Suryaa.co.in

Andhra Pradesh

జగన్ మద్య నిషేధం హామీ తుంగలోకి.. ఆదాయం ఆకాశంలోకి!

• జగన్ ప్రభుత్వ సొంత ఆదాయంలో పావలా వంతు మద్యం నుంచే
• జగన్ రెడ్డి కనుసన్నల్లో రూ.50వేలకోట్ల అదనపు మద్యం అమ్మకాలు
• రోజు వారీ మద్యం విక్రయం రూ.80 కోట్లకు పైనే
• డిస్టిలరీలన్నీ సొంత వాళ్లకే.. అదనంగా కేసుల వారీ కమీషన్లతో భారీ దోపిడీ
• వెరసి నవ్యాంధ్ర ప్రజల ఆరోగ్యం విలవిల
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

జగన్మోహన్ రెడ్డి పరిపాలన చివరిదశకు చేరిందని, ఈ నేపథ్యలో మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తానన్న హామీ అమల్లో మాటతప్పాడని, వైసీపీప్రభుత్వంలో రాష్ట్రంలో కనివినీ ఎరుగని విధంగా మద్యం వినియోగం, ఆదాయం పెరిగాయని, మద్యనిషేధమంటే ఇదేనా అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకు ఇచ్చేసొమ్ములో సగం సొమ్ముని జగన్ రెడ్డి మద్యం విక్రయాల ద్వారా లాగేస్తున్నాడు
“ మద్యాన్ని నిషేధిస్తానన్న జగన్ రెడ్డి, తన హాయాంలో రాష్ట్రంలో నిత్యం రూ.80 కోట్ల మద్యం విక్రయాలు జరుపుతున్నారు. కనీసం రోజుకి లక్షకేసుల మద్యం అమ్ముతున్నారు. ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో లక్షా25వేలకోట్ల మద్యం విక్రయాలు జరిపింది. దానివల్ల ప్రభుత్వానికి లక్షకోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇటీవల విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేసే కార్యక్రమంలో జగన్ రెడ్డి మాట్లాడుతూ…

“తాను ఇప్పటివరకు బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకు రూ.2.60 లక్షల కోట్లను నేరుగా ప్రజలకు అందించాం” అన్నారు. అదే సభలో జగన్ రెడ్డి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షా25 వేలకోట్లు మద్యం అమ్మకాల ద్వా రా రాబట్టానని చెప్పి ఉంటే, ప్రజలకు వాస్తవాలు తెలిసేవి. జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చానని చెబుతున్న సొమ్ములో సగం సొమ్ముని తిరిగి పేదల నుంచి లాక్కుంటున్నట్టు జగన్ రెడ్డే అంగీకరించాడు.

జగన్ రెడ్డి హాయాంలో రూ.50వేలకోట్లకు పైగా అదనపు మద్యం విక్రయాలు
గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే జగన్ రెడ్డి జమానాలో మద్యం విక్రయాలు రూ.50వేలకోట్లకు పైగా పెరిగి, మొత్తం అమ్మకాలు లక్షా25వేలకోట్ల రూపాయలకు చేరాయి. అనగా మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దానికి విరుద్ధంగా మద్యం విక్రయాలను 67శాతం పెంచారు.

2019-20లో మొత్తం మద్యం అమ్మకాలు రూ.20,990 కోట్లు,
2020-21లో రూ.20,189 కోట్లు,
2021-22లో రూ. 25,000కోట్లు,
2022-23లో రూ.28,113కోట్లు,
2023-24లో (డిసెంబర్ వరకు) రూ.22,230వేల కోట్ల విక్రయం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మూడు నెలల కాలం మిగిలుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వంలో కూడా మద్యం అమ్మకాల ద్వారా రూ.లక్ష కోట్ల ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు.

నిషేధం హామీ గాల్లో… భారీగా అమ్ముడుపోయిన మద్యం
మద్యం ధరలు పెంచింది.. ప్రజలు మద్యం తాగకుండా చేయడానికేనని చెప్పుకుం టున్న ప్రభుత్వ వాదన కూడా పూర్తిగా అవాస్తవం. అబ్కారీ శాఖ వెబ్ సైట్ లోని వివరాలు పరిశీలిస్తే..!
2019-20లో 3లక్షల8వేల కేసుల ఐ.ఎమ్.ఎఫ్ లిక్కర్ అమ్మితే, 2022-23 (మార్చినాటికి) 3లక్షల36వేల కేసులు అమ్మారు. తొలి సంవత్సరం అమ్మకాల కు, చివరి ఏడాది అమ్మకాలకు మధ్య 10శాతం వ్యత్యాసం పెరిగింది. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి, ఈ విధంగా అమ్మకాలు పెంచి, ఆదాయం పెంచుకోవడం జగన్ రెడ్డికే చెల్లింది.

రాష్ట్ర ఆదాయంలో 25 శాతం మద్యం అమ్మకాల ద్వారానే వస్తోంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఖజానాకు ఈ ఐదేళ్లలో వచ్చిన ఆదాయం (ఈ సంవత్సరం బడ్జెట్ లెక్క కలిపి) రూ.99వేలకోట్లు అయితే, దానిలో కేవలం మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయమే రూ.25వేలకోట్లు. మొత్తం ఆదాయంలో 25శాతం సొమ్ము మద్యం అమ్మకాలద్వారానే జగన్ రెడ్డి ప్రభుత్వం రాబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల బెల్టుషాపులు ఉన్నాయి. ఒకవైపు మద్యాన్ని నిషేధించ డానికే, అమ్మకాలు తగ్గించడానికే ధరలు పెంచామని చెబుతున్న వారు ఇంత ఆదాయం రావడంలోని మర్మమేమిటో చెప్పాలి. రాష్ట్రంలోని పేదల్ని ఉద్ధరిస్తు న్నామని గొప్పలు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి.. చివరకు కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అధికధరకు విక్రయిస్తూ పేదలజేబులు గుల్ల చేస్తున్నాడు.

డిస్టిలరీల లీజులు.. సబ్ లీజుల్లో భారీ దోపిడీ
నచ్చిన వారికే డిస్టిలరీలు కట్టబెట్టి.. నాసిరకం మద్యాన్ని తయారుచేయిస్తున్నా రు. వైసీపీప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కొత్తగా అనుమతి ఇవ్వకపోయినా, డిస్టిలరీల యజమానుల్ని బెదిరించి, వాటిని లాక్కొని తమకు అనుకూలమైనవారికి కట్టబెట్టారు. వైసీపీనేతల నిర్వహణలోని డిస్టిలరీల నుంచి కొన్ని వందల బ్రాండ్ల నాసిరకం మద్యం రోజూ మార్కెట్లోకి వస్తోంది. లీజుల ద్వారా కాకుండా మరలా ఒక్కో మద్యం కేసుకి ఇంతని జగన్ రెడ్డికి అందుతున్న ఆదాయం అదనం.

డిజిటల్ చెల్లింపులు ఎందుకు అనుమతించడం లేదు?
మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ ను ప్రభుత్వం అనుమతించకపోవడానికి కారణం కూడా దోపిడీనే. చిన్నచిన్న పచారీ కొట్లలోకూడా డిజిటల్ చెల్లింపులు ఉంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం వాటికి స్థానం లేకుండా చేశారు. మద్యం వినియోగదారుల నుంచి వచ్చే నగదు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు చేరేలా మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. ఈ ఐదేళ్లలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.లక్షా25వేలకోట్లు వస్తే, డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి జగన్ రెడ్డి భారీ దోపిడీకి పాల్పడ్డాడు. ఇదంతా ప్రజల్ని వంచించి సంపాదించిన పాపపు సొమ్మేనని, ఈ పాపం ఊరికే పోదని ఆయన గ్రహించాలి.

జగన్ పేదలకు ఇచ్చిన దానికంటే, పిచ్చి మద్యం అమ్మకాలు.. ఇతర మార్గాల ద్వారా వారి నుంచి దోచుకున్నదే ఎక్కువ
రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్న మద్యం అంతా నాసిరకమైనదే. బూమ్ బూమ్.. ప్రెసిడెంట్ మెడల్.. త్రీ క్యాపిటల్స్.. వరల్డ్ కప్ అంటూ పిచ్చిపేర్లు పెట్టి పిచ్చిమందు అమ్ముతూ పేదల ప్రాణాల్ని బలితీసుకుంటున్నారు. మద్యాని కి అలవాటుపడిన మందుబాబులు ధరలు పెంచినా, తాగేది కల్తీమద్యం అని తెలిసినా గత్యంతరం లేక దాన్ని తాగుతున్నారు. దశలవారీగా మద్యాన్ని ని షేధిస్తానని చెప్పిన జగన్ రెడ్డి… మద్యం తయారీ.. అమ్మకం వరకు వివిధ దశల్లో దశలవారీగా తన ఆదాయం పెంచుకున్నాడు.

ప్రజలకు బటన్ నొక్కుడు ద్వారా జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చినదానికంటే, మద్యం అమ్మకాలు.. ఇతరత్రాపన్నులు.. విద్యుత్…ఆర్టీసీ…ఇంధన ఛార్జీల పెంపు ఇతరత్రా మార్గాల్లో కొల్లగొట్టిందే ఎక్కువ. ఒకచేత్తో ఇస్తూ,… మరో చేత్తో అంతకురెట్టింపుసొమ్ము ప్రజల నుంచి లాక్కోవడం ముమ్మాటికీ అనైతికం.. అక్రమం. జగన్ రెడ్డి మాయమాటలు నమ్మి మహిళలు ఆయనకు ఓటేసిన పాపానికి ఇప్పుడు ఆ మహిళలే తమ తాళిబొట్లు రక్షించుకోవడానికి, కుటుంబాల్ని కాపాడుకోవడానికి ఈ ముఖ్యమంత్రిపై, వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలన ముగింపు దశకు చేరింది. ఇకపై ఆయన ఆటలు.. కల్లబొల్లిమాటలు సాగవు.” అని విజయ్ కుమార్ తేల్చిచెప్పారు

LEAVE A RESPONSE