దళితుల అభివృద్ధికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఆదర్శనీయం

– ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
– జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు వైయస్సార్ సిపి ప్రభుత్వం కృషి చేస్తోంది
– ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి

ఒకప్పుడు అసమానతలకు పుట్టినిల్లుగా ఉన్న భారతదేశం నేడు సమానత్వం దిశగా ముందడుగులు వేసుకుంటూ, అభివృధ్ది దిశగా వెళ్తుందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ లే కారణం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వారిద్దరు భారతదేశం గర్వించదగ్గ నేతలు అని కొనియాడారు.జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ దళిత వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ ల అభ్యున్నతి కోసం కృషి జరుగుతోందని అన్నారు. ఈ వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాల్సిన ఆవశ్యకతను గుర్తించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. ఈ వర్గాల అభివృధ్దికి వైయస్ జగన్ అటు పార్టీ పరంగాను, ఇటు ప్రభుత్వ పరంగాను ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. అణగారిన వర్గాల రాజకీయ సాధికారత సాధించే దిశగా ప్రణాళికాబధ్దంగా జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియచేశారు.

గతంలో పాలించిన రాజకీయపార్టీలు, దళిత వర్గాల అభివృధ్ది గురించి కేవలం మాటలు మాత్రమే చెప్పాయి తప్ప, వారి అభ్యున్నతి కోసం చేసిందేమీ లేదని అన్నారు. మంత్రి వర్గ కూర్పు నుంచి అన్నింటిలోనూ జగన్ ఈ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని యావత్తు ప్రపంచానికి సగర్వంగా చాటిచెబుతామన్నారు. దళితులను అన్నిరంగాలలో ముందు తీసుకువెళ్లేందుకు నిబద్ధతతో చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయని అన్నారు.

రానున్నకాలంలో జగ్జీవన్ రామ్ ఆశయాలు ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణంగా నెరవేరతాయని వివరించారు. చదువు పరంగాగానీ,ఉపాధిపరంగాగానీ, ఇంగ్లీషు మీడియం చదువుల పరంగాగానీ, అన్నివిధాలా దళితులు అభివృద్ది సాధించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ విధానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమగ్రప్రణాళికలో భాగంగా ఉందన్నారు.వచ్చే పదేళ్లలో రాష్ర్టంలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ లు కన్నకలలు సాకారమవుతాయన్నారు. దళితుల మధ్య విబేధాలు సృష్టించి ఓట్ల పరంగా లబ్దిపొందాలనే ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పికొట్టాలన్నారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. పరిపాలనదక్షుడు,సంఘసంస్కర్త, కీర్తిశేషులు బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు అందరికి ఆదర్శనీయమన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ వంటి మహనీయులు త్యాగాల ఫలితంగా నేడు దళితులు ఆర్దికంగా,సామాజికంగా,రాజకీయంగా అనేక హక్కులు పొందగలిగారన్నారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను తూచ తప్పకుండా అమలు చేసిన నాయకుడిగా జగజ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. జగ్జీవన్ రామ్ గారు.. కేంద్రంలో అనేక పదవులను సమర్దవంతంగా నిర్వహించి ఆయా మంత్రిత్వశాఖలకు వన్నెతెచ్చారన్నారు.

దళిత జాతి ముద్దుబిడ్డగా ఆయనను నిరంతరం స్మరించుకోవాలన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని కోరారు. వైయస్ జగన్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ లు దళిత జాతికి రెండు కళ్లు అని చెప్పారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పధకాలు దళితుల అభివృధ్దికి దోహదం చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మాల,మాదిగలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. దళిత అభ్యున్నతికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

శాసనసభ్యులు మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ చట్టసభలలో తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన వ్యక్తి అన్నారు. చంద్రబాబులాంటి వాళ్లు దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించి అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా పనిచేశారన్నారు. దేశంలో ప్రజానీకానికి ఏది ఉపయోగమో దానిని అమలు చేసిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. జగ్జీవన్ రామ్ ఆలోచనలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అన్నారు.

ఎంఎల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. గాంధేయవాది, గాంధీ ఆలోచనల ద్వారా దళితవర్గాలను ఉన్నత స్థానంలోకి తీసుకురావాలని భావించి ఆ దిశగా కృషి సల్పిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని అన్నారు. అగ్రికల్చర్ సైంటిస్ట్ స్వామినాధన్ మాటల్లో చెప్పాలంటే.. గ్రీన్ రెవల్యూషన్ గురించి తాను కృషి చేయడానికి కారణం జగజ్జీవన్ రామ్ అని వివరించారన్నారు. ఈరోజు ఆహార ధాన్యాలు సమృధ్దిగా నిల్వలు ఉంచుకోగలిగామంటే దానికి కారణం జగజ్జీవన్ రామ్ అని అన్నారు. డా. అంబేద్కర్, జగ్జీవన్ రామ్ బాటలో నడుస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు అందరూ అండగా నిలవాలన్నారు.

ప్రభుత్వ సలహాదారులు(సోషల్ జస్టిస్) జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ… జగ్జీవన్ రామ్ తనకు వచ్చిన పదవులను పేద ప్రజలకు ఉపయోగపడేవిధంగా వినియోగించుకున్న వ్యక్తి అని కొనియాడారు. భారతదేశంలో ఏప్రిల్ మాసాన్ని ప్రత్యేకమైన మాసంగా జరుపుతుంటారన్నారు. ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ గారు జయంతి, ఏప్రిల్ 11 న జ్యోతిరావుపూలే జయంతి, ఏప్రిల్ 14 న బాబాసాహేబ్ జయంతిగా ఉత్సవ నెలగా జరుపుతుంటామని అన్నారు. ఈరోజు లక్షా 40 వేల కోట్ల రూపాయలను ఈ రాష్ర్టంలో పేదప్రజలకు, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా లబ్దిదారులకు నేరుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అందించగలిగారన్నారు.

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ… జగ్జీవన్ రామ్ దేశానికి, ముఖ్యంగా దళిత జాతి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన అందించిన సేవలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లువుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్, మాజి శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్సి కార్పోరేషన్ ఛైర్మన్కొ మ్మూరి కనకరావు మాదిగ, సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ సునీల్ కుమార్,లిడ్ క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్, ఆప్కోఛైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు,ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనురు గౌతంరెడ్డి, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి,గ్రంధాలయపరిషత్ రాష్ట్ర ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు, పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.