రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడతాం

– బిఆర్ఎస్ కు గ్యారంటీ, వారంటీ, ఎక్స్పైరీ దాటింది
– తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజా పాలన లక్ష్యం
– డిప్యూటీ సీఎం విక్రమార్క

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన రాష్ట్రాన్ని గట్టెక్కించి ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం బోనకల్ మండల కేంద్రంలోని సాయిబాబా గుడి ఎదురుగా కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమానికి ఆయన సతీమణి నందిని విక్రమార్కతో కలిసి భట్టి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయా రాజకీయ పక్షాల పార్టీల నాయకులు శాలువాలు కప్పి, పూల దండలు వేసి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘమైన ప్రసంగం చేశారు.

10 ఏండ్లు పరిపాలన చేసిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అధోగతి పాలు చేసిందన్నారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పని చేస్తానని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్తు రంగంపై 1.10 లక్షల కోట్ల రూపాయల భారం మోపిందన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిన ఆర్థిక అరాచకంతో అప్పుల ఊబిలోకి నెట్టి వేయబడిన రాష్ట్రాన్ని ప్రగతిశీల భావాలతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామే తప్పా, వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. రాష్ట్రం అప్పుల పాలైనప్పటికి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు ఇచ్చామన్నారు. తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు.

రాష్ట్రంలోని సహజ వనరులు, ఇతను వనరులను రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లి సంపద సృష్టించి సృష్టించిన సంపదను ప్రజలకు పంచడమే ఆరు గ్యారంటీల హామీల అమలు లక్ష్యమని వివరించారు.

ఎక్స్పైరీ అయిన బిఆర్ఎస్
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని విమర్శిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి గ్యారెంటీ, వారంటీ తో పాటు ఎక్స్పైరీ కూడా అయిపోయిందని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలకు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నదని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ ఉంది కాబట్టే ప్రజలు గెలిపించిన విషయాన్ని బిఆర్ఎస్ గ్రహించాలని చురకలు వేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు బిఆర్ఎస్ కోసం, బిఆర్ఎస్ మెప్పు కోసం కాదని, రాష్ట్ర సంపద ప్రజలకు చెందాలని ప్రకటించినట్లు స్పష్టం చేశారు.

ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ, సంస్థ నా కోసమే ఏర్పాటు చేశారని ప్రతి పౌరుడు భావించే విధంగా జవాబుదారిగా పాలన అందిస్తామని వెల్లడించారు. ప్రతి వ్యవస్థ ప్రజల అవసరాలు తీర్చే విధంగా బాధ్యతాయుతంగా సేవలు అందించాలే తప్పా, బాధ్యత రహితంగా వ్యవహరించ కూడదన్నారు. పదేళ్లుగా జావాబుదారి లేకుండా ప్రతి వ్యవస్థను సంస్థను బిఆర్ఎస్ తన స్వార్థం కోసం వాడుకున్నదని, చివరకు కష్టం వస్తే ప్రజలు దరఖాస్తు ఇచ్చే దుస్థితి కూడా లేకుండా చేసిందని మండిపడ్డారు.

కేసులు, వేధింపులు, బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని బంధించిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు నిరసన తెలిపే హక్కును కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం హరించిందని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉండాలని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ ను పునరుద్ధరణ చేశామన్నారు.

ప్రగతి భవన్ కు ఉన్న ఇనుప కంచె తొలగించి ప్రజాభవన్ గా మార్చి రాష్ట్ర ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి స్వేచ్ఛను అందించామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఆశయాలు నిజం చేసే విధంగా కాంగ్రెస్ ప్రజాపాలన ఉంటుందన్నారు.

ఎన్నికల అప్పుడే రాజకీయాలు తప్పా.., ఇప్పుడు పాలన, అభివృద్ధి తమకు ముఖ్యమన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం అందరి సమిష్టి బాధ్యత అని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలను రాజకీయాలకు అతీతంగా అందరికీ ఇవ్వడమే ఇందిరమ్మ ప్రజాపాలన లక్ష్యం అని వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీలను లబ్ధి పొందే విధంగా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, మండల అధ్యక్షులు దుర్గారావు, జిల్లా నాయకులు పైడిపల్లి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply