-మొగల్తూరులో విషాదం
-ఉపాధి కూలీలపై మినీ వ్యాన్ దూకుడు
-ఇద్దరు అక్కడికక్కడే మృతి
-మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
(బహదూర్)
విధి వైచిత్రం అంటే ఇదేనేమో, అప్పుడే ఓ వివాహ కార్యాక్రమంలో పాల్గొని అక్షింతలు వేసి ఉపాధి పనులకు హాజరైన కూలీలలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన హృదయ విదారక ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో బుధవారం చోటుచేసుకుంది.
ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు పంచాయతీ నక్కావారిపాలేనికి చెందిన ఉపాధి కూలీలు బుధవారం తమ గ్రామంలో వివాహానికి హజరై అక్షింతలు వేసి వధూవరులను దీవించి ఉపాధి పనులకు హజరయ్యారు. సుమారు 15 మంది కూలీలు స్థానిక లాకు నుంచి నల్లంవారితోట వరుకు ఒకటిన్నర కిలో మీటర్ల పంటబొదెను తవ్వేందుకు సిద్ధమయ్యారు.
ఈపనిలో కొంత మంది కూలీలు దొడ్డి తిప్ప ప్రాంతంలో పంట బోదె తవ్వేందుకు సిద్దమవుతుండగగా ముత్యాలపల్లి నుంచి మొగల్తూరు వస్తున్న మినీ వ్యాన్ ఓ సైకిల్ తప్పించబోయి ఉపాధి కూలీలపైకి దూసుకువెళ్ళింది.
దీంతో దొడ్డితిప్ప ప్రాంతంలో పనులు చేపట్టిన ఉపాధి కూలీలు కడలి పావని (40), గుబ్బల గంగాదేవి (50) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు కూలీలు గుడాల వీర వెంకట సత్యనారాయణ. గంగాదేవి భర్త గుబ్బలా మాణిక్యాలరావు తీవ్రంగా గాయ పడ్డారు.
ప్రమాద స్థలికి కలెక్టర్, ఎమ్మెల్యే
ఈ సమాచారం తెలుసుకోగానే జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులను ఎమ్మెల్యే నాయకర్ అప్రమత్తం చేశారు. ఆర్డీవో దాసి రాజు, డ్వామా పీడీ డాక్టర్ కెసిహెచ్ అప్పారావు, డీఎస్పీలు శ్రీవేద, మానస, సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐలు వాసు, నాగలక్ష్మీలు ఘటనా స్థలానికి చేరుకుని సహామక చర్యలు చేపట్టారు.
పంటబోదెలో వ్యాన్ కింద భాగంలో ఎవరైనా కూలీలు కూరుకుపోయి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో అధికారులు అప్రమత్తమై హైడ్రాలిక్ యంత్రాన్ని తీసుకువచ్చి బోదెలో పడిన వ్యానును బయటకు తీయించారు.. పంట బోదెలో మృతదేహలు ఉన్నాయనే అనుమానంతో గాలించగా బోదెలో మనుషులు ఎవ్వరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు .
గుంటూరు జిల్లా నరసారావు పేట నుంచి వంట నూనె లోడుతో నరసాపురం వైపు వెళుతున్న వ్యాన్ అదుపు తప్పి ప్రమాడానికి గురై పరారైన వ్యాన్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
మృతులకు నష్టపరిహారం
ఉపాధి పనుల నిమిత్తం వెళ్ళి మృతి చెందిన ఇద్దరు మహిళలకు రూ.50 వేలు చొప్పున, క్షతగాత్రులు ఇద్దరికి రూ. 25వేలు చొప్పున నష్టపరిహారం అందచేస్తామని డ్వామా పీడీ డాక్టర్ కెసిహెచ్ అప్పారావు తెలిపారు. చంద్రన్న భీమా పధకంలో రూ 5లక్షల చొప్పున పరిహారం మృతుల కుటుంబ సభ్యులకు అందే అవకాశం ఉంద న్నారు .
జిల్లా కలెక్టర్ పరామర్శ
ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిని, గాయలపాలైన వారిని జిల్లా కలెక్టర్ నాగరాణి పరామర్సించి తీవ్ర దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేశారు. నరసాపురం ఏరియా ఆసుపత్రిలో క్షతగాత్రులయిన గుబ్బల మాణిక్యాలరావు, గుడాల సత్యనారాయణలు పరామర్శించారు. మాణిక్యాలరావును మెరుగైన చికత్స నిమిత్తం భీమవరం, వర్మ ఆసుపత్రికి తరలించాలని డాక్టర్లునుఆదేశించారు. బాదితులను ప్రభుత్వ పరంగా అదుకుంటామని బాదిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు