21న ప్రకృతి విజ్ఞాన చికిత్స జాతీయ సదస్సు

-నేలకొండపల్లిలో జరిగే ప్రకృతి చికిత్స జాతీయ సదస్సును విజయవంతం చేయండి
– గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి పిలుపు

హైదరాబాద్ : ఈనెల 21వ తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సిద్ధార్థ యోగ విద్యాలయం – గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకృతి విజ్ఞాన చికిత్స జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఛైర్మెన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఆరోగ్యరీత్యా అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మానవుడు తన సౌలభ్యం కోసం నూతన విజ్ఞానాలను ఆవిష్కరిస్తూ ఉన్నప్పటికీ అది మానవాళి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ప్రకృతికి ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేక పోతున్నారు.

మూడు వేల ఏండ్ల క్రితమే గౌతమ బుద్దుడు, జీవకుడు ఈ విషయాలను తెలియజేశారు. అదేవిధంగా మహాత్మా గాంధీజీ వంద ఏండ్ల క్రితమే ప్రకృతి చికిత్సా విధానాలు గురించి వివరించారని గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు.

గత 24 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కేంద్రంగా ప్రకృతి వైద్యులు డాక్టర్ కె వై రామచంద్ర, డాక్టర్ ఎం జి పద్మ ఇంటింటికీ తిరిగి ప్రకృతి వైద్య చికిత్స అందిస్తూ మెళుకువలను ప్రజలకు పరిచయం చేస్తూ ప్రకృతే వైద్యుడు, ఆహారమే ఔషధము అని తెలిపారు.

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సుస్థిర విద్యా, వ్యవసాయం సమగ్ర గ్రామీణ అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తూ 2018నుడి రామచంద్ర ప్రకృతి ఆశ్రమం ద్వారా ఎందరికో ఉచిత వైద్యాన్ని అందజేసినట్లు గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు.

అందులో భాగంగానే ఈనెల 21న ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ప్రకృతి విజ్ఞాన చికిత్స జాతీయ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ జాతీయ సదస్సులో వంద రకాల దేశవాళీ బియ్యం ప్రదర్శన, వందరకాల కూరగాయల దేశవాళి విత్తనాల ప్రదర్శన, మగ్గం చేనేత మట్టి కుండలు తయారీ ప్రదర్శనలు, సహజ రంగులు, ఖాదీ, చేనేత తాటి ఆకుల బొమ్మలు, ఔషద మొక్కలు, గానుగ నూనె, సిరి ధాన్యాలు, ఇతర ప్రదర్శనలు, అమ్మకాలు , ప్రముఖుల సందేశాలు, ప్రకృతి వైద్యం ద్వారా చికిత్స పొంది వ్యాధులు తగ్గిన వారి అనుభవాలను పంచు కోవడం జరుగుతుందని డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాంధారి ప్రభాకర్, మహిళా కన్వీనర్ యానాల రాధిక, సాహితీ విభాగం కన్వీనర్ గిరిధర్ పొట్లపల్లి, పర్యావరణ విభాగం కన్వీనర్ టి సురేందర్, ప్రచార కార్యదర్శి కె సుభాష్ చంద్ర, గ్రామ నిర్మాతల విభాగం కన్వీనర్ గుండాల గోవర్ధన్, కో ఆర్డినేటర్ లు సాయితేజ, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply