నాలుగేళ్ళలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 1,20,875 కోట్లు

-రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: గడచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి కేంద్ర పన్నులలో వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 20 వేల 875 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలపారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు, 2018-19 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల వరకు ప్రత్యక్ష పన్నుల కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి వచ్చిన నికర వసూళ్ళు లక్షా 29 వేల 267 కోట్ల రూపాయలని ఆయన తెలిపారు.

ఇది కాకుండా పైన తెలిపిన నాలుగు ఆర్థిక సంవత్సరాలలో జీఎస్టీ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి వసూలైన మొత్తం లక్షా 11 వేల 312 కోట్ల రూపాయలని చెప్పారు. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి వసూలైన మొత్తం రెండు లక్షల 40 వేల 579 కోట్ల రూపాయలు. ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం వసూలు చేసిన పన్నులలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా ఇచ్చింది లక్షా 20 వేల 875 కోట్ల రూపాయలని మంత్రి గణాంకాలతో సహా వివరించారు.