‘కమలం’లో ‘పైవాళ్ల’ కిరికిరి!

– దళితమోర్చా ఇన్చార్జి నుంచి జెపి తొలగింపు
– సత్యకుమార్‌కు సన్మానంపై సోము వర్గం కినుక
– ఆ భేటీకి సోమును పిలవని నిర్వహకులు
– జెపి తొలగింపునకు కారణం సోము ఫొటో పెట్టనందుకేనట
– ‘పైవాళ్ల’ ఆదేశాల మేరకే నిర్ణయమని వివరణ
– కోర్‌కమిటీ, క్రమశిక్షణ కమిటీకి చెప్పకుండానే నిర్ణయం
– సునీల్‌దియోధర్, మధుకర్ మౌనంపై ఆగ్రహం
– బీజేపీ సీనియర్ల సీరియస్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీలో మళ్లీ కిరికిరి మొదలయింది. చాలాకాలం నుంచి పార్టీ రాష్ట్ర నాయకత్వం చెబుతున్న ‘పైవాడి’ పేరిట బెదిరించే మంత్రం, ఈసారి ఏకంగా ఓ రాష్ట్ర పార్టీ నేత ఇన్చార్జి పదవికి ఎసరు తెచ్చింది. యుపీ ఎన్నికల విజయంలో భాగస్వామి అయిన పార్టీ జాతీయ నేతకు చేసిన ఓ సన్మానానికి రాష్ట్ర అధ్యక్షుడిని పిలవని నేరానికి, ఆయన ఫొటో పెట్టని పాపానికి నిర్వహకుడికి ఉన్న పార్టీ ఇన్చార్జి పదవిని ఊడగొట్టిన వైనం ఇప్పుడు ఏపీ బీజేపీలో వివాదంగా మారింది. దీనిపై సీనియర్లు కమలదళపతిపై కారాలుమిరాయాలూ నూరుతున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర కో ఇన్చార్జి, రాష్ట్ర సంఘటనా మంత్రి బెల్లంకొట్టిన రాయిలా మౌనంగా ఉండటంపై పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవల యుపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర కో ఇన్చార్జిగా ఉన్న పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను లైవ్ భారత్ ఫౌండేషన్ గత నెల 27న విజయవాడ జెడె హోటల్‌లో సన్మానించింది. దానికి పార్టీ నాయకులతోపాటు, రాజకీయాలకు సంబంధం లేని ప్రముఖులు, అమరావతి రైతు సంఘ నేతలు, మీడియా ప్రతినిధులు దానికి హాజరయ్యారు. రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు విష్ణుకుమార్‌రాజు, ఆదినారాయణరెడ్డి, నాగోతు రమేష్‌నాయుడు, లంకా దినకర్, కిలారు దిలీప్, కోలా ఆనంద్, వేమాజీ, పాతూరి నాగభూషణం, బాజీ, తాళ్ల వెంకటేష్‌యాదవ్, యడ్లపాటి రఘునాధబాబు, తురగా నాగభూషణం, పాటిబండ్ల రామకృష్ణ, కాటమనేని రవిశంకర్ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా న్యాయవాదుల సంఘం, బెజవాడకు చెందిన వ్యాపార సంఘాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహించిన జయప్రకాష్, బీజేపీ దళితమోర్చాకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. లైవ్ భారత్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్ధ కూడా ఆయనదే. పార్టీలో ఉంటూ, నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫొటో ఎందుకు పెట్టలేదన్నది ఇప్పుడు ఒక వివాదంగా మారింది.

ఆ సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ నేత సత్యకుమార్.. ఏపీలో కూడా యుపీ లాంటి అద్భుత విజయాలకోసం కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు, సంస్థల వద్దకు
bjp-satya-vja-file-photo వెళ్లి పార్టీ లక్ష్యాలు వివరించి ఏపీలో పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేద్దామని ప్రతిన చేయించారు. సభ ముగిసిన తర్వాత సత్యకుమార్ సహా నేతలైతా వెళ్లిపోగా, మరికొందరు ఆరోజు మంగళగిరిలో జరిగిన ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన అగ్రనేతలు మాత్రం ఆరోజు రాత్రి విజయవాడలోనే బస చేశారు.

కాగా సత్యకుమార్ సన్మాన కార్యక్రమం వేదికపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, అధ్యక్షుడు నద్దా ఫొటోల పక్కన సోము వీర్రాజు ఫొటో లేదన్న విషయం, బెజవాడకు చెందిన కొందరు నేతలు ఆయనకు చేరవేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో బీజేపీలోని ఒక వర్గం సోముకు వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించారని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. నిజానికి ఈ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్వహకుడు జెపి, పార్టీ అధ్యక్షుడు సోముకు సమాచారం పంపించినప్పటికీ, ఆయన రాజమండ్రిలో జరిగిన కిషన్‌రెడ్డి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అదేవిధంగా సంఘటనా మంత్రి మధుకర్‌కు సైతం సన్మాన కార్యక్రమం గురించి ముందే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

తనకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారని భావించిన సోము, కొద్దిరోజుల తర్వాత జయప్రకాష్‌ను దళితమోర్చా ఇన్చార్జి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తన ఫొటో లేకపోవడంతో చాలామంది నాయకులు బాధపడి, పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే జెపిని ఇన్చార్జి పదవి నుంచి తొలగించాలని పార్టీ పెద్దలంతా, ‘పైవారి’ ఆదేశాలతో ‘సమిషి’్టగా నిర్ణయించినట్లు సోమువీర్రాజు ఎస్పీమోర్చా ఇన్చార్జి జెపికి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ ఆ ‘పైవారు’, ‘సమిష్టి నిర్ణయం’ఏమిటన్నది ఎవరికీ తెలియని బ్రహ్మరహస్యం.

అయితే ఈ విషయం పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సత్యనారాయణ దృష్టికి గానీ, కోర్‌కమిటీ దృష్టికి గానీ తీసుకురాకుండానే రాష్ట్ర అధ్యక్షుడు.. ‘పైవారి’ ఆదేశాల పేరిట ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని సీనియర్లు విమర్శిస్తున్నారు. కనీసం జెపికి నోటీసు కూడా ఇవ్వకపోవడం ఒక తప్పయితే, పార్టీకి సంబంధం లేని కార్యక్రమంపై నిర్ణయం తీసుకోవడం తమల అధ్యక్షుడు చేసిన మరొక తప్పని, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు.

క్రమశిక్షణా రాహిత్యం కిందకు రాదు.. కానీ: సత్యనారాయణ
bjp-jpజయప్రకాష్ వ్యవహారం పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కిందకు రాదని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. ‘ఇదేమీ పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కిందకు రాదు. కానీ పార్టీ నాయకులు హాజరయి, పార్టీ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడి ఫొటో పెట్టకపోవడం వల్ల కార్యకర్తలకు రాంగ్ సిగ్నల్స్ వెళతాయి కదా? ఇది గౌరవానికి సంబంధించిన వ్యవహారమే తప్ప, ఇంకేమీ లేదు. అయినా జెపికి పార్టీలో చెప్పాల్సినవాళ్లు సర్దిచెప్పారు’ అని వివరణ ఇచ్చారు. ప్రైవేటు కార్యక్రమంలో సోము ఫొటో ఎలా పెడతారని ప్రశ్నించగా, ‘‘అలాగయితే రేపటి నుంచి అంతా ఎన్జీఓల పేరుతో కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. పార్టీ లెగసీ అంటూ ఒక టి ఉంటుంది.దాన్ని కాపాడాలి కదా’ అని వ్యాఖ్యానించారు. జెపిని ఇన్చార్జి పదవి నుంచి ఎందుకు తప్పించారన్న ప్రశ్నకు ‘అది రాష్ట్ర అధ్యక్షుడి ఇష్టం. ఎవరినయినా నియమించవచ్చు’ అన్నారు. అయితే క్రమశిక్షణ కమిటీకి ఈ వ్యవహారం నివేదించారా? లేదా అన్న విషయంపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

ఎవరీ ‘పైవాళ్లు’… ఏమా కథ?
కాగా ఏపీ బీజేపీలో గత కొద్దికాలం నుంచి ‘పైవాళ్ల’ పేరిట, వారిని అడ్డుపెట్టుకుని తీసుకుంటున్న నిర్ణయాలపై, అగ్రనేతల్లో సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోము వీర్రాజు గతంలో హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో సుజనాచౌదరి-సీఎం రమేష్- పురందీశ్వరి వంటి అగ్రనేతల సమక్షంలో, దీనిపైనే సీరియస్‌గా చర్చ జరిగింది. ‘మీరు పైవాళ్ల పేరిట నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ పైవాళ్లువరో మాకూ చెప్పండి. మనమంతా ఆ పైవాళ్లతో మాట్లాడదామ’ని కోరగా, సోము మౌనం వహించాల్సి వచ్చింది.

రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కో ఇన్చార్జి సునీల్ దియోధర్ తరచూ చెప్పే ఆ ‘పైవాళ్లు’ ఎవరో ఢిల్లీలో అమిత్‌షా వద్ద తేల్చుకుందామని సుజనా చౌదరి, సీఎం రమేష్, పురందీశ్వరిలు పట్టుపట్టారు. దానికోసం అంతా కూర్చుని ఒక అజెండాతో అధిష్టానం వద్దకు వెళదామన్న సుజతా ప్రతిపాదనపై సోము మౌనం వహించాల్సి వచ్చింది.

తమకు ఇష్టం లేని నాయకులను పక్కకుజరిపే క్రమంలో సోము-సునీల్ తరచూ తమకు పైనుంచి ఆదేశాలు వస్తున్నాయని చెబుతున్నారే తప్ప, ఆ పైవాళ్లెవరో ఇప్పటివరకూ తమకు గానీ, కోర్ కమిటీకి గానీ చెప్పలేదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ‘‘పైవాళ్లంటే నాయకులంతా భయపడి సైలెంటయిపోతారన్నది వారి వ్యూహం. ఆ పైవాళ్లెవరో చెప్పాలని అడిగే ధైర్యం జిల్లా నేతలు చేయరు. జిల్లా స్థాయి నాయకుల విషయంలో అయితే ఆ వ్యూహం వర్కవుటవుతుందని అనుకోవచ్చు. కానీ రాష్ట్ర, జాతీయ నాయకుల విషయంలోనూ అదే మంత్రం వేస్తే ఎలా? ఈరోజు జెపిని తప్పించారు. రేపు మరొకరిని తప్పిస్తారు. జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హాజరైన కార్యక్రమానికే ఆంక్షలు విధిస్తు, ప్రతీకార నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఈ పార్టీని వీళ్లు ఎక్కడకు తీసుకువెళుతున్నారో అర్థం కావడం లేదు. ఈ పైవాళ్లెవరో, అధ్యక్షుడికి ఆదేశాలిస్తున్నదెవరో మేం ఢిల్లీలోనే తేల్చుకుంటాం. పార్లమెంటు సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళతాం. ఈ తరహా నాయకులకు ఢిల్లీలో అపాయింట్‌మెంట్లే ఇవ్వరు. ఇక వీరికి ఫోన్ చేసి ఆదేశాలు ఎవరిస్తార’ని పార్టీలో దశాబ్దాల నుంచి పనిచేస్తున్న ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.

మధుకర్ మౌనమేల?
పార్టీకి సరైన దిశానిర్దేశం చేయాల్సిన ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ (సంఘటనా మంత్రి) మధుకర్ కూడా, తొలినుంచీ తనకేమీ పట్టనట్లు మౌనంగా ఉండటంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన సోమువీర్రాజు వర్గానికి మద్దతుదారుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుందే తప్ప, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న దాఖలాలు కనిపించడం లేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తాజా ఘటనపై కోర్‌కమిటీని సమావేశపరచి విచారణ జరపాల్సిన మధుకర్, రాష్ట్ర పార్టీ కో ఇన్చార్జి సునీల్ దియోధర్ మౌనంగా ఉండటం బట్టి.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో వారిద్దరూ క్రియాశీలకంగా పనిచేయడం లేదన్న విషయం స్పష్టమవుతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.