టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన
విశాఖ ఏజన్సీలోని శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయితీ శివారు చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయ విదారక సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. రాష్ట్రంలో అంపశయ్యపైకి చేరిన వైద్య,ఆరోగ్య రంగ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోంది.
గంగులు, గంగమ్మ దంపతుల ఆరునెలల ముక్కుపచ్చలారని కుమారుడు అనారోగ్యానికి గురికాగా, ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో డోలీపై ఈనెల 5న ఎస్.కోట తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో డాక్టర్ల సూచనతో విశాఖ కెజిహెచ్ కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. 6వతేదీన ఆ చిన్నారి కన్నుమూశాడు. అప్పటికే కిడ్నీవ్యాధితో బాధపడుతున్న గంగమ్మ కడుపుకోతతో తీవ్ర మానసిక క్షోభకు గురై మంగళవారం తుదిశ్వాస విడిచింది.
గుండెబద్ధలైన గంగులు భార్య మృతదేహాన్ని ద్విచక్రవాహనంపైన కొద్దిదూరం, డోలీపైన మరికొంతదూరం అవస్థలు పడి స్వస్థలానికి తీసుకెళ్లడం రాష్ట్రంలో మారుమూల గిరిజనులు ఎదుర్కొంటున్న పరిస్థితులను కళ్లకు కడుతోంది. అసమర్థుడి పాలనలో గిరిజనబిడ్డలకు సరైన వైద్యం అందించడం ఎలాగూ చేతకాలేదు… కనీసం మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయలేరా? ఫోన్ కొట్టిన వెంటనే కుయ్… కుయ్ అంటూ అంబులెన్స్ పరుగెత్తుకొస్తుందని గాలికబుర్లు చెప్పే ముఖ్యమంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారు?