ఆ పాపం చంద్రబాబుదే

– తన దోపిడీ కోసమే ఎన్ సీసీ భూములకు చంద్రబాబు జీపీఏ చేశారు
– చంద్రబాబు తప్పుడు పనులపై టీడీపీ వాళ్ళు ధర్నాలు చేయాలి
– కేబినెట్ నిర్ణయాన్ని మార్చే అధికారం లేదని అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబుకు తెలియదా..?
– మధురవాడ ఎన్ సీసీ భూములపై చంద్రబాబే సమాధానం చెప్పాలి
– రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
విశాఖపట్నంలోని మధురవాడ లో ఉన్న ఒక భూమిని ఎన్ సీసీ సంస్థకు ప్రభుత్వం ధారాదత్తం చేసిందని, తెలుగుదేశం పార్టీ ఉండి ఉంటే తాము ఉద్దరించేసేవాళ్లమని, ప్రభుత్వానికి లాభం చేకూర్చేవారమని, దానిపై నిర్ణయం తీసుకుంటే శాశ్వతంగా ధర్నాలు చేస్తామని రెండు రోజుల నుంచి పలురకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ చేస్తున్న విమర్శలనే ఈరోజు ఈనాడు పత్రికలో మూడొంతుల పేజీని ఈ వార్తకు కేటాయించి ప్రచురించారు.

ఈ వ్యవహారానికి సంబంధించి, గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు గానీ, ఈ అంశంలో చంద్రబాబు చేసిన తప్పుడు పనుల వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టాన్నిగానీ వీళ్ళు ప్రస్తావించటంలేదు. దోచుకోవడంలో చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం తెలియక, పాపం స్థానిక టీడీపీ నాయకులు అమాయకుల్లా, ఆయన చెప్పినదానికి తందానా అంటూ ధర్నాలు చేస్తున్నారు. వాస్తవానికి, ఈ భూమి వ్యవహారంలో చంద్రబాబు చేసిన అరాచకాలు వాళ్లకు ఏమి తెలుసు?.

ఈ భూమికి సంబంధించిన వాస్తవాలను, పూర్వాపరాలను జీవోలు, సాక్ష్యాధారాలతో సహా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వివరించారు.మధురవాడలో ఎన్‌సీసీకి ఇచ్చిన భూమి ఏదైతే ఉందో.. దానిని 2005 అక్టోబర్‌ 10వ తేదీన పీపీఏ మోడల్ లో ఆనాటి ప్రభుత్వం, అంటే అప్పట్లో ఆ ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉండి, పారదర్శకంగా టెండర్లు పిలిస్తే ఆరుగురు టెండర్లలో పాల్గొన్నారు. అందులో నలుగురు షార్ట్‌ లిస్ట్‌ అయితే అందులో ఎన్‌సీసీ సంస్థ ఎల్‌-1 గా నిలిచింది. నిర్దేశించిన అంశాలను చేయడానికి ఆ సంస్థ 31.12.2005లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ రూ. 93 కోట్లు ప్రభుత్వానికి చెల్లింపులు చేసింది 2007లో.

ఎన్ సీసీ భూమి వ్యవహారంలో ఏ చర్చకు అయినా సిద్ధం
ఆ రోజు తీసుకున్న నిర్ణయం మేరకు ఆ భూమిని డెవలప్‌చేసి, బిల్డింగ్‌లు కట్టి 16శాతాన్ని ప్రభుత్వానికి ఇచ్చి, మిగతాది ఆ సంస్థ అమ్ముకునేట్లు అగ్రిమెంట్‌ జరిగింది. 97 ఎకరాల 30 సెంట్ల భూమికి సంబంధించి ప్రభుత్వంతో జరిగిన అగ్రిమెంట్‌ ప్రకారం రూ.93కోట్లు కూడా చెల్లించారు. 2009లో ఛెయింజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌కు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు అన్నికూడా సరిగ్గా ఉన్నాయని పట్టణ, మున్సిపల్‌ శాఖ మంత్రిగా నేను చెబుతున్న మాట ఇది. ఎవరికి అయినా, ఏమైనా అనుమానాలు ఉన్నా, మీడియాకు గానీ, రాజకీయ పార్టీల వారు గానీ నన్ను అడిగితే వారి అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు అని బహిరంగంగా చెబుతున్నాను.

2013లో ఉన్న అప్పటి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. భూమి ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్‌ కాదు. ఒప్పందం రద్దు చేసుకుంది ఆయన ప్రభుత్వం కాదు. ఏజీకి న్యాయ సలహా కోసం దాన్ని పంపించారు. ఒప్పందాన్ని రద్దు చేసేకంటే ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని, అలా చేస్తే ప్రభుత్వానికి మంచిదని అప్పటి ఏజీగారు సలహా ఇచ్చారు. దాంతో ఆ ప్రాజెక్టు అలాగే ఉంది. దీనిపై ఎన్‌సీసీ సంస్థ హైకోర్టుకు వెళ్లడంతో, న్యాయస్థానం స్టేటస్‌ కో ఇచ్చింది.

చంద్రబాబు తప్పుడు పనులపై టీడీపీ వాళ్ళు ధర్నాలు చేయాలి
అయితే, ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు చేసిన బాగోతం ఇక్కడ బయట పెట్టాలి.2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019లో, అంటే సాధారణ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్‌సీసీ సంస్థ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరస్పర ఒప్పందం చేసుకోవడం.. ఆ తర్వాత ప్రభుత్వం జీవో నెం.121ని 16.03.2019న విడుదల చేసింది.

దీనిపై ఇద్దరు సభ్యుల కమిటీని వేసి, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 16శాతానికి ధర కట్టి ఎన్‌సీసీ సంస్థ నుంచి దాన్ని తీసుకుని … ఆ ధరతో ఫ్రీహోల్డ్ చేయాలని కేబినెట్‌లో పెట్టి దాన్ని ఆమోదించింది. తర్వాత ఆ ఫైల్‌ ముఖ్యమంత్రిగారి దగ్గరకు వచ్చింది. మళ్లీ ఎన్‌సీసీ సంస్థ ఆ భూమికి రిజిస్ట్రేషన్‌ చేస్తే స్టాంప్‌ డ్యూటీ పెరిగిపోతుందని, అందువల్ల జీపీఏ ఇవ్వాలని, చంద్రబాబు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది. దాంతో 16.03.2019లో చంద్రబాబు జీపీఏ ఇచ్చి… దాన్ని డెవలప్‌ చేసిన తర్వాత ఆ భూమిని ఎవరు కొనుక్కుంటే వాళ్లకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ తతంగం అంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎగ్గొట్టడానికి కారణాన్ని ఇనీషియేట్‌ చేసింది చంద్రబాబు నాయుడే.ఇందుకు, స్థానిక టీడీపీ నేతలు ధర్నాలు చేయాల్సింది- మా ప్రభుత్వం మీద కాదు, చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు పనులకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలి.

కేబినెట్ నిర్ణయాన్ని కాదని చంద్రబాబు ఏకపక్షంగా ఎలా ఉత్తర్వులిస్తారు..?
2019లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ భూమి వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయ సలహా కోసం అడ్వకేట్‌ జనరల్‌కు కూడా పంపించాం. ఏజీ ఇచ్చిన వివరణ ఏంటంటే.. ఒకసారి కేబినెట్‌ లో తీసుకున్న నిర్ణయాన్ని మార్పులు, చేర్పులు చేయాలంటే తిరిగి మంత్రివర్గమే చేయాలి తప్ప, వ్యక్తిగతంగా అప్పడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు మార్చడానికి ఎలాంటి అధికారం లేదని స్పష్టంగా చెప్పారు. నేను కూడా అప్పుడూ, ఇప్పుడూ కేబినెట్‌ మంత్రిగా ఉన్నాను. ఈ భూమి వ్యవహారంపై ఇప్పుడు ధర్నాలు చేసిన వాళ్లలోనూ కేబినెట్‌ మంత్రులుగా పనిచేసినవాళ్లు ఒకరో, ఇద్దరో ఉన్నారు.

ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్‌ డ్యూటీ తగ్గించుకోవడానికి, ఫ్రీహోల్డ్ చేసుకోవడానికి డెవలపర్‌ సంస్థ దరఖాస్తు పెట్టుకుంటే చంద్రబాబు ఏవిధంగా ఒక సంతకం పెట్టి చేస్తారు? కేబినెట్ నిర్ణయం లేకుండా చేయడం తప్పు కాదా?

ఈ అంశం మా ప్రభుత్వం ముందుకు వస్తే… కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ మంత్రివర్గమే చేయాలి తప్ప, సీఎంగా చంద్రబాబు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశమే లేదని మేము స్పష్టం చేశాం. కేబినెట్‌ నిర్ణయం తీసుకోక ముందు అయితే ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఆ తర్వాత కేబినెట్‌కు పంపిస్తారు. బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం… కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మార్చడానికి వీల్లేదనే విషయం ఇంత పెద్ద మేధావి అయిన చంద్రబాబుకు కూడా తెలుసు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, రూ. 100కోట్లను అప్పనంగా ఎన్‌సీసీ సంస్థకు ఇవ్వడానికి ఎలా సిద్ధం అయ్యారు? ఆ విషయాలు అన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అసలు తెలుసా?. నేను చెబుతున్న ప్రతి దానికి జీవోలు, ఆధారాలు ఉన్నాయి.

చంద్రబాబు దోపిడీ కోసం కాదా..?
అప్పట్లో కేబినెట్‌ నిర్ణయాన్ని చంద్రబాబు ఎందుకు వెనక్కి తోడారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బును ఎందుకు ఆ సంస్థకు జీపీఏ ఇస్తూ ఆర్డర్‌ ఇచ్చారు. ఇది చంద్రబాబు దోపిడీ కోసం కాదా? ఇవి వాస్తవాలు కాదని చంద్రబాబు నాయుడుని చెప్పమనండి. ఇందుకు సంబంధించి అప్పట్లో జీవోలు జారీ చేసిన, అప్పటి మంత్రిని అయినా ఇవి అబద్ధాలు అని చెప్పమనండి. ప్రజలను తప్పుదోవ పట్టించి, మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పమనండి.

మీరు తప్పుడు పని చేసి, భూములను అడ్డంపెట్టుకుని మీరే దోచుకోవడానికి ప్రయత్నించి, దోపిడీ చేసి … మళ్లీ తగుదనమ్మా అంటూ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తూ, నంగనాచి కబుర్లు చెబుతారా? ప్రజలు నవ్విపోతారు.

తెలుగుదేశం పార్టీకి ఒకటే చెబుతున్నాం. ఏదైనా ఒక అంశంపై ధర్నాలు చేసేటప్పుడు, దాని పూర్వపరాలు, వాస్తవాలు ఏమిటో తెలుసుకుని చేయండి. మా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. మా ముఖ్యమంత్రి జగన్ చాలా పారదర్శకంగా ఉంటారు. తప్పు జరిగితే ఒప్పుకోరు. ఆయన దృష్టికి వస్తే క్షమించే సమస్య లేదు. అందులో ఎలాంటి తేడా లేదు. దీనిపై మూడు రోజుల నుంచి టీడీపీ రచ్చ చేస్తోంది. చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దాలనే కదా మా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇలా అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు?పోనీ, నేను చెప్పినవాటిల్లో ఏమైనా అసత్యాలు ఉంటే, మీ అనుమానాలను నివృత్తి చేయడానికి, వాస్తవాలను మీ ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రండి.

మా ప్రభుత్వం చేసిన తప్పేంటి..?
టూ మెన్‌ కమిటీ ఎవల్యూషన్‌ చేస్తే, దాని విలువను ఎన్‌సీసీ సంస్థ కడితే రిజిస్ట్రేషన్‌ చేయడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాం. ఇందుకు సంబంధించి జీవో నెం.67ను విడుదల చేశాం. ఏదైనా చట్టప్రకారం జరగాలని, చట్టాన్నీ డీవియేట్‌ చేయడానికి వీల్లేదని ఒక ఆర్డర్‌ ఇచ్చాం. దాని ప్రకారం ఆ సంస్థతో రూ.97కోట్లు కట్టించుకుని ఆర్డర్‌ ఇచ్చాం. 2005లో కట్టిన 90కోట్లు, మరోసారి ఇప్పుడు రూ.97 కోట్లు కట్టించుకుని, మొత్తం కలిపి 187కోట్ల 97 లక్షల రూపాయిలతో పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు అదనం. ఇందుకు సంబంధించి మా ప్రభుత్వం 21.12.2020లో ఆ సంస్థకు ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏం తప్పు ఉందో చెప్పమనండి.

ప్రాజెక్ట్‌ ఇన్‌టైమ్‌లో పూర్తి చేయనప్పుడు రెండు ఆప్షన్లు ఉంటాయి. 1. వాళ్లు కట్టిన డబ్బులు ఆర్బిట్రేషన్‌ చేయడం. 2. వాళ్ల డబ్బులను వడ్డీతో కలిపి ఇచ్చేయడం.
చంద్రబాబు నాయుడు దోపిడీ, తన స్వార్థం కోసం చేసిన అవినీతి తప్ప…. ఇందులో మా స్వార్థం లేదు. ప్రభుత్వ భూములు లిటిగేషన్‌లో పడకూడదని, ప్రభుత్వానికి నష్టం రాకూడదని, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లిటిగేషన్‌లోకి వెళ్లకూడదని మంచి నిర్ణయం తీసుకున్నాం.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా, వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం తప్పు అని, ఆయనకు తెలిసి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే వ్యవస్థను భ్రష్టు పట్టించడమే. అందుకే ఇవాళ మేం వచ్చాక, ప్రభుత్వానికి నష్టం జరగకుండా నిర్ణయం తీసుకున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
జీఆర్‌పీ ఎవరో మాకు తెలియదు. మేం ఎన్‌సీసీకి మాత్రమే చేశాం. సింగపూర్‌ కంపెనీ ఏంటో మాకు తెలియదు. మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.
మీడియా కూడా లేనిదాన్ని ఉన్నదన్నట్లుగా ప్రచారం చేయడం సరికాదు. రూ. 1500 కోట్లు అని ముద్ర వేయడం కాదు. ఏం మాటలు, ఏం రాతలు అవి..?

మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నేను చెప్పిన ప్రతి అంశం పారదర్శకంగా ఉంది. ఎన్‌సీసీ సంస్థతో ఈ ఒప్పందాన్ని రద్దు చేయవచ్చు కదా అని అడుగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తన స్వార్థంతో కేబినెట్‌ నిర్ణయాన్ని కాదని, జీపీఏ ఇచ్చి ఆ సంస్థకు మేలు చేశారు. కోర్టులో స్టేటస్‌ కో మెయిన్‌టైన్‌ చేయడం, టూ మెన్‌ కమిటీ ఇచ్చిన వాల్యూ ప్రకారం గతంలోవి రూ.90కోట్లు, ఇప్పుడు రూ.97కోట్లు కట్టి దానితో రిజిస్ట్రేషన్‌ చేయమని ఇచ్చిన సలహా ప్రకారమే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. బిజినెస్‌ రూల్ప్‌ ఉంటాయి. మీరు చేసేయాలంటే చేయడానికి అవ్వదు కదా. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం.
టీడీపీ ఏ ధర్నాలు చేసినా … మీకు వత్తాసు పలుకుతున్న ఈనాడు, ఏబీఎన్‌, టీవీ5లు దీనిని పట్టుకుని వేలాడినా, మాకెలాంటి అభ్యంతరం లేదు.