మనకు “ఎలక్షన్లు” జరిగేది ఎప్పుడైనా… ఎక్కడైనా… అది అసెంబ్లీకైనా, పార్లమెంటుకైనా, స్థానిక సంస్థలకైనా, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ‘జీ.హెచ్.ఎం.సీ’.కైనా… అవి ఎప్పుడు, ఏ ఎలక్షన్లు అయినా కూడా… తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎప్పుడు ‘ఎలక్షన్లు’, అని అన్నప్పుడల్లా “ఆంధ్రా-సీమాంధ్ర సెటిలర్లు!” ఎటువైపు…! ఎవరివైపు…! వారి ఓట్లు ఎవరికి…! వారి మొగ్గు ఎటువైపు…!… వారు, ఈ సారి ఎవరికి ముగ్గు వేస్తారు…!… ఎవరు, ఎవర్ని, ఎలా ముగ్గులోకి దింపుతారు…!…’ అనే పనికిమాలిన సొల్లు, చెత్త, సుత్తి మాటలు చాలాకాలంగా వార్తల్లో ఉంటున్నాయి…!
నిన్న – మొన్నటి… “కాంగ్రెస్” పార్టీ అనూహ్య గెలుపులో ఆంధ్రా – సీమాంధ్ర సెటిలర్స్! పాత్ర – ప్రాధాన్యత ఉందా – లేదా…? ఆంధ్రా ప్రాంతం బోర్డర్ గా ఉన్న ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల వంటి చోట్ల, చాలా జిల్లాల వ్యాప్తంగా, కాంగ్రెస్ గెలుపులో ఆంధ్రా – సీమాంధ్ర వాళ్ల పాత్ర – ప్రాధాన్యత – ప్రాతినిధ్యం ఎంత…? అనేదాని మీద తమకు తామే మేధావులు గా ఫీలయ్యే కొందరు సోదిగాళ్ళ, వివిధరకాల సుత్తి వ్యాఖ్యలు – సొల్లు విశ్లేషణలు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి….!
దీనితో ఆగకుండా, ఆంధ్రా – సీమాంధ్ర సెటిలర్లు! ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ – రంగారెడ్డి – మెదక్ జిల్లాల చుట్టుపక్కల భా.ర.సా. అత్యధిక సీట్లు గెలవటం చూసి ఆశ్చర్యపోతున్నారు మరికొందరు కుహానా టీ.వీ. చర్చా మేధావులు…? కొన్ని పార్టీలకి, ఇక్కడ క్యాడర్ – ఓటు బ్యాంకు పోయి చాలా కాలం అయ్యింది కదా…! ఇప్పుడు, కనీసం డిపాజిట్లు దక్కటానికి కూడా ఏమిటి కారణం…? కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఏమిటవి…!!! దశాబ్ద కాలంగా, కొన్ని పార్టీల క్యాడర్ – ఓటు బ్యాంక్ కూడా వేరే పార్టీలకు వలస వెళ్లిపోయింది కదా…! అని ఒకటే పనికిమాలిన చర్చలూ…! రచ్చలూ…! వికృత చర్చా-గోష్ఠులు…!
కొన్ని సంవత్సరాల క్రిందట జరిగిన జీ.హెచ్.యం.సీ. ఎన్నికలలో కూడా, కొన్ని పార్టీలకు చాలా హీనంగా, బలహీనంగా, పేలవంగా ఉన్న ఫలితాలు, ఇంత తొందరలోనే ఇలా, ఎలా మారతాయి…! అలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా, ఇప్పుడు గౌరవంగా డిపాజిట్లు అయినా దక్కించుకోవటమే కాకుండా, గణనీయ సంఖ్యలోనే ఓట్లు
పెంచుకొన్నదంటే ఆ క్రెడిట్ కూడా “ఆ సెటిలర్!” ఓటర్లదేనా…! సెటిలర్స్ ఓటింగ్ ఎవరి వైపు…? వారి ఓటింగ్ సరళి ఎటువైపు…? ఎన్ని ఓట్లు…? ఎవరికి ఎన్ని వేశారు…? ఎవరికి – ఎన్ని ఓట్లు వచ్చాయి…? అంటూ… వివిధ వర్గాల ఓటర్ల ఓటింగ్ పై నానా రకాలుగా, ఒకటే అర్థంకాని విశ్లేషణలూ…!… అర్థంలేని వివరణలూ…!
వీరు అంటున్న సెటిలర్లలో! కూడా, టీడీపీ, వైసీపీ, జనసేన, భారసా, బి.జె.పి., బి.ఎస్.పి., కమ్యూనిస్ట్…etc అన్ని పార్టీలలో సకల పార్టీల సొంత అభిమానులు – అనుచరులు ఉన్నారు కదా…! ఉంటారు కదా…! గంప గుత్త గా ఒక వర్గం వాళ్ళ ఓట్లు ఒక రాజకీయ పార్టీ కే పడతాయి లేదంటే ఒక అభ్యర్థి కే వేస్తారు అనే వాదన కూడా సరికాదు కదా…?… ఇలా అనటం లో ఏ మాత్రం, ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…! అయినా, ఎలక్షన్స్ అన్న ప్రతీసారీ, అందరికీ టార్గెట్ అవుతూ, అందరి నోళ్లలో అదే పనిగా నానుతూ, పదే పదే పలుచన అవుతున్నామనే బాధ – ఆవేదన మాత్రం, సెటిలర్స్! గా పిలవబడుతున్న, ఆంధ్రా – సీమాంధ్ర ప్రజల్ని చాలా కాలంగా, ఎంతో బాధ పెడుతోంది…!
ఆసలు, “సెటిలర్లు!” అంటేనే “ఆంధ్రావాళ్ళు – సీమాంధ్రవాళ్ళు!” అని ఒక పరమ నీచమైన, చిల్లర అపోహ…!!! ముందుగా, ఒక్కసారి ఈ “సెటిలర్” అనే గొప్ప పదబంధం యొక్క విశిష్టమైన అర్ధం ఏమిటో తెలుసుకుందాం… “Settler” meaning: “A person who moves with a group of others to ‘Live’ in a new country or area”… ఇది ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ ప్రామాణిక ఇంగ్లీష్ డిక్షనరీ చెప్తున్న అర్థం… అంటే… “ఒక వ్యక్తి కొందరితో, ఒక సమూహంగా కలసి, ఒక కొత్త ఏరియాకో, లేదా కొత్త ప్రాంతానికో, లేక ఏదైనా కొత్త దేశానికో, బ్రతకటానికి పొతేనే వాళ్ళను “సెటిలర్లు” అని పిలుస్తారు అని దీని అర్థం…! మరి ఆంధ్రా – సీమాంధ్ర వాళ్ళను వీళ్లంతా, ఏ ప్రాతిపదికన “సెటిలర్లు!” అని పిలుస్తున్నారో, వారు సమాధానం చెప్పాలి…? “ఆంధ్రా వాళ్ళు ఏమైనా రెఫ్యూజీలా…? లేక కాందిశీకులా…? లేక వలసజీవులా…? లేక సంచార జీవనవర్గాలా…? లేక శరణార్థులా…?”, వీరు ఖచ్ఛితంగా సమాధానం చెప్పి తీరాలి…?!
ఆంధ్రా – సీమాంధ్ర వాళ్ళు ‘సెటిలర్లు!’ ఐతే ఇక ‘పర్మినెంట్ రెసిడెంట్లు’ అంటే, మరి ఇంకెవరు…?… అసలు ‘సెటిలర్’ అనే పదం వాడటమే ఒక పెద్ద బూతు ఇక్కడ…! ఇది, చాలా తప్పు…! ఆంధ్రా ప్రజలు, ఇక్కడకు బ్రతకడానికి రాలేదు…! వాళ్ళు, ఇక్కడకు వలసగా కూడా అంతకన్నా రాలేదు…! “వాళ్ళదే” అని, ఒక ముందుచూపు లేని అప్పటి ఒక కేంద్ర ప్రభుత్వం వారి స్వార్థంతో ప్రకటించిన, అప్పటి వాళ్ల రాష్ట్ర రాజధానిలో వాళ్ళు నివాసం ఏర్పాటుచేసుకుని వాళ్ల కష్టంతో, వారి బతుకు వాళ్ళు బతుకుతున్నారు…! ఐతే, ఒకే ఒక్క ప్రకటన తోనే, ఒక్క రాజకీయ నిర్ణయంతోనే, వాళ్ళు, ఎలా అంత సడన్ గా, “సెటిలర్లు!” అయిపోయారు…!? “సెటిలర్లు”గా మారిపోయారు…!?
చట్టప్రకారం, రాజ్యాంగం ప్రకారం న్యాయంగా, ధర్మంగా వారు ‘పర్మినెంట్ రెసిడెంట్లు’ మాత్రమే…! వాళ్ళ రాష్ట్రంలో, వాళ్ళు ఉండగానే, వాళ్ళను, వాళ్ళ ప్రమేయం లేకుండానే మరో కేంద్ర ప్రభుత్వం వారి రాజకీయ స్వప్రయోజనాల కోసరం, స్వార్థ అవసరాల కోసం, నీచమైన రాజకీయ లబ్ది పొందేందుకు, ఎంతో స్వార్థంతో, అధర్మంగా, అన్యాయంగా, నిర్హేతుకంగా, సమన్యాయం పాటించకుండా, వారిని రాత్రికి రాత్రే సెటిలర్లుగా, కాందిశీకులుగా, శరణార్ధులుగా, వలసవాదులుగా, సంచారజీవులుగా, రెఫ్యూజీలుగా చేసేసారు…! “సెటిలర్స్!” గా మార్చేశారు…!
ఇది ఎంతో అన్యాయం…! మరెంతో దురదృష్టకరం…! చాలా అధర్మం…! ఆంధ్రా వాళ్ళు, ఎవరి ధర్మం తోనో, భిక్ష తోనో, వెరెవ్వరి దయా – దాక్షిణ్యాల తోనో, కరుణా – కటాక్షాల మీదనో ఆధారపడి బతకడం లేదు…! ఆంధ్రా ప్రాంతం ప్రజలు, కేవలం వారి స్వయంకృషిని, శ్రమను, కష్టాన్ని, తెలివితేటలను నమ్ముకొని నిజాయతీగా వారి బతుకును వారు, ఎంతో నీతిగా బతుకుతున్నారు…!… అలాంటివారిని, కేవలం కొన్ని పార్టీల రాజకీయ అవసరాల కోసం, కొందరి స్వార్థం కోసం ఒక్క ప్రకటనతో “సెటిలర్స్!” గా మార్చేశారు…!
అందులోనూ, హైదరాబాద్ సిటీ లో సెటిలర్లు అంటేనే “ఆంధ్రా – సీమాంధ్ర” వాళ్ళే అనీ, మళ్లీ, అందులోనూ ఆంధ్రాలోని కోస్తా జిల్లాల వారే అనీ, వారితోపాటు ఉండే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు కలిపితేనే ఆంధ్రులు అనీ, మరికొందరు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్రా వాళ్ళు అనీ, రాయలసీమ వాళ్ళను కూడా కొత్తగా కలిపి సీమాంధ్రులు అనే కొత్త కోణంలోనూ, మిగతా రాష్ట్ర ప్రజలనుండి ఆంధ్రా ప్రాంతం ప్రజలను పదే-పదే, మరీ-మరీ విభజిస్తూ మాత్రమే ఇంకా చూస్తున్నారు…! మళ్లీ మళ్లీ ఆంధ్రులను విభజించి – విడగొట్టి మరీ మార్చి – ఏమార్చి చూపిస్తున్నారు…! ఆంద్రప్రదేశ్ వాసులను వారిలో, వారినే పదే-పదే మళ్లీ-మళ్లీ విభజించి – విడగొట్టి కన్ఫూజ్ చేస్తున్నారు…! ఆగం చేసేస్తున్నారు…!
మొత్తం ఆంధ్రప్రదేశ్ నుండి, కోస్తా – గుంటూరు – ప్రకాశం జిల్లాల వారితో పాటు, ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన వారు కూడా తెలంగాణ ప్రాంతంలో గణనీయ సంఖ్యలో నివసిస్తూ ఉన్నారు…! వీరితో పాటు గుజరాతీలు, పార్సీలు, సింధీలు, మరాఠీలు, పంజాబీలు, పొరుగున ఉన్న చతీస్ గఢ్ వాసులు, రాజస్థాన్ నుండి వచ్చిన మార్వాడీలు…etc. పెద్ద సంఖ్యలో ఉన్నారు. బెంగాలీలు, ఒడిస్సావారు, అస్సామీయులు, ఇతర తూర్పు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, దక్షిణాది నుండి కన్నడిగులు, తమిళులు , మలయాళీలు, ఉత్తరాది రాష్ట్రాలనుండి బీహారీలు, యూ.పీ., జార్ఖండ్, ఎం.పీ…etc అన్ని భారతదేశ రాష్ట్రాల నుండి వచ్చిన వారు కూడా, చాలా పెద్ద సంఖ్యలో, ఎంతోమంది ప్రజలు ఎన్నో లక్షలు దాటిన జనాభా కూడా ఉన్నారు… మరి వీరెవరు…? వీరిని సెటిలర్స్ అని ఎవ్వరూ, ఎందుకు అనరు…? కేవలం, ఆంధ్రా – సీమాంధ్ర వాళ్లే సెటిలర్లా!…? మిగిలిన రాష్ట్రాల వారు ఎవరు?… వారు సెటిలర్స్! కాదా…?!
తెలంగాణలోనూ, హైదరాబాద్ మహానగరంలో ఉంటున్న తెలుగు వారే కాక, మిగిలిన వారంతా మిగిలిన దేశంలోని వివిధ రాష్ట్రాల వారు, అన్ని కులాల వారు, సకల మతాల వారు, సర్వ భాషల వారు, విభిన్న ప్రాంతాల వారు…! అన్ని సంస్కృతులకు చెందినవారు…! హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ మెట్రో సిటీగా మారటం వల్ల, ఇది ఒక చిన్న సైజు భారతదేశంలా, ఈ రోజు ఓ మినీ ఇండియాలా మారిపోయింది…! అన్ని రాష్ట్రాల ప్రజలు దీనిని “ఓన్” చేసుకొని, స్వంతం అనుకొని, ఇక్కడే స్థిరపడి, వాళ్ల కష్టంతో, వాళ్ళు బతుకుతున్నారు… వీళ్ళందరి సమిష్టి – సమైఖ్య కృషి తోనే హైదరాబాద్ మహానగరం ఈ రోజు ఎంతగానో అభివృద్ధి చెందింది… ఇది హైదరాబాద్ మహానగరం యొక్క, గొప్ప విశిష్టత…!
ఇకపోతే, భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో రహస్య ఓటింగ్ మాత్రమే జరుగుతుందనీ… ఎవరి ఇష్ట ప్రకారం, స్వేచ్చగా ఎవరు ఎవరికైనా, వారి ఓటు స్వతంత్రంగా వేయవచ్చనీ… అది ఎంతో రహస్యంగా ఉంటుందనీ, ఉంచబడుతుందని నమ్మే, మనబోటి ప్రజలను ఎన్నో అనుమానాలకు గురి చేస్తూ, కొందరు పనికిమాలిన స్వయంప్రకటిత మేధావులు, తీసేసిన తాబేదారులు, సొల్లు కబుర్లతో టైంపాస్ చేసే పదవీ విరమణ చేసిన పెద్దమనుషులు, పనికిమాలిన రిటైర్డ్ రాజకీయులు, పాతకాలం జర్నలిస్ట్ లు, టీవీ కెమెరాలలో పడితే చాలు – ఎక్కువగా కనపడాలని, నోటికొచ్చినట్టు అడ్డంగా వాగే నోటి దూల బ్యాచ్ కొందరు, యూనివర్సిటీలలో పిల్లలకు పాఠాలు తక్కువ – టీవీ ఛానెల్స్ స్టూడియోలలో సోది ఎక్కువ చెప్పే పనికిరాని ప్రొఫెసర్లు మరికొందరు, టీవీ ఛానెల్స్ స్టూడియోలలో చాలా కేర్ ఫ్రీ గా మాట్లాడుతూ చేసే… “ఓటింగ్ ఎవరు – ఎవరికి చేశారనే” సొల్లు అంచనాలూ, “ఎవరి ఓట్లు ఎవరికి పడ్డాయి” అని చేసే సుత్తి వ్యాఖ్యలు, శ్లేషలు – విశ్లేషణలతో అనవసర వ్యాఖ్యానాలు, కులాలవారీ – “మతాలవారీ – ప్రాంతాలవారీగా పడ్డ ఓట్లపై ఎడతెగని చర్చలు – విపరీత వ్యాఖ్యానాలు” చేసే ఇలాంటి వారిపై పోలీసులు ఖచ్చితంగా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి.
పరమ పవిత్రమైన ఓట్లను కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా అష్టవంకర్లుగా విడదీసి, అష్టదరిద్రంగా వర్గీకరించి – ఆకర్షించేలా విశ్లేషించి – ఆకట్టుకునేలా విశదీకరించి, ఓట్ల లెక్కలు నగ్నంగా విప్పి, మరీ ఓటింగ్ గణాంకాలు అతిశయోక్తులుగా చెప్పే వీరిపై పోలీసులు, కోర్టులు, పై-కోర్టులు, ఆ-పై-కోర్టులు, కేసులు నమోదుచేసి, సుమోటోలుగా కఠిన చర్యలు తీసుకోవాలి…!
సాధారణంగా ఓటర్లు, తమ-తమ వ్యక్తిగత – కుటుంబ – సామూహిక – సామాజిక అనుభవాలను బట్టి, తమకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు – సవాళ్ళు- పరిస్థితులు – అవగాహన – అనుభవాలను బట్టి, తమకు జరిగే మంచి-చెడులను వారి దృష్టికోణం నుండి మూల్యాంకనం చేసుకుని, బేరీజు వేసుకునే ఓట్లు వేస్తారు కానీ, ముఖ్యంగా మన దగ్గర మేధావి వర్గం అని చెప్పుకుని తిరిగే కొందరు మిడి-మిడి మేధకులు, బాగా చదువుకున్న వాళ్ళం – జ్ఞానులు అనుకునే కొందరు అజ్ఞానులు అనుకుంటున్నట్లు, టీవీ న్యూస్ చెత్త చర్చల్లో సుత్తి – సొల్లు – చెత్త కబుర్లు చెప్పే అతి-తెలివి అరకొర గాళ్లు చెప్పేటట్లు, కేవలం కొందరి అవగాహన, కొన్ని సమీకరణాలు, లేదా కొందరు చూసే దృష్టి కోణం నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు.
ఇక్కడే, చాలామంది నాయకులు, రాజకీయ పార్టీలు, రాజకీయ వర్గాల వాళ్ళు, కొందరు మిడి మిడి జ్ఞానులు, పాఠాలు చెప్పడం రాని ప్రొఫెసర్లు, మోడర్న్ మీడియా వాళ్లు చాలా పొరపాటు పడేది…!… ఒక ఓటర్, ఎవరికి ఓటు వేయాలి – వేశాడు అనేది, కేవలం అతను సంపూర్ణ విజ్ఞతతో, స్వచ్చమైన విచక్షణతో తీసుకునే అతని స్వయం సంకల్పిత నిర్ణయం…! వందశాతం అది, అతని వ్యక్తిగత వ్యవహారం…! దీనిపై , ఇతరుల జోక్యం – అనవసర చర్చలు – అర్థంలేని ఆన్-వాంటెడ్ విశ్లేషణలు పూర్తిగా నిషేధం – నిషిద్దం కావాలి…!
ఒకసారి ఎన్నికైన నాయకులు మొత్తం అందరి ప్రజలకు, పూర్తి మొత్తంగా సమిష్టి జవాబుదారీగా ఉండాలి కదా…! మొత్తం ప్రజలకు సమైక్యంగా ప్రాతినిధ్యం వహించాలి కదా…! అంతేగానీ, కేవలం వారికి ఓటు, ఎవరు వేసారో పరిశోధనచేసి – తెలుసుకొని – కనుక్కొని, వారికి మాత్రమే పనులు చేస్తారా? కేవలం, వారికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారా…? కేవలం, వారిని మాత్రమే పరిపాలిస్తారా…? అలా కుదురుతుందా…? సాధ్యమేనా…?వారికి ఓట్లు వేయని వారిని గుర్తించి, అవమానించి, వేధిస్తారా…? భారత రాజ్యాంగం ప్రకారం అది ఒక పెద్ద నేరం కాదా…? కోర్టులు – న్యాయస్థానాలు ఖచ్చితంగా, ఇందులో జోక్యం చేసుకోవాలి కదా…!
చాన్నాళ్ళ క్రితం అప్పట్లో తె.రా.స పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన, అప్పటి జీ.హెచ్.ఎం.సీ. ఎలెక్షన్లలో అఖండ విజయం సాధించినప్పుడు… ఆంధ్రా సెటిలర్లు అంతా తె.రా.స కు, పూర్తిగా – సంపూర్తిగా కేసీఆర్ – కేటీఆర్ లకు సంపూర్ణ మద్దతుగా, పూర్తి అనుకూలంగా వోటు వెయ్యడం వల్లనే జీ.హెచ్.ఎం.సీ. ఎలెక్షన్లలో తెరాస ఘన విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు ముక్తకంఠం తో పేర్కొన్నారు…! దశాబ్దకాలం క్రితం, అప్పట్లో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో, అప్పటికే రాష్ట్రంలో సంపూర్ణ అధికారంలోకి వచ్చిన తె.రా.స పార్టీకే, జీ.హెచ్.ఎం.సీ. ఎలెక్షన్ లో కూడా మద్దతు పలికితే హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి చెందుతుంది అని ఆంధ్రా ప్రాంత ప్రజలు పరిపూర్ణంగా విశ్వసించి ఉండవచ్చు…!
అదేంటి…!!! ఇదేంటి…!!! ఇది ఎలా సాధ్యం…!!!… ఆంధ్రా వాళ్లకు సిగ్గు లేదా…? లజ్జ లేదా…? షరం లేదా…?… మానం – అభిమానం లేవా…? వాళ్లను వ్యతిరేకించే, కేసీఆర్ కు, కేటీఆర్ కు, తె.రా.స కు… ఎలా వోటు వేస్తారు…?… ఇలా, ఎందరో ఎన్నో రకాలుగా, రక-రకాలుగా ఆంధ్రా వాళ్ళను ఎప్పటి లాగానే అప్పట్లో, చాలా ఆడి పోసుకున్నారు…! చాలా మంది, యథాశక్తి ఆంధ్రా ప్రజలపై విషం చల్లారు…! కానీ ఓటు వేయడం అనేటిది, ఎవరికి ఓటు వెయ్యాలి అనేటిది, ఆంధ్రా ప్రాంత ప్రజల హక్కు కదా…! ఆ విచక్షణ వాళ్లకి వుంది కదా…! అది ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదు కదా…!
ఉద్యమంలో భాగంగా, చాలా సార్లు ఆంధ్రా ప్రజలను, ఆంధ్రా ప్రాంతాన్ని, ఆంధ్రా సంస్కృతి ని గురించి చాలా నీచంగా, ఎంతో దరిద్రంగా, మరెంతో అవమానకరంగా మాట్లాడిన కొందరు నాయకుల్ని, కొన్ని పార్టీలను కూడా అప్పట్లో ఆంధ్రా ప్రజలు క్షమించి ఉండొచ్చు…! ఉండవచ్చు…! అది, వాళ్ల ఇష్టం…! అది, వారి విచక్షణాధికారం…! అది, వాళ్లకు రాజ్యాంగం ప్రసాదించిన ఒక విశిష్టమైన “ఓటు” హక్కు…! నోరు ఉంది కదా అని, అడిగేవాళ్ళు ఎవరూ లేరు కదా అని, మైక్ ల ముందు – టీవీ ఛానెల్స్ స్టూడియోలలోనూ, టీవీ కెమేరాల ముందు, మీటింగ్స్ లోనూ, ప్రజలను ఆకర్షించడానికి, కుల – మత – వర్గ – ప్రాంతీయ విభేదాలతో రెచ్చగొట్టి – విడగొట్టి , విజయవంతంగా రాజకీయలబ్ది పొందడానికి, ఓట్ల కొల్లగొట్టడానికి చాలామంది దిగజారుడు రాజకీయ నాయకులు ఏ లెవెల్ కైనా, ఎంతకైనా దిగజారతారు…! ఎంతటి నీచానికైనా – మరెంతటి నైచ్యానికైనా పాల్పడతారు…! దురదృష్టవశాత్తూ, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి మన పవిత్ర భారతదేశంలో పోలీసులు – న్యాయస్థానాలు – శాసనసభలూ – పార్లమెంట్ కూడా ఎంతగానో భయపడుతున్నాయి…!
“ఆంధ్రా” ప్రాంతాన్ని, అన్ని విధాలుగా అన్యాయం చేసి, ఆంధ్రా ప్రాంత ప్రజల ఆశలను, ఆకాంక్షలను, భవిష్యత్తునూ సర్వం – ఆసాంతం ఖూనీ చేసిన కాలకూట విషం లాంటి “ఎన్నో” దిగజారిన రాజకీయ పార్టీల కన్నా, అప్పట్లో హైదరాబాద్ లో బలంగా లేని కొన్ని పార్టీల కన్నా, కొందరు స్వార్థ -నీచ-నికృష్ట-వంకర -వంచక ఆంధ్రా రాజకీయ కీచక నాయకుల కన్నా, అంతా సమానమే – అందర్నీ మేం కలుపుకుంటాం అంటూ భరోసా ఇచ్చిన కొందరు నాయకులు చాలా మెరుగు అని, అప్పట్లో సెటిలర్స్ గా పిలవబడుతున్న ఆంధ్రా ప్రజలు భావించి ఉండొచ్చు..
కొందరి నాయకులపై కొత్త నమ్మకంతో, కొంత మందిపై భరోసాతో, ఒక కొత్త భవిష్యత్తును వాళ్ళు ఎంతగానో ఊహించుకొని ఉండవచ్చు అని మనం నమ్మితీరాల్సిన నిజం…! ఫలితంగానే, అప్పట్లో “కొందరి” అఖండ విజయం…! ఇది కూడా, వారికి భారతదేశ ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన, భారత రాజ్యాంగం ప్రసాదించిన ఒక గొప్ప హక్కు…!
మరి కొంతకాలం తర్వాత… మళ్ళీ కొన్నేళ్ల క్రితం కూడా, సెటిలర్లు అంతా మళ్ళీ, అప్పట్లో తె.రా.స కు, సంపూర్తిగా కేసీఆర్ – కేటీఆర్ కు మద్దతు గా, పూర్తి అనుకూలం గా వోటు వెయ్యడం వల్లనే తర్వాత జరిగిన మలి ఎలక్షన్లలో కూడా తెరాస విజయం సాధ్యమైందని, కొన్ని ఓట్లు – సీట్లు పోయినా,ఆ మాత్రమైనా, అలాగైనా ఒడ్డున పడిందని విశ్లేషకులు అప్పట్లో మళ్ళీ పేర్కొన్నారు…! ఇది కూడా, ఒక రకంగా నిజం అయివుండవచ్చు…! ఇది కూడా వారి విచక్షణ హక్కు…! అది, వారి ఇష్టం…! అది, వారి విజ్ఞత…! అది, వారి అభిప్రాయం…! అది, వారి నిర్ణయం…! అది, వారి స్వతంత్రత…! అది, వారికి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చ…!
ఎందుకు…? మళ్ళీ ఎందుకు…??? ఆంధ్రా ప్రాంతాన్ని – ప్రజలను, ను ఖూనీ చేసిన, ఎప్పటికీ నమ్మలేని కాలకూట విషం లాంటి కొన్ని పార్టీల కన్నా, నాయకుల కన్నా, ఏళ్లకు ఏళ్లు ఆంధ్రా కు ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్న, ఏమీ చేయని, ఏమీ చేయనివ్వని మరికొన్ని పార్టీల కన్నా, ఎంతో కొంత భరోసా ఇస్తున్న కొందరు నాయకులు లు చాలా మెరుగు అని వాళ్ళు మళ్ళీ భావించారు… నమ్మారు… ఆశించారు అనుకోవాలి…! అది కూడా, వారి విచక్షణ అధికారం…! వారి కున్న ఒక హక్కు…! దీనిని, ఎవరు ప్రశ్నించగలరు…?
ఆంధ్రా ప్రజల కృతజ్ఞత గురించి,వారి నమ్మకం గురించి, వారి విశ్వాసం గురించి, వారి విచక్షణ గురించి, వారి అభిప్రాయాల గురించి, వారి నిర్ణయాల గురించి, వారి హక్కుల గురించి, వారి అధికారాన్ని గురించి ప్రశ్నించే స్థాయి గానీ, యోగ్యత గానీ, నైతిక విలువలు ఉన్న రాజకీయ నాయకులు గానీ, రాజకీయ పార్టీ లు గానీ ఈ రోజు భారతదేశంలో ఎవరూ లేరు…! స్వాతంత్రానంతరం, అడుగడుగునా ఆంధ్రా ప్రాంతానికి, ఆంధ్రా ప్రజలకు ఇప్పటివరకూ కేవలం అధర్మమే… అన్యాయమే జరిగింది…! ఇది పచ్చి కాలకూట విషం లాంటి నిజం.
ఆంధ్రులపై, ఆంధ్రాప్రాంతం పై ఎందుకింత అంతులేని వివక్ష…? ఎందుకింత చిన్నచూపు…? ఎందుకింత పరమ నీచమైన పక్షపాతం…? ఇప్పుడైనా, ఇకనైనా ఈ రాజకీయ నాయకులు… పార్టీలు నిజంగా కళ్ళు తెరిచి, తప్పులు గుర్తించి, పునరాలోచించి, అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి…! లేకపోతే ఎంతవారికైనా, ఎలాంటి వారికైనా, ఎప్పటికైనా ఖచ్చితంగా, శాశ్వతంగా, రాజకీయ సమాధే…!
ఆంధ్రా – సీమాంధ్ర వాళ్లకు ఇంతవరకూ జరిగిన అన్యాయాల గురించి, ఇప్పుడు వివరంగా విడమర్చి చెప్తే, అర్థాలు, తాత్పర్యాలు, ఉపమానాలు, నిర్వచనాలతో రాసుకుంటూ పోతే, పేజీలకు పేజీలు రాసినా కూడా ఎన్నైనా సరిపోవు…! కొన్ని రాజకీయపరమైన నీచ – నికృష్ట – స్వార్ధ – వంచక – దుర్మార్గమైన కుట్రలకు – కుతంత్రాలకు ఆంధ్రా ప్రాంతం – ఆంధ్రా ప్రజలు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గరనుండీ, ఈ రోజు వరకూ కూడా బలి అవుతూనే ఉన్నారు.
కేవలం, కొందరు అవినీతిపరులైన స్వార్ధ రాజకీయ నాయకులవల్ల, అవకాశవాద రాజకీయాల వల్ల, కొన్ని నీచమైన రాజకీయ పార్టీల వల్ల వాళ్ళ “స్వంతం” అనుకున్నవే, రాత్రికి రాత్రే వారికి “పరాయి”వి గా చాలాసార్లు మారిపోయాయి…! వాళ్ళు ఇప్పటికే, ఎన్నో సార్లు రోడ్డున పడ్డారు…! ఎంతో నమ్మకద్రోహానికి గురైనారు…! దురదష్టవశాత్తూ, ఇప్పటికీ, ఆంధ్రా – సీమాంధ్ర ప్రజలు ప్రతిక్షణం అన్యాయానికి గురవుతూనే ఉన్నారు…!
మొదట్లో “ఆంధ్రము” అంటే తెలుగు అనీ, తెలుగు మాట్లాడే వారు అందరూ, ఆంధ్రులు అని చెప్పే వారు…! తెలంగాణం అంటే కూడా తెలుగు మాట్లాడే ప్రజలు ఉండే ప్రాంతం అని కూడా చెప్పేవారు…! అలా అనే, అలా చెప్పే ఆంధ్రా ప్రాంతాన్ని, హైదరాబాద్ రాష్ట్రంతో అప్పట్లో కలిపి తెలుగు వారందరినీ కలిపేసాం, అదే తెలుగు వారందరి “ఆంధ్రప్రదేశ్” అన్నారు…! రాను – రానూ కొందరు నాయకుల రాజకీయ లబ్ది కోసం, వారి స్వార్ధం కోసం, రాజకీయం కోసం, పదవులకోసం, పైసల కోసం, ఓట్ల కోసం సాక్షాత్తూ, తెలుగు తల్లినే దిక్కుమాలిన తల్లి!!! చెత్త తల్లి …!!! దరిద్ర తల్లి!!! అని కూడా అన్నారు.
ఇప్పటికే చేసిన, తీరని ద్రోహం చాలక, కొత్తగా, “సీమాంధ్ర” అనే కొత్త పదాన్ని కూడా కనిపెట్టి, వాడటం మొదలు పెట్టారు…! ఈ సీమాంధ్ర అన్న ‘సమాసం’ ప్రయోగమే ఒక తప్పు…! సీమాంధ్ర మూలాలు ఉన్న, ఆంధ్రా – రాయలసీమ ప్రాంతం కూడా, ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదు అని భవిష్యత్తులో చెప్పడానికి, ఇది కూడా మరో కుట్ర కావొచ్చు.. రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా “ఆంధ్రులు” కాదు అని కొత్త అర్థాలు – దీర్ఘాలు – రాగాలు తీసి మరోసారి, పదవులకోసం, పైసలకోసం, రాజకీయ స్వార్థం కోసం, ఓట్ల కోసం, ఇప్పుడు అవశేషంలా మిగిలిన, ఈ అవశేష-ఆంధ్రప్రదేశ్ ను కూడా, ఇంకోసారి మరో “శేష”విభజన చేసినా ఎంతమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు…!
ఈ ప్రపంచంలో అందరూ “సెటిలర్సే”…! ఒకరకంగా… ప్రపంచంలో ప్రతి ఒక్కరూ, ఎక్కడెక్కడ్నుంచో వచ్చినవాళ్లే…! ఎక్కడో ఒకక్కడ, ఒకకాడ, ఎదో ఒక దగ్గర నుంచి వచ్చి, మరెక్కడో “సెటిల్” అయినవాళ్ళ్లే…! ఎక్కడో పుట్టి, మరెక్కడో పెరిగి, ఇంకెక్కడో చదువుకొని, చివరికెక్కడో స్థిరపడి, ఇంకెక్కడో, అలా – అలా బతుకుతున్న వాళ్ళే అందరూనూ…! ఈ ప్రపంచంలో “పర్మినెంట్” రెసిడెంట్స్ అంటూ ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు…! కానీ, “సెటిలర్” అనే పదం ఒక తక్కువ స్థాయిని, అమర్యాదను, ఎంతో అగౌరవాన్నీ సూచిస్తుంది…! దయ చేసి ఆంధ్రా – సీమాంధ్ర ప్రజలను “సెటిలర్లు” అని మాత్రం పిలవకండి…! ఆంధ్రులకు కూడా మనోభావాలు ఉంటాయి కదా…? వారి మనోభావాలు దెబ్బతినవా…? ఇప్పటికే, ఎన్నో అవమానాలకు గురియిన ఆంధ్రులకు – సీమాంధ్రులకు! ఇంతకు మించిన అవమానం మరొకటి లేదు…!!!
అసలు, ఈ సెటిలర్స్! అన్న పదం ఎవరు కనిపెట్టరో కానీ, ఆ పదం వాడే చాలా మందికి అది ఒక అమర్యాదకరమైన, అభ్యంతరకరమైన పదం అని స్పురించకపోవడం గమనార్హం…! ముఖ్యంగా, ఆంధ్ర – తెలంగాణలుగా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన నేపధ్యంలో, ఒకప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలు రాజధాని ఉన్న హైదరాబాద్ లో, అప్పట్లో కేవలం మన రాష్ట్ర రాజధాని అని స్థిరపడిన ఆంధ్రులకు, “సెటిలర్స్” అనే పదంతో పిలవడం, ఎంతో అవమానకరం – తీవ్ర అభ్యంతరకరం అన్న స్పృహ కూడా చాలామంది ఉండటం లేదు…! ఒకరకంగా చెప్పాలంటే, సెటిలర్స్ అన్న పదాన్ని ఇక్కడ ఓటు హక్కు ఉన్న వలసవాదులు – కాందిశీకులు అనే అర్ధం లో కూడా వాడేస్తున్నారంటే కూడా ఎంతమాత్రం అతిశయోక్తి కాదు…!
ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం అప్పటి రాజధాని మద్రాసు – ఇప్పటి చెన్నై నగరంలో కూడా ఈ రోజుకీ ఎన్నో లక్షల మంది తెలుగు ప్రజలు ఇప్పటికీ స్థిరనివాసం ఏర్పరచుకుని బతుకుతున్నారు కదా…? భారతదేశం స్వాతంత్రానంతరం, ఎన్నో రాష్ట్రాలుగా విడిపోయినా కూడా, ఇప్పటికీ ఎన్నో భారతదేశ ముఖ్య నగరాలలో, ఇతర రాష్ట్రాల వారు, పక్క రాష్ట్రాలవారు, ఎందరో స్థిర నివాసం ఏర్పరచుకుని బతుకుతున్నారు కదా…?
వారిని ఎప్పుడైనా – ఎవరైనా, “సెటిలర్స్” అని పిలవడం చూసారా…? “సెటిలర్” అన్నట్లుగా విన్నారా…? కేవలం మన తెలంగాణాలోనే – మన హైదరాబాద్ లోనే ఇలా సెటిలర్స్ అంటూ ఎంతో నీచంగా, అవమానకరంగా పిలుస్తున్నారు…! ఇది చాలా గర్హనీయం…! కడు శోచనీయం…! నిస్సందేహంగా, ఖండనీయం…!… ఇలాంటివి మన భారతదేశ జాతీయ సమైక్యతకే ఒక తీవ్ర విఘాతం…! ఆంధ్రులకు ఇది ఎంతో అవమానకరం…! ఇది, “ఆంధ్రుల” “ఇజ్జత్”కా సవాల్ హై…!
కేవలం, ఆంధ్రులు – సీమాంధ్రులు మాత్రమే ఇక్కడ “సెటిలర్లా”…? హైదరాబాద్ లో – తెలంగాణాలో స్థిరపడ్డ ఇతర రాష్ట్రాల వారు మరి ఎవరు…? వారు సెటిలర్స్ కాదా…? వారెవ్వరినీ, ఇంత నీచంగా, అభ్యంతరకరంగా, అవమానకరంగా సెటిలర్స్ అని ఎవరూ ఎందుకు పిలవరు…? వారిని కూడా “సెటిలర్స్” అని హీనంగా – నీచంగా పిలవాలని ఎవరూ కోరుకోవడం లేదు…! కానీ, చట్టబద్దంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, భారతదేశంలో అందరూ సమానమే కదా…! కానీ, ఆంధ్రుల పైనే మరి, ఎందుకింత వివక్ష…? మరి, ఎందుకింత చిన్నచూపు…? మరి, ఎందుకింత పక్షపాతం…?
ఈ ప్రపంచంలోనే, ఎవ్వరూ – ఎక్కడా “పర్మినెంట్” రెసిడెంట్లు కాదు…! అందరూ, ఇక్కడ టెంపరరీ “రెసిడెంట్లు” గా కొంతకాలం బతికి-“పోయే” వాళ్ళం మాత్రమే, అనే స్పృహ ఎన్నటికీ మరవకండి ప్లీజ్…! ఇక్కడ “సెటిలర్లు” అంటూ ఎవరు లేరు…! ఉండరు…! ఉండబోరు…!!! సాటి మనుషులను, సాటి రాష్ట్రాల ప్రజలనూ మీరు ప్రేమించకపోయినా పర్లేదు…! గౌరవించకపోయినా పర్లేదు…! కనీసం, సాటి మనుషులుగా గుర్తించండి చాలు…! దేశవ్యాప్తంగా, భారతప్రజలు, కుల – మత – వర్గ విభేధాలు లేకుండా దేశంలో “ఎక్కడైనా” స్థిరపడి, తమ తమ కుటుంబాలతో సుఖసంతోషాలతో సర్వసమానంగా, “ఆత్మగౌరవంతో” బతకవచ్చనీ, జీవించవచ్చనీ, స్థిరపడవచ్చనే దానిని ఒక “ప్రధాన హక్కు”గా మన పవిత్ర భారత రాజ్యంగం, భరతదేశ ప్రజాస్వామ్యం సాక్షిగా మనకు చాలా స్పష్టంగా చెబుతుందనే విషయాన్ని, దయచేసి గమనించండి…! గుర్తించండి…! గౌరవించండి…!
పెన్మెత్స “రవిప్రకాష్” అశోకవర్మ
-శృంగవృక్షం, భీమవరం