Suryaa.co.in

Telangana

లక్ష మందితో నాగర్ కర్నూలులో జేపీ నడ్డా సభ

-ఉమ్మడి పాలమూరులో బీజేపీ దమ్ము చూపిద్దాం
-కాంగ్రెస్ ను జాకీ పెట్టినా లేపినా లేచే పరిస్థితి లేదు
-పార్లమెంట్ లోపల, బయట బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి
-ఏం సాధించారని నీళ్ల సంబురాలు?
-ఇప్పటికీ వేలాది గ్రామాల్లో నీళ్లు కొనుక్కొని ఎందుకు తాగుతున్నారు?
-నేను పాదయాత్ర చేసిన 80 శాతం గ్రామాల్లో మంచి నీళ్లు లేక జనం అల్లాడుతున్నరు
-మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టిందనడం పచ్చి అబద్దం
-గుజరాత్ మోడల్ ను కాపీ కొట్టింది కేసీఆర్ సర్కారే
-2105లో కేసీఆర్ కొడుకు బృందం గుజరాత్ లో పర్యటించి మిషన్ భగీరథ ను రూపొందించింది నిజం కాదా?
-కేసీఆర్ కొత్త సచివాలయానికి ఎందుకు రావడం లేదో చెప్పాలి
-అధికారం కోసం ఎంతకైనా దిగజారే నీచుడు కేసీఆర్
-అవినీతికి పాల్పడుతున్న వారిని కేంద్రం ఉపేక్షించబోదు
-సీబీఐ, ఈడీ దర్యాప్తులో బీజేపీ జోక్యం ఉండదు
-అవినీతిపరులను జైల్లో వేయడం ఖాయం
– లాబీయింగ్ చేస్తే టిక్కెట్లు రావు
-కష్టపడి పనిచేసే వారికే టిక్కెట్లు ఇస్తాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
-నాగర్ కర్నూలులో పార్టీ కార్యకర్తలతో బండి సంజయ్ భేటీ
-జేపీ నడ్డా బహిరంగ సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం

ఈనెల 25న నాగర్ కర్నూలులో లక్షమందితో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. తద్వారా పాలమూరు పార్లమెంట్ పరిధిలో బీజేపీ సత్తా చాటేందుకు సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితం నాగర్ కర్నూలులో జేపీ నడ్డా బహిరంగ సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, కోశాధికారి శాంతికుమార్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల అధ్యక్షులతోపాటు పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. పాలమూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి జన సమీకరణపై ఆయా నియోజకవర్గాల నాయకుల నుండి అభిప్రాయాలను సేకరించారు. ప్రతి నియోజకవర్గం నుండి వేల సంఖ్యలో జనాన్ని తరలించేందుకు నాయకులు మందుకొచ్చారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….

ఖమ్మంలో అమిత్ షా హాజరయ్యే సభకు పెద్ద ఎత్తున జనం వచ్చేవాళ్లు. ఖమ్మంలో బీజేపీ లేదనే వాళ్లకు పార్టీ దమ్మేందో చూపించాలనుకున్నం. అందుకోసమే గతంలో చంద్రబాబు, కేసీఆర్ నిర్వహించిన సభల కంటే ఎక్కువ జనం పట్టేలా పెద్ద మైదానాన్ని ఎంపిక చేశాం. 2 లక్షల వరకు జనం వస్తారని అంచనా వేశాం. సెక్లోన్ వల్ల అనివార్యంగా మీటింగ్ వాయిదా పడింది. తప్పకుండా అతి త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించి తీరుతాం. మన దమ్మేందో చూపిద్దాం.

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మడం లేదు. బీజేపీనే నమ్ముతున్నారు. ఇది తెలిసే కేసీఆర్ కొద్దిరోజుల నుండి కాంగ్రెస్ ను లేపేందుకు ప్రయత్నిస్తున్నడు. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ను లేపడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలనే కుట్ర చేస్తున్నడు. ప్రజల తరపున కొట్లాడుతూ జైలుకు వెళుతున్న పార్టీ బీజేపీదే. కేసీఆర్ కు బీజేపీ పేరు వింటేనే గజగజ వణికి పోతున్నడు.

మీడియాలో మాత్రం కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నరు. అసలు కాంగ్రెస్ యాడుంది? ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు డిపాజిట్లే గల్లంతవుతున్నయ్. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయి. కలిసే పోటీ చేయబోతున్నాయి.

ఇయాళ సిగ్గు లేకుండా నీళ్ల సంబురాలు చేసుకుంటున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లందిస్తే ఇప్పటికీ గ్రామాల్లో మంచి నీళ్లు కొనుక్కొని ఎందుకు తాగుతున్నారు. నేను పాదయాత్ర చేసిన 80 శాతం గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్నరు.

మిషన్ భగీరథను చూసి కేంద్రం కాపీ కొట్టి హర్ ఘర్ జల్ స్కీం ను ప్రవేశపెట్టిందని కేసీఆర్, కేటీఆర్ చెప్పడం చూస్తే నవ్వొస్తోంది. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం అద్బుతంగా ఇంటింటికీ మంచి నీళ్లు అందిస్తుందని తెలిసి 2015లోనే కేటీఆర్ బ్రుందం గుజరాత్ లో పర్యటించిన సంగతి మర్చిపోయారా?

తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రజలు బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పడానికి సిద్ధమైనరు. పోరాటాలు చేస్తున్న బీజేపీకి అధికారం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోంది. కర్నాటక ఫలితాలతో బీజేపీ గ్రాఫ్ దెబ్బతిన్నదంటూ చెప్పడం దుష్ప్రచారమే. కర్నాటకకు, తెలంగాణకు ఏం సంబంధం?

ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయానికి కూడా రావడం లేదు. 14 రోజులైంది రాక. ఆయన ఎందుకు రావడం లేదు? మంచిగ ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కమీషన్ల కోసం కొత్తది కట్టిండు. 600 కోట్ల అంచనా వ్యయాన్ని రూ.1600 కోట్లకు పెంచి పైసలు దొబ్బిండు. ఇక సచివాలయంతో పనిలేదు.

ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేనే రోజువారీ కార్యక్రమాలపై షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాం. మరి సీఎం షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేయరు. ఎందుకంటే కేసీఆర్ 9 ఏళ్లుగా ప్రగతి భవన్ నుండి ఫాంహౌజ్ పోవడం తప్ప చేసిందేమీ లేదు.

నన్ను టార్గెట్ చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నడు. క్షుద్ర పూజలు కూడా చేస్తున్నడు. నన్ను ఇటీవల అరెస్ట్ చేసి కేసీఆర్ ఫాంహౌజ్ వైపు తీసుకెళ్లారు. ఆయన ఎన్ని క్షుద్ర పూజలు చేసినా నన్నేమీ చేయలేదు. నేను అమ్మవారి భక్తుణ్ని. అమ్మవారి ఆశీస్సులున్నయ్. ప్రజల మద్దతుంది.

బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసిండు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో వివరాలతోసహా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మీకు దమ్ముంటే ఆ వివరాలపై చర్చకు సిద్దమా? పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ చర్చకు సిద్ధమా?

అధికారం కోసం ఎంతకైనా దిగజారే నీచుడు కేసీఆర్. ఆయనతోసహా అవినీతికి పాల్పడే వారిని నరేంద్రమోదీ ప్రభుత్వం వదిలపెట్టే ప్రసక్తే లేదు. సీబీఐ వంటి సంస్థలు ఆ పని చూస్తున్నాయి. అవినీతిపరులను జైల్లో వేస్తాయి. అందులో బీజేపీ జోక్యం ఉండదు. మనం మాత్రం పార్టీని బలోపేతం చేయడంపైనే ద్రుష్టి సారించాలి.

నాతోసహా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా వ్యక్తులతో పనిలేకుండా పార్టీ సింబల్ పై పోటీ చేస్తే గెలిచేలా క్రుషి చేద్దాం. పార్టీకి ద్రోహం చేసినోడు బాగుపడరు. పార్టీకి నష్టం చేయడమంటే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్లకు మాత్రమే పదవులు, టిక్కెట్లు వస్తాయి.

బీజేపీలో లాబీయింగ్ పనిచేస్తే టిక్కెట్లు రావు. ఎవరు కష్టపడి పనిచేస్తారో, ప్రజల్లో ఉంటారో వాళ్లకే టిక్కెట్లు ఇస్తాం. అందరం తెలంగాణలో రాక్షస రాజ్యాన్ని అంతం చేద్దాం. రామరాజ్యాన్ని స్థాపిద్దాం. అందులో భాగంగా ఈనెల 22న ఇంటింటికీ బీజేపీ పేరుతో పోలింగ్ బూత్ లలో తిరిగి ప్రజలను కలిసి మోదీ 9 ఏళ్ల పాలనలో జరిగిన మేలుపై కరపత్రాలను పంపిణీ చేయాలి.

LEAVE A RESPONSE