Suryaa.co.in

Telangana

100 కోట్ల మంది ‘ప్రో ప్లానెట్ పీపుల్’!

-ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘లైఫ్ మిషన్’ లక్ష్యమిదే
-దేశవ్యాప్తంగా దశలవారీగా కార్యక్రమాలు
-మిషన్ లక్ష్యాల సాధనకు దక్షిణాది రాష్ట్రాలు, యూటీలు సహకరించాలి
-లైఫ్ మిషన్‌ను విజయవంతం చేయడంలో ప్రభుత్వరంగ సంస్థలే కీలకం
-దక్షిణాది రాష్ట్రాలపై బీఈఈ ప్రత్యేక దృష్టి
-ఇంధన సామర్థ్యం, సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలి
-బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, యూటీల మీడియా సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి
-హైదరాబాద్‌లో బాధ్యతల స్వీకరణ

పర్యావరణ హితం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘లైఫ్ మిషన్‌ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్)’ సమర్థ అమలుపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)’ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

లైఫ్ మిషన్‌ను దేశవ్యాప్తంగా దశలవారీగా విస్తరించాలని నిర్ణయించింది. దేశ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2028కల్లా ప్రజలంతా ప్రకృతిసిద్ధమైన జీవనశైలిని అనుసరించేలా కనీసం వంద కోట్ల భారతీయులు, ప్రపంచ పౌరులను ప్రోత్సహించడమే లైఫ్ మిషన్ ధ్యేయం.

‘లైఫ్’ అనేది ప్రజా ఉద్యమం. ప్రజల్ని ‘ప్రో-ప్లానెట్’గా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన ఈ మిషన్ ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీఈఈ.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీ)పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మిషన్ కు అస్పరి చంద్రశేఖరరెడ్డిని నోడల్ అధికారిగా నియమించింది. బీఈఈకి దక్షిణాది ప్రాంత మీడియా సలహాదారుగా నియమితులైన చంద్రశేఖరరెడ్డి సోమవారం హైదరాబాద్ లో బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)’ దక్షిణాది రాష్ట్రాలు, యూటీల్లో వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ వ్యవహారాల సీనియర్ సలహాదారుగా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీఈఈకి దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మీడియా సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. చంద్రశేఖరరెడ్డి హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వర్తించనున్నారు. ఇంధన సుస్థిరత, సామర్థ్య లక్ష్యాలను సాధించడంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, దక్షిణాదిలోని కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ విద్యుత్తు సంస్థలకు ఆయన సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, విద్యుత్తు సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించాలి.

లైఫ్ మిషన్‌కు చంద్రశేఖరరెడ్డి నోడల్ అధికారిగా ఉంటూ.. దక్షిణాది రాష్ట్రాలు, యూటీల్లో ఇంధన సామర్థ్యం, సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇంధన సంరక్షణ, పొదుపుకు సంబంధించి బీఈఈ చేపడుతున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను పర్యవేక్షించాలి. లైఫ్ మిషన్ లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యం తప్పనిసరని చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వినియోగం, పర్యావరణ హిత కార్యక్రమాలు, స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా లైఫ్ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

లైఫ్ మిషన్‌ను విజయవంతం చేయడంలో ప్రభుత్వరంగ సంస్థలు విశిష్ట పాత్ర పోషించాల్సి ఉందని, ఆ మేరకు బీఈఈ పిలుపునిస్తోందని చెప్పారు. లైఫ్ మిషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్, ఇతర కాస్మొపాలిటన్, పెద్ద నగరాలపై బీఈఈ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటితో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మిషన్‌ను అమలు చేసేందుకు దశలవారీగా కార్యక్రమాలు చేపట్టనుంది. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడం, జీవన ప్రమాణాల నాణ్యతను మెరుగుపర్చుకోవడం, సుస్థిరతమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవడంపై దృష్టి సారించింది. కనీసం 100 కోట్ల మందిని ప్రో ప్లానెట్ పీపుల్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

లైఫ్ మిషన్ విజయవంతం కావడంలో ప్రభుత్వరంగ సంస్థల పాత్ర అత్యంత కీలకమని బీఈఈ పేర్కొంది. ఆయా సంస్థలు క్షేత్ర స్థాయిలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయంది. డిమాండ్, సరఫరా, విధానాల్లో కలిగే విస్తృత మార్పులపై ప్రభుత్వరంగ సంస్థలు స్థానికంగా చేపట్టే విస్తృత కార్యక్రమాలతో మరింత స్థిరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపింది. ఈ దార్శనిక విధానాన్ని పట్టణ కేంద్రాలకు మించి అమలు చేయాలని.. దక్షిణాదిలోని ప్రధాన నగరాలు, యూటీల్లో లైఫ్ మిషన్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని బీఈఈ స్పష్టం చేసింది.

లైఫ్ మిషన్ ను ముందుకు తీసుకెళ్లడంలో జీవనశైలి, ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్యం సందేశాలను ప్రోత్సహించడం వంటి సమగ్ర వ్యూహాలు కీలకమని బీఈఈ భావిస్తోంది. బీఈఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ వేదికల్లో, ప్రాంతీయ భాషల్లో విస్తృతంగా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చంద్రశేఖరరెడ్డి చెప్పారు. లైఫ్ సందేశాలను ఏకీకృతం చేయడం, ప్రచార సామగ్రిని అభివృద్ధి చేయడం, కమ్యూనిటీ ఆధారిత ప్రాజెక్టులను నిర్వహించడం ద్వారా మిషన్ ప్రభావం మరింత మెరుగ్గా ఉంటుందని తెలిపారు.

లైఫ్ మిషన్ లో భాగంగా బీఈఈ వివిధ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను చురుగ్గా చేపడుతోంది. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా ప్రజలకు చేరువ కావడం, ఎలక్ట్రిక్ వాహనాలపై  ప్రచారాల ద్వారా ఇంధన సామర్థ్య కార్యక్రమాలను క్రియాశీలంగా అమలు చేస్తోంది. తనకు ఇంధన సామర్థ్య రంగంలో బీఈఈ దక్షిణాది ప్రాంత మీడియా సలహాదారుగా సేవలందించే అవకాశం కల్పించిన సంస్థ డీజీ అభయ్ భాక్రే, కేంద్ర విద్యుత్తు శాఖకు చంద్రశేఖరరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

లైఫ్ మిషన్ లో భాగంగా బీఈఈ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ  సంస్థలు సహకరించాలని కోరారు. గ్రామాలు, పట్టణ స్థానిక సంస్థలను పర్యావరణహితంగా మార్చడం; స్థిరమైన ఇంధన వినియోగం, ఉత్పత్తికి మద్దతుగా పారిశ్రామిక, ప్రభుత్వ విధానాలు ఉండేలా చూడడం ద్వారా 100 కోట్ల మందిని ప్రో ప్లానెట్ పీపుల్ గా మార్చాలన్న విజన్ స్పష్టంగా ఉందని తెలిపారు. లైఫ్ మిషన్.. దక్షిణాది ప్రాంతానికి మరింత స్థిరమైన, ఇంధన సామర్థ్య భవిష్యత్తుకు కీలక ముందడుగా నిలవనుందని చెప్పారు.

LEAVE A RESPONSE