అనంతపురం : అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి తనకు న్యూడ్ కాల్స్ చేసి వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఒక వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు విశాఖపట్టణం సైబర్ క్రైమ్ పోలీసులు గత నెల 22వ తేదీనే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ పట్టణానికి చెందిన ఒక మహిళను అనంత పురం జైలర్ సుబ్బారెడ్డి, వేధిస్తున్నట్లుగా విశాఖ సైబర్ క్రైమ్ సెల్ పోలీసులకు గత నెలలోనే ఫిర్యాదు అందింది. ఈ దర్యాప్తులో భాగంగా బాధితురాలు ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన విశాఖ పోలీసులు ఆ వేధింపులు నిజమేనని నిర్ధారించుకున్నారు.
విశాఖలో విచాణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే మూన్నాలుగు సార్లు విశాఖ పోలీసులు అనంతపురం జైలర్ సుబ్బారెడ్డికి నోటీసులు జారీచేశారు. అయితే, ఆ నోటీసులకు జైలర్ సుబ్బా రెడ్డి స్పందించకపోవడంతో ఆయన్ను వెతుక్కుంటూ విశాఖ నుండి ఒక పోలీసుల బృందం అనంతపురం చేరుకుంది.
కానీ అప్పటికే జైలర్ సుబ్బారెడ్డి తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుండి ఆయన ఆచూకీ లేకపోవడంతో విశాఖ పోలీసు కమిషనర్ శంఖబ్రత బగ్చీ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఒక లేఖ రాశారు. మహిళపై వేధింపుల కేసు విచారణలో అనంతపురం జైలర్ తమకు సహకరించడం లేదని సీపీ బగ్చీ తన లేఖలో పేర్కొన్నారు.
పోలీసు శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్న సుబ్బారెడ్డి వ్యవహారం గురించి, ఆయన తప్పించుకు తిరుగుతున్న తీరు గురించి ఆ లేఖ ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా అందుతోన్న సమాచారం ఏంటంటే, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న సుబ్బారెడ్డి ఏప్రిల్ 9న విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
అయితే, యాంటిసిపేటరీ బెయిల్‌తో తమ ముందుకు వచ్చిన సుబ్బారెడ్డికి 41A Crpc కింద నోటీసులు ఇవ్వడం జరిగిందని వైజాగ్ సీపీ శంఖ బ్రత బగ్చీ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగు తోందని బగ్చీ మీడియాకు చెప్పారు.