Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి ధన దాహం బకాసురుని ఆకలి వంటిది

-అరువు కోసం రాష్ట్ర పరువు తీస్తున్న జగన్మోహన్ రెడ్డి
-ముఖ్యమంత్రి కాసుల కక్కుర్తి పై తీవ్ర ఆగ్రహంగా ఉన్న రాష్ట్ర రైతాంగం
-రాష్ట్ర రాజధాని అమరావతినేనని తేల్చిన కేంద్రం… ఇన్ డైరెక్ట్ గా జై కొట్టిన బిజెపి
-ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రైతుల కష్టాలు చూసి చలించి, 73 ఏళ్ల వయసులోను తుఫాను ప్రభావిత ప్రాంతాలలో రెండు రోజులు పర్యటించాలని డిసైడ్ అయిన చంద్రబాబు నాయుడు
-తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని అక్కడి ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేయగా, రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్యాలెస్ లకే పరిమితం చేస్తారు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనం దాహం బకాసురుని ఆకలి వంటిదని ప్రజలు భావించే పరిస్థితి నెలపొందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు విరుచుకుపడ్డారు. అరువు కోసం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ… అరువు దొరికితే చాలు కరువు తీరిందన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉందన్నారు.

రోడ్ల మరమ్మతులు చేయడానికి గతంలో పెట్రో ఉత్పత్తులపై ఒక్క రూపాయి సెస్సు విధించారు. ఇది చాలదన్నట్లుగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి కొన్ని వేల కోట్ల రూపాయల రుణాన్ని పొందారు. ఇప్పుడు రాష్ట్ర రహదారులను కాస్తా, నాబార్డ్ నుంచి రుణం పొందడానికి జిల్లా రహదారులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది . రాష్ట్ర రహదారులకు నాబార్డ్ రుణం ఇవ్వకపోవడం, జిల్లా రహదారులకు రుణ మంజూరీకి అంగీకరించడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఈ రివర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు.

రోడ్ల మరమ్మత్తుల కోసం బయటి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. సొంత కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి, వారికి నాబార్డ్ నిధులను కట్టబెట్టి పర్సెంటేజీలను కొట్టివేయడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అంతే తప్ప ప్రజల రోడ్ల కష్టాలన్నది తీరే అవకాశాలు లేవనేది సుస్పష్టమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఎవరైనా రాష్ట్ర రహదారులను అప్ గ్రేడ్ చేయాలని చూస్తారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మాదిరిగా, రాష్ట్ర రహదారులను, జిల్లా రహదారులుగా ప్రకటించడం ఏమిటంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

మీటర్ల కొనుగోళ్ల లో వేలకోట్ల అవినీతి
వ్యవసాయ మీటర్ల కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెదేపా నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కేవలం కాసుల కక్కుర్తి కోసమే వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించారన్నారు. మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా చెల్లించి మీటర్లను కొనుగోలు చేశారని, ఐదేళ్లపాటు నిర్వహణ పేరిట తొక్కలో కబుర్లు చెప్పి వేల కోట్లు దోచుకున్నట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే నన్నారు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, ప్రజాధనాన్ని దోచుకునేందుకు వ్యవసాయ మోటర్లకు మీటర్లకు బిగించాలని నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని ఎక్కడా చెప్పలేదన్నారు . మీటర్లు ఎందుకంటే… ఉత్తుత్తిగానే పెడుతున్నామని అంటున్నారు. ఆ డబ్బు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించదట. రైతుల అకౌంట్లో వేస్తే, రైతులు విద్యుత్ శాఖ కు చెల్లించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక నెల రైతుల అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయకపోతే, అప్పుడు విద్యుత్ శాఖ అధికారులు వచ్చి వ్యవసాయ మోటార్ల కనెక్షన్లను కట్ చేస్తారన్నారు. మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియలో రైతులను భాగస్వాములను చేయడం ఎందుకని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రైతులను భాగస్వాములను చేయకపోతే, మీటర్లు ఎందుకు కొన్నారని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసే, ఈ ప్రక్రియలో రైతులను భాగస్వాములను చేశారని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ధన దాహం కోసం రైతులను బలి చేస్తున్నారన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది ఉండదు, చివరకు రైతులు బలి కాక తప్పదు అన్నారు. ఇదే విషయాన్ని చెబుతుంటే, రైతుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించడం విడ్డూరంగా ఉంది. ఆ మాత్రం రైతులు పసిగట్టలేరా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని రైతులందరూ చీదరించుకుంటున్నారు. కాసుల కక్కుర్తి కోసం మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియ పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.

ఒకవైపు రాష్ట్ర రైతాంగం తుఫాన్ దెబ్బకు విలవిలలాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంట్లో కూర్చొని పిడేల్ వాయించుకుంటూ, గుళ్ళల్లో శంకుస్థాపనలు చేస్తుండడంతో ఈ ప్రభుత్వానికి గంటసేపు కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదన్న కృత నిశ్చయానికి ప్రజలు వచ్చారన్నారు. ప్రజలంతా ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారని రఘురామకృష్ణం రాజు చెప్పారు.

రిట్ వేయాలా?, పిల్ వేయాలా?? అన్నదికూడా మీరే చెబుతారా??
ప్రజా సమస్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చేందుకు రిట్ వేయాలా?, పిల్ వేయాలా?? అన్నది అడ్వకేట్ జనరల్ శ్రీరామే చెబుతారట ??? అంటూ రఘురామ కృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు . హైకోర్టు తీర్పుకు తూట్లు పొడుస్తూ, విశాఖపట్నంలో క్యాంప్ కార్యాలయం నెపంతో సతీమణితో సహా ముఖ్యమంత్రి , కార్యదర్శులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మకాం మార్చాలని నిర్ణయించడాన్ని తప్పుపడుతూ, గద్దె తిరుపతిరావు, మాదాల శ్రీనివాసరావు అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

దానికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరామ్… ఇది సరైన విధానం కాదని, రిట్ కాదు… పిల్ వేయాలన్నారు. నాలాంటివారు పిల్ వేస్తేనే, పిల్ వేసే అర్హత ఒక ఎంపీ కి లేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారని గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పును ఎత్తి చూపడానికి , రిట్ వేయడాన్ని కూడా అడ్వకేట్ జనరల్ తప్పు పట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గద్దె తిరుపతిరావు, మాదాల శ్రీనివాసరావు వేసిన రిట్ పిటీషన్ కు రిజిస్ట్రీ నెంబరింగ్ కేటాయించింది. రిట్ పిటిషన్ స్వీకరణ అర్హత ఉందా? లేదా అన్నది నిర్ణయించే విచక్షణ అధికారం హైకోర్టు రిజిస్ట్రీ ఉందని చెప్పారు.

అయినా, ఇలా రిట్ వేయడం ఫోరం షాపింగ్ కిందికి వస్తుందన్న అడ్వకేట్ జనరల్ , పిల్ వేయాలని సూచించడం, రిజిస్ట్రీ ఎందుకు నెంబర్ కేటాయించిందో అర్థం కావడం లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం పట్ల రఘురామ కృష్ణంరాజు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు . త్రిసభ్య ధర్మాసనం, ప్రధాన న్యాయస్థానం మాత్రమే ఈ పిటిషన్ విచారించాలని ఆయన కోరడం జరిగిందని అన్నారు . గద్దె తిరుపతిరావు, మాదాల శ్రీనివాసరావు లు ఫోరం షాపింగ్ కు పాల్పడుతున్నారని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన వచ్చా ? అన్న రఘురామ కృష్ణంరాజు, మీరు కూడా అలాగే ఫోరం షాపింగ్ కు పాల్పడుతున్నారనే అనుమానం వారికి రాదా?? అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి మూట ముల్లె సర్దుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా విశాఖపట్నం వెళ్తుంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండాలా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు . ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు, ప్రత్యారోపణలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని అడ్వకేట్ జనరల్ శ్రీ రామ్ కు సూచించారు.

అమరావతి సర్వ నాశనం చేయాలన్న దృక్పథంతోనే రోడ్లను తవ్వేస్తున్నారు
అమరావతి ఆర్ 5 జోన్లో ఇండ్ల నిర్మాణానికి కూడా అభ్యంతరం తెలిపారని అడ్వకేట్ జనరల్ పేర్కొనడం జరిగిందని రఘు రామ కృష్ణం రాజు తెలిపారు . హైకోర్టు స్టే ఉన్న విషయాన్ని నేనే కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ ద్వారా తెలియజేశాను. హైకోర్టు స్టే ఉన్న నేపథ్యంలో, అమరావతిలో ఇండ్ల నిర్మాణానికి రుణాన్ని మంజూరు చేయవద్దని కోరాను . అయితే ఇదే విషయమై గతంలో నాకు ఒక లేఖ పంపినప్పటికీ , హైకోర్టు స్టే ఉన్నంతవరకు అమరావతి ఆర్ 5 జోన్లో ఇండ్ల నిర్మాణానికి రుణాన్ని ఇచ్చే ప్రసక్తి లేదని కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తూ, నాకు పంపిన మరొక లేఖ రెండు రోజుల క్రితం అందిందన్నారు .

ఈ సందర్భంగా లేఖను మీడియా ముందు రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. అమరావతిని శాశ్వతంగా నాశనం చేయాలన్న దృక్పథంతోనే రోడ్లను తవ్వేస్తున్నారు. అరణ్యంగా అమరావతిని మార్చాలని ఈ విధంగా చేస్తున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ ను ఆమోదించామని, రాష్ట్ర రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో బిజెపి కూడా ఇన్ డైరెక్టుగా అమరావతికి జై కొట్టినట్లేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

అంబేద్కర్ కు వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించరా?
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పార్లమెంటులో ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి తో సహా ప్రధానమంత్రి ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు నేను కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. వైకాపా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి మేరుగ నాగార్జున తో పాటు మరికొందరు నివాళులు అర్పించినట్లుగా సాక్షి దినపత్రికలో రాశారు. అంబేద్కర్ కు నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డే నని నాగార్జున కితాబు నివ్వగా, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా అంబేద్కర్ కు నివాళులర్పించినట్లుగా సాక్షి దినపత్రికలో వార్త కనిపించలేదు.

జగన్మోహన్ రెడ్డి బహుశా మనసులో నివాళులు అర్పించిన సాక్షి దినపత్రికలో వార్త రాసి ఉండేవారు. 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి , చివరకు అంబేద్కర్ కు నివాళులు అర్పించేందుకు కూడా సమయం చిక్కకపోవడం విడ్డూరంగా ఉంది. ఫామ్హౌస్ కే పరిమితమైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ని ప్రజలు ఫామ్ హౌస్ కే పరిమితం చేశారు . ప్యాలెస్ లో ఉంటూ ప్రజలకు కనిపించని ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ప్యాలెస్ కే పరిమితం చేస్తారన్నారు. ఇటువంటి తప్పులు పునరావృత్తం చేయకుండా, అంబేద్కర్ వంటి మహానియుడికి నివాళులు అర్పించేందుకు అయినా ప్యాలెస్ నుంచి కాలు బయట పెట్టాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.

నిస్సహాయ స్థితిలో ఉన్న తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలు, రైతులు
రాష్ట్రంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు, రైతులు నిస్సహాయ స్థితిలో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ప్రజలు కష్టాల పాలవుతున్నారని, అదే సమయంలో నవ్వుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజల, రైతుల కష్టాలను చూసి చలించి పోయిన తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, 73 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నప్పటికీ, తుఫాను వల్ల నష్టపోయిన ప్రజల్ని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు.

రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు . విజయవాడలోని దుర్గ గుడిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. దైవ కార్యక్రమాలు చేయడం మంచిదే కానీ దానికి సమయం సందర్భం చూసుకోవాలన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రజలంతా తుఫాను ప్రభావంతో తల్లడిల్లుతుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారులను ఆదేశించాను… అంతా వారే చూసుకుంటారన్నట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. బహుశా ముఖ్యమంత్రి ఆదేశించకపోతే, జిల్లాస్థాయిలో కలెక్టర్లు ఇతర అధికారులు పనులు చేయరేమోనంటూ ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి బృందానికి అభినందనలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులకు రఘురామకృష్ణం రాజు అభినందనలను తెలియజేశారు.

LEAVE A RESPONSE