రమాదంలో పడుతుంది కనీసం కొన్ని నెలల పాటైనా ఏజెన్సీని మార్చవద్దని హెచ్చరించినా మీరు పెడచెవిన పెట్టారు.

మీ నిర్లక్ష్యంవల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఐఐటిహెచ్ నివేదిక
మీ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగానే 2020 వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఐఐటీ హైదరాబాద్ స్పష్టం చేసింది. 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని పీపీఏ నియమించిన ఐఐటీ హైదరాబాద్ నివేదకలో స్పష్టం చేసింది. 2020 జూన్, 2022 డిసెంబర్ కు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రగల్బాలు పలికారు. 2020 వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతింటే 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఎలా చెబుతారు? అంటే అసెంబ్లీని తప్పు దోవపట్టించావని నిరూపణ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. డయాఫ్రం వాల్ ఉందా లేదా మీకు తెలియదా? స్పష్టం చేయాలి.

నిర్వాసితులను నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి
నిర్వాసితులు పడుతున్న అగచాట్లు తాడేపల్లి ప్యాలెస్ కూర్చుంటే మాట్లాడితే తెలియదు. పోలవరం బాధితులకు 2016లో ఎకరాకు రూ. 19 లక్షలు ఇస్తామన్నారు, తరువాత రూ. 10 లక్షలన్నారు, ఇప్పుడు రూ. 3లక్షలని మాట మారుస్తూ మడమ తిప్పారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 లక్షలు ఇవ్వమని నేడు అసెంబ్లీలో ప్రశ్న వేస్తే అసలు 10 లక్షలు ఇస్తానని హామీ ఎక్కడ లేదని జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు బొంకుతున్నారు. ఆయన చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి లేచి రూ.10 లక్షలు హామీనిచ్చానని జీవోను అసెంబ్లీలో చూపించారు. జూన్ 30, 2021న జీవోను చూపించారు నేడు సెప్టెంబర్ 19, 2022 అంటే ఇప్పటికి 16 నెలలు అయినా ఆ జీవో ప్రకారం ఏ ఒక్క నిర్వాసితుడికి సాయం అందలేదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఉత్తుత్తి జీవో విడుదల చేశారు గాని అందులో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. సాక్షాత్తు అసెంబ్లీలో రూ.10 లక్షల మీద హామీనివ్వలేదని ఇరిగేషన్ మంత్రి చెప్పారంటే ముఖ్యమంత్రి మీద మంత్రికి నమ్మకం లేదని తేలిపోయింది. ముఖ్యమంత్రిని మంత్రే నమ్మకపోతే ఇక ప్రజలేం నమ్ముతారు.

భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం
పోలవరం కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు. నిర్వాసితులకు వరదలు వస్తే నిలువ నీడ లేక కొండల్లో, గుట్టల్లో తలదాల్చుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. చంద్రబాబు నాయుడు పర్యటన వస్తున్నారని హాడావుడిగా కొంత మందికి సాయం అందించారు.
వరద సాయం కింద మీరు రూ. 2,000 ఇస్తుంటే పక్క రాష్ట్రం తెలంగాణ రూ.10,000 సాయం అందించింది. 7 ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసినా మనకు వ్యతిరేకత రాలేదు. మొట్ట మొదటి సారిగా నిర్వాసితులకు చేసిన దగా, మోసం వలన మేము ఇక్కడ ఉండం మమ్మల్ని తెలంగాణలో కలపమని ధర్నా, ధీక్షలు చేస్తుంటే మీకు పాలించే అర్హత ఉందా?

అంచనాలు పెంపులో అలసత్వం
ప్రాజెక్టు అంచనాలో డీపీఆర్ -2లో భాగంగా రూ.55,548 కోట్లు టీడీపీ హయాంలో కేంద్రం ఇవ్వడానికి అంగీకరించిందని జూన్ 06, 2019న విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. అనుమతి వచ్చినా కూడా నిధులు తెచ్చుకోలేకపోతున్నారంటే మీ అసమర్ధత కాదా? 31 మంది ఎంపీలుంటే మీ అస్తులు, మీ బెయిల్ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టే హక్కు మీకెక్కడిది?

పోలవరాన్ని బ్యారేజీగా మార్చే కుట్ర
పోలవరం 45.75 నుంచి 41.15కి ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నిస్తే మీకెక్కడ చెప్పారని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ పోలవరం రెండు , మూడు మీటర్లు తగ్గిస్తే తప్పేముందు అందుకు జగన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని అంటే దానిని మీరెందుకు ఖండించలేదు. మీ కేసుల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టి బహుళార్ధక సాధక ప్రాజెక్టును బ్యారేజీగా మార్చే కుట్ర జరుగుతుంది. 45.75 మీటర్ల దగ్గర నీరు 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అదే 41.15 మీటర్ల దగ్గర అయితే కేవలం 110 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. 194 టీఎంసీలుంటేనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి జలాలు వెళతాయి.
రాయలసీమకు శ్రీశైలం నుంచి వెళతాయి అదే విధంగా కృష్ణ, గోదావరి డెల్టాల స్థిరీకరణ అవుతుంది. నేడు ఎత్తును తగ్గిస్తే ప్రాజెక్టు బ్యారేజీ మారుతుంది. అసెంబ్లీని నేడు ప్రశ్నకు సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి తోకముడిచారు. ప్రాజెక్టులకు మరమ్మత్తులు పట్టించుకోకపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 60 మంది చనిపోయారు. అదే విధంగా పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి రైతులకు ఉపయోగపడాల్సిన వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. లాకులకు గ్రీజు పెట్టలేని వారు పోలవరం ఎలా పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

టిడిపి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలని కేంద్రం స్పష్టం
పోలవరం అవినీతి మీద పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు. పోలవరంలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు, పనులన్నీ కేంద్రం ఆధీనంలో జరగాయని కేంద్రం స్పష్టం చేసింది. అసత్యాలతో ప్రచారాలు చేస్తుంటే ప్రజలు గుడ్డిగా నమ్మరని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి.

చట్టసభలను అపహస్యాం చేస్తున్నారు: బుచ్చయ్యచౌదరి
చట్ట సభలో జరుగుతున్న విషయాల్ని ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి, స్పీకర్ కలిసి చట్ట సభలని చట్టు బండలుగా మర్చారు. అబద్ధాల కోరు ముఖ్యమంత్రి శాసన సభని సినిమా హాల్ గా మర్చారు. సినిమా వాళ్ళు సినిమా తీసి ఎడిట్ చేసినట్టు లేనిదాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు అపద్దాలు సృష్టించి ప్రచారం చేయడంలో అగ్రగన్యుడు జగన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. తెలుగుదేశం పార్టీ హయాలో త్వరిత గతిన 72 శాతం పనులు పూర్తి చేయడం జరిగింది. వైయస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో కాల్వలు తవ్వి బిల్లులు చేసుకున్నారు తప్పా సివిల్ కన్సట్రక్షన్ చేయలేదు. ప్రాజెక్ట్ లకి భూమి ఇవ్వలేదు. ఆనాడు కాంట్రాక్టర్లు అలానే వదిలేశారు.

నమ్మించి నట్టేట ముంచారు!
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో భూసేకరణ చేసి 14లక్షల చొప్పున నష్ట పరిహారాలు ఇచ్చి అక్కడ పనులు ప్రారంభించి ఐదేళ్ళలో 72శాతం పనులు పూర్తి చేయడం జరిగింది. వైయస్.రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపు 6వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకెజ్ కింద ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి పక్షంలో జగన్ రెడ్డి ఉన్నప్పుడు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చే లక్షా 50వేలు సరిపోవని తాను అధికారంలోకి వస్తే ఎకరానికి 5లక్షలు అదనంగా ఇస్తానని చెప్పి ప్రజలని నమ్మించి నేటికి ఒక్క రూపాయి చెల్లించకుండా మోసం చేశారు. 19లక్షల రూపాయలు ఒక్కో ఎకరానికి ఇస్తానని చెప్పారు.
రిహాబిటేషన్లో, ఆ తరువాత 10లక్షలు అన్నారు. నేడు జీవో ఇచ్చాను అంటూ తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అనే రీతిలో జీవో ఇంప్లిమెంటేషన్ లో లేదు. జగన్ రెడ్డి పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలని దగా చేశారు. ఎటియం అంటూ గతంలో తప్పుడు ప్రచారం చేశారు జగన్ రెడ్డి, నేడు కేంద్రాన్ని 55వేల కోట్లు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడానికి 2013 వచ్చిన కొత్త చట్టం ప్రకారం టీడీపీ ప్రయత్నిస్తూ కేంద్రాన్ని ఒప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తే జగన్ రెడ్డి ఎటియం అంటూ ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు. 55వేలకోట్లు ఎందుకు అడుగుతున్నారు? జగన్ రెడ్డి కేంద్రం చెబున్నట్లు రూ.29వేల కోట్లతో సరిపెట్టుకోవచ్చు కదా?

వ్యక్తిగత ఎజెండాతోనే ఎత్తు కుదింపు
కేసిఆర్ తో జగన్ రెడ్డి లాలూచీపడి తన భూములని కాపాడుకోవడం కోసం వాళ్లు చెప్పినదానికి మమేకమై తలూపుతున్నారు. ప్రాజెక్ట్ ని 45.72 మీటర్ల నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 322టియంసీల నీటి సామర్ధ్యమున్న ప్రాజెక్ట్ ని కేవలం 91 టియంసీలకు తగ్గిస్తున్నారు. 41.5 మీటర్లు చేస్తే 20,946 కుటుంబాల్ని తరలించాలి. 11,556 కుటుంబాల్ని మాత్రమే తరలించారు. 8,670 కుటుంబాల్ని తరలించలేదు. ఒక్క రూపాయి నష్ట పరిహారాన్ని చెల్లించలేదు. 45.72 ఇక లక్షా 6వేల 6 మంది కుటుంబాల్ని తరలించాలి. ప్రభుత్వానికి ప్రాజెక్ట్ మీద చిత్తశుద్ధి లేదు.

కాంట్రాక్టర్లను ఎందుకు మార్చారు?
ప్రభుత్వం మారటంతోనే పాత కాంట్రాక్ట్ ఏజెన్సీలని రద్దు చేశారు. జగన్ రెడ్డి బంధు వర్గానికి కాంట్రాక్టులని కట్టబెట్టారు. కృష్ణ పట్నం పోర్టుని వారికే కట్టబెట్టారు. మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఆయన కంపెనీకి ఉన్న అర్హతలేమిటి? ఎల్ అండ్ టీ, బావర్ కంపెనీలని తప్పించారు. జగన్ రెడ్డి తెలివి తక్కువ పని వల్ల రెండు సంవత్సరాలు అయిన పవర్ ప్లాంట్ పూర్తి కాలేదు. చట్టసభలో జరుగుతున్న విషయాల్ని ప్రజలు గమనించాలని విజ్ఙప్తి చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్ కలిసి చట్ట సభలని చట్టుబండలుగా మార్చారు. వైయస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో కాల్వలు తవ్వి బిల్లులు చేసుకున్నారు తప్పా సివిల్ పనులు కన్ స్ట్రక్షన్ చేయలేదు.భూసేకరణ చేయలేదని బుచ్చయ్యచౌదరి స్పష్టంచేశారు.

Leave a Reply